Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ప్రసవం

Govt.-Hospital

తెలకపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు చేయించుకోండి… కెసిఆర్ కిట్‌ను పొందండి అంటూ ప్రభుత్వం ఒక వైపు గొప్పగా ప్రచారం చేసుకుంటుండగా ప్రభుత్వ ఆసుపత్రి గేటు ముందు కన్న శిశువుకు కనీసం బొడ్డు కూడా కత్తిరించడానికి ఆసుపత్రిలో సిబ్బందిలేని దిక్కుమాలిన పరిస్థితి తెలకపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొంది. సోమవారం తెల్లవారు జామున జరిగిన ఈ సంఘటనకు సంబందించి బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… జిల్లా పరిధిలోని లింగాల మండలం రాంపురం గ్రామానికి చెందిన మహేశ్వరికి గ్రామంలో ఉండగానే పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. తెలకపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకు వచ్చారు. ఆసుపత్రి గేటులోకి రాగానే ఆటోలోనే ఆమె శిశువుకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు బాలింతను ఆసుత్రిలోపలికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో సిబ్బంది అందుబాటులో లేరు. కనీసం పుట్టిన శిశువుకు బొడ్డు కత్తిరించేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదు. రెండు గంటల వరకు బాలింత,శిశువు అలాగే ఉండాల్సి వచ్చింది. అనంతరం ఓ నర్స్ అక్కడి వచ్చి తల్లీబిడ్డలకు వైద్యం అందించింది.

పట్టించుకునే వారు లేరు
లింగాల ఆసుపత్రికి వెళితే ఇబ్బంది కలుగుతుందని తెలక పల్లి ఆసుపత్రికి తీసుకొచ్చాం. నర్స్‌లు, సిబ్బంది లేకపోవడం తో గేటు వద్ద కాన్పు అయిన నాకోడలిని పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రభుత్వ ప్రచారాన్ని నమ్మివస్తే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. -శంకరమ్మ,రాంపురం

ప్రచారం ఎక్కువ పనితక్కువ
ప్రభుత్వ ఆసుపత్రులకు సంబందించి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి తగ్గట్లు పనితీరు లేదు. అధికారుల మాటలు నమ్మి ప్రభుత్వ ఆసుపత్రికొస్తే పట్టించుకునే వారు లేకుండా ఉన్నారు. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో గర్బిణి గోస చూసిన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదనడానికి తెలకపల్లిలో ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటన నిదర్శనం. ఈ పరిస్థితులు మారాలి. ప్రభుత్వం స్పందించాలి.
ఎం యాదయ్య, బిజెపి మండల అధ్యక్షులు

ప్రత్యామ్నాయం లేకుండానే వెళ్లింది
విధులు నిర్వహించాల్సిన స్టాఫ్ నర్స్ శివలీల తమ బంధువులు ఎవరో చనిపోయారని సమాచారం ఇచ్చింది. సూపర్ వైజర్‌కు చెప్పి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి వెళ్లాలని సూచించా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్షంగావెళ్లింది. జరిగిన సంఘటన గురించి పై అధికారులకు ఫిర్యాదు చేస్తా. డా.అరవింద్, తెలకపల్లి ,పిహెచ్‌సి

Comments

comments