Home తాజా వార్తలు అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

farmer-sucide

మహబూబ్‌నగర్ : చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్థాపంతో పురుగులమందు తాగి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి… మండలంలోని గంగాపురంకు చెందిన సీతారత్నం శ్రీనివాస్‌రెడ్డి(55) అనే రైతు శనివారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన స్వంత పొలం సుమారు 4 ఎకరాలతో పాటు 3 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. వీటిలో వరి, పత్తి, టమాటా పంటలను సాగుచేస్తున్నాడు. కాగా ఇటీవల వర్షాభావ పరిస్థితుల కారణంగా చేసిన అప్పులు తీర్చలేనన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలోని ఏపీజీవీబీలో సుమారు లక్ష రూపాయలు, సమీప బంధువుతో మరో లక్ష రూపాయలతో పాటు మరి కొందరితో కలిపి, మొత్తం సుమారు 4లక్షల రూపాయలు అప్పులున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటన స్థలానికి మండల తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీశైలంలు చేరుకుని విచారణ చేపట్టారు. భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీశైలం తెలిపారు.