Home దునియా నేటి మనిషి

నేటి మనిషి

దుఃఖాన్నంతా లోపలికి నెట్టేసుకుని పలుకరిస్తే చాలు కిలకిలానవ్వడం. అవును అంతకంటే ఏం చెయ్యగలదు. అది పుట్టగానే పసికందును వొదిలేసి పోయిన తల్లి, తప్పదురా అని దేవుడ్ని నిందిస్తూ అమ్మమ తిట్లతో, తన్నులతో పెరిగిన బాల్యం. 

Women

సాయంత్రానికి గుర్తొచ్చి బాలనీకు వెళ్ళిన కోమలి కుర్చీ మీద కుప్పకూలి పోయింది.  రెండు గూళ్లు మాయమై పోయినయ్. సీకులు పట్టుకుని పిచ్చిదానిలా వాచ్‌మెన్ కోసం కేకలేసింది. వెనకనే గంగులు గయ్ మంటూ అరుస్తూ వచ్చింది.

అనగా అనగా ఒక కాకమ్మ. ఒక పిట్టమ్మ.
కాకమ్మ కట్టెలగూడు కట్టుకుంది.
పిట్టమ్మ పిడకల గూడు కట్టుకుంది.
ఒక రోజు పెద్దవానపడి పిట్టమ్మ పిడకల గూడంతా తడిసిపోయింది. అప్పడు పిట్టమ్మ కాకమ్మ కట్టెలగూడు ముందు కొచ్చి కాకమ్మా కాకామ్మ తలుపుతీయవా .. అడిగింది.
“ నా బిడ్డకు స్నానం పోస్తున్న కాసేపుండు.” అంది కాకి.
మళ్లీ తలుపు తీయమని అడిగింది పిట్ట.
“ వుండు. నేను స్నానం చేస్తున్నా.”
తలుపు తీయమని మళ్లీ అడిగి ంది.
గణ గణమని కాలింగ్ బెల్ మోత విని కోమలి ఈ లోకంలో కొచ్చింది. మళ్ళీ గణగణ శబ్దం “ వుండవే తల్లీ వస్తున్నా” అంటూ గబ గబా వెళ్లి తెలపుతీసింది కోమలి. ఎంతసేపైంది తలి బెల్లు కొట్టి కొట్టి గిప్పడినపడ్డది తవరికి” నవ్వుతూ వచ్చి యుద్ధానికి వెళ్లే సైనికుడిలా పమిట కొంగు చెక్కుకొని బోళ్ల మీద దాడి చేయడానికి బాల్కనీలో కెళ్లింది పని మనిషి గంగులు.
“ అవును గంగమ్మా. నువ్వు చాలా సేపటి నుండి బెల్ కొడ్తున్నావటే” ఆశ్చర్యంగా అడిగింది కోమలి.
“ అండ్ల అవద్దమేవున్నది తల్లీ” అని గలగలా నన్వింది గంగులు.
గంగులు అలా నవ్వడం కోమలికిష్టం. “ ఎంతబాగా నవ్వుతావే. నీనవ్వింటుంటే మందూమాకూ లేకుండా వంట్లోవున్న రోగాలన్నీ పోతాయే.” అంటున్న కోమటి మాటలు విని గంగులు మళ్లీనవ్వింది.
బోళ్లు తోముతున్న గంగులుతో చూశావే గంగూ ఈ బాల్కనీలో రెండు పిచ్చుక గూళ్లు ఉదయాన లేవగానే కిచకిచలాడుతూ ఈ గూళ్లల్ల పక్షులెగిరిపోతుంటే పిండారబోసిన వెన్నలరేయి అరుబయట నులక మంచం మీద మా నాయనమ్మ నన్ను నిద్రబుచ్చే ముందు చెప్పే కాకమ్మ పిట్టమ్మ కథ గుర్తోచ్చింది. ఈ కథ నిజంలాంటి అబద్దాల కథ. ఇప్పడన్పిస్తుంది కాకమ్మ, పిట్టమ్మల తలుపులెప్పుడూ తెరిచివుంటాయి. తలుపులు మూసుకునేది రెండు చేతులున్న జీవులమైన మనమేనని. కోమలి మాటలు విని అంట్లుతోముతున్న గంగులు బాల్కనీ సువ్వల మధ్యన వున్న గూళ్లను చూస్తూ మంచి తావు ఎన్నుకున్నయమ్మ. ఎండపడని తావు. వాన పడ నితావు. పొద్దంతా తిరిగే పిట్టకు తావుంది. ఏ తావు లేని దాన్ని నేనే”.గలగలా నవ్వే గంగులు గొంతు జీరపోయింది. ఇంకా పిచ్చుకలగూర్చే ఆలోచిస్తూ వాటితో పాటు బాల్యంలోకి వెళ్లిపోయిన కోమలి చటుక్కున ఉలిక్కిపడింది.. గలగలానవ్వే గంగులు బతుకు తెగిన గాలిపటం. తాడు లేని బొంగరం. దానికి తెలిసినవి రెండే. అస్త్తమానం రెక్కలు ముక్కలు చేసుకొని పనిచేయడం.
దుఃఖాన్నంతా లోపలికి నెట్టేసుకుని పలుకరిస్తే చాలు కిలకిలానవ్వడం. అవును అంతకంటే ఏం చెయ్యగలదు. అది పుట్టగానే పసికందును వొదిలేసి పోయిన తల్లి, తప్పదురా అని దేవుడ్ని నిందిస్తూ అమ్మమ తిట్లతో, తన్నులతో పెరిగిన బాల్యం. వయసుకు మించిన పనులు చెప్పి గొడ్డు చాకిరి చేయించుకున్న మేనమామ అతని భార్య.
నా అనే వాళ్లు లేని ఆ ముళ్ల పొదలో విలవిల లాడుతున్న ఆ అమాయకురాలి స్థితిని కనిపెట్టి నీకు నీడలాంటి తోడులాగా వుంటానని మురిపించిన వాడితో తొందరపడి ముందే కూసిన కోయిలలా విందులు చేసి కొద్దికాలానికే ఏ విచారణా, విడాకులు లేకుండా చెత్తను వొదిలించుకున్నంత తేలిగ్గా వొదిలి వెళ్ళిపోయిన భర్త.
దాని కథంతా విన్న కోమలి ఎన్నోసార్లు వాడికోసం వెతికితే బావుందని అనుకునేది. కాని తప్పిపోతే వెతుకుతాంగాని తప్పించుకుపోతే ఎలా వెతుకుతామని మళ్లీ అనుకునేది.
భర్త ఎక్కడో దూరదేశాన వుద్యోగం. కొడుకు పొద్దుననగా వుద్యోగానికని వెళితే ఏ రాత్రికో రావడం. పొద్దంతా వంటరిగా వుండే కోమలికి కదలికలేని సముద్రంలాంటి ఆ అపార్టుమెంట్‌లోపల కనబడని అలజడేదో వెంటాతున్నట్టుండేది. ఏ చుట్టు పక్కాలింటికి వెళ్లాలన్నా, పిలవాలన్నా దూరాభారం.
తన చిన్నప్పుడంతా ఊర్లో విశాలమైన తన ఇంటి ఆవరణలో వున్న పెద్ద పెద్ద వేప, చింత, మామిడి వృక్షాల మీద కిచకిచలాడుతూ రివ్వున ఎగిరే పక్షులు, సీతాకోక చిలుకలు, తంగేడు పూతకతుక్కపోయిన రింగన పురుగులు, కాచ్ఛారోడ్‌లో ఢమఢమ శబ్దం చేస్తూ ఎడ్ల బండ్లు, ఆవురంకెలు, కోడికూతలు, గొర్రెల మందలు, పిచ్చుకల కిచకిచలు ఇవన్నీ పోయిన జన్మలో అనుభవించినంత దూరమై ఎడారిగావున్న కోమలి బతుకులో ఎన్నోయేండ్ల తర్వాత పక్షుల కిచకిచల శబ్దంతో చెప్పరాని మధురానుభూతిని అనుభవిస్తూ వంటరినతనమంతా తరిమేసినట్టనిపించింది.
ఏ కాస్త సమయం దొరికినా బాల్కనీలో కుర్చీ వేసుకుని హాయిగా ఆ గూళ్ళను చూస్తూ కాలాన్ని క్షణంలా గడుపుతోంది. క్రమంగా

అంతమైపోతున్న పిచ్చుకజాతి పెరగాలంటే అది గుడ్డు పెట్టాలి. గుడ్డు పెట్ట్లాలటే గూడు వుండాలి. గూడు లేని పిట్ట బతుకెంత దుర్భరం అని ఆలోచిస్తున్న సమయంలో గూటిలో సన్నగా పిచ్చుకల సంభాషణ విన్పిస్తోంది.
తనను చూసి బెదిరిపోతాయేమోనని కోమలి నిశ్శబ్దంగా కూర్చుంది. తల్లి పిచ్చుక బిడ్డను తన రెక్కల్లో పొదుముకుంటూ అంటోంది“ బిడ్డా నా తల్లి నన్ను పొలాల మీదికి తీసుకొని పోయేది. అప్పుడు నేలంతా జొన్న, సజ్జ, రాగులు, పరిగెలు, పాలు పోసుకుంటున్న లేతబొత్తల సువాసనలలో వుండేది. పిల్లలేడిస్తే బలం పక్షికెగిరతే బలమని అమ్మ అంటూ కొండలదాకా, గుట్టలదాకా అలుపు సొలుపు లేకుండా నన్నెగిరించేది. ఊర్లల్లవున్న గుడిసెల గూళ్ల దగ్గర్నే వడ్ల కర్రలు, కంకులు, వేలాడివుండేది. నోటి ముందట్నే మేత. ఇప్పుడా పైర్లు లెవ్వు. కళ్లాలులెవ్వు, కంకులు లెవ్వు. పొద్దంతా తిరిగినా మేత దొరకడం కష్టమైతుంది. నీటి జాడ లేనేలేదు.
“ మరి ఇంకో తానకు పోదామా? ’ బిడ్డ అడగుతోంది.
“ ఎక్కడికి పోతం బిడ్డ, వూళ్లళ్ల పత్తి, మిరప, తోటల్ల తిరిగితే గత్తరవాసనొస్తుంది.
నీవు పుట్టక ముందు వూళ్లనొదలలేక అక్కడ్నే అడవుల్లో, కంచెల్లో, పొదల్లో కాలం గడిపేవాళ్లం. కాని అక్కడ కూడా మమ్ములను నేటి మనిషి బతకనీయలేదు. పెద్ద పెద్ద మోటర్లతో చెట్లు, గుట్టలు, కంచెలు, పొదలు అన్నీ పెకిలించిండు. ఏం చేస్తాం బిడ్డా, సృష్టిలో చేతులున్నది ఈ ప్రాణి కొక్కడికే. ఏదో ఒక రోజు చేలున్న ఈ ప్రాణి వల్ల మృగ, పక్షి, జంతు జాలమంతా నశించిపోతాయి. అందుకే పల్లె పట్టులొదిలి ఈ పట్టణానికొచ్చినం.
కోమలి హృదయం ద్రవించి పోయింది. వాటి సంభాషణతో ఆకలిని కూడా మర్చిపోయి బాల్కనీలో అలాగే కూర్చుండి పోయింది.
“ అయ్యో అమ్మ ఈ పిట్ట కాలిరిగిందమ్మ” హడావిడిగా చెప్పింది గంగులు.
“ అరెరె. ఎంత పని జరిగిందంటూ” వంటగది నుండి వురికనట్టొచ్చింది కోమలి.
“ అవును తల్లి, కొన్ని నూకగింజలు చల్లు” అంటూ గంగులు ఆ పిట్టను చేతుల్లోకి తీసుకుని నూనె, పసుపు కలిపి మెల్లగా రుద్దింది. అది ముడుచుకుని గంగులు చేతిలో వొదిగి పోయింది. కోమలి హృదయం ఘోషించింది. కిచకిచ మంటూ ఆ గింజల్ని మెల్లగా పొడుచుకు తిన్నది ఆ పిట్ట.
ఆ మధ్యాహ్నం వరకు ఎక్కడెక్కడి పిచ్చుకల గుంపులు నోటితో మేత తెచ్చి దాని ముందుంచుతున్నాయి. గంగులు నూనె, పసుపుతో రోజూ కాలిరిగిన పిట్టకు ఇంటి వైద్యం చేస్తూనే వుంది. రోజటిలా ఒక రోజు మేత తెచ్చిన తల్లి పిట్ట కిచకిచా అరుస్తూ, బాల్కనీ అంతా తిరుగుతుంది. ఏమైందని కోమలి వచ్చి చూస్తే పిల్ల పిచ్చుక కనబడలేదు. కోమలిని చూసి భయపడి తల్లి పిచ్చుక రివ్వున బయటికెళ్లిపోయింది. కోమలి అక్కడ అంతా వెతికితే చెత్తబుట్ట పక్కన నక్కింది. మెల్లగా ఆ చిన్నదాన్ని బయటికి తీసుకొచ్చి వొదలి ఏం జరుగుతుందో చూద్దామన్నట్టు కోమలి లోపలికెళ్లింది. అక్కడక్కడే తిరుగుతున్న తల్లి కోమలి లోపలి కెళ్లగానే మళ్ళీ వచ్చి ఎదురుగా కన్పించిన బిడ్డ దగ్గర వాలింది. కోమలి మాతృహృదయం పులకించింది.
సంక్రాంతి పండుగ సంబరంగా వస్తోంది. పండుగ పనిలో నిమగ్నమైన కోమలి పిచ్చుక గూళ్లను పట్టించుకోలేదు.
సాయంత్రానికి గుర్తొచ్చి బాలనీలకు వెళ్ళిన కోమలి కుర్చీ మీద కుప్పకూలి పోయింది. రెండు గూళ్లు మాయమై పోయినయ్. సీకులు పట్టుకుని పిచ్చిదానిలా వాచ్‌మెన్ కోసం కేకలేసింది. వెనకనే గంగులు గయ్ మంటూ అరుస్తూ వచ్చింది.
“ గంగులూ పిచ్చుక గూ..ళ్లు”
“ అవునమ్మా. గా వాచ్‌మెన్ పెద్దబూజు కర్రతో చెత్తంతా దుల్పుకుంటూ గూళ్లను పడగొట్టిండట. గందుకే కోపంగా అరిచివస్తున్నా”
కోమలి కొయ్యబారి పోయింది. జీవితమంతా చిన్నదై పోయినట్టయింది. ప్రపంచమంతా కుంచించుకు పోయినట్టయింది.
నిండు వున్నమినాటి చంద్రుడు నీలాకాశంలో మబ్బులమాటు నుండి పరుగిడుతున్నాడు. గంగులు బిక్కుమిక్కుమంటూ శూన్యంలోకి చూస్తూ “ ఆ పిట్టలు మళ్లీ వస్తాయా అమ్మా” అని దిగులుగా అడుగుతోంది.
కోమలి కళ్లముందంతా ఖాళీ
కళ్లల్లో నీళ్లు
“ నీ ప్రశ్న నాకర్థమైంది గంగులూ.కాని జవాబు మాత్రం నా దగ్గర లేదు” అంది నిర్లిప్తంగా..

వేముగంటి శుక్తిమతి

 99081 10937