Search
Sunday 18 November 2018
  • :
  • :

బీహార్‌లో దుర్మార్గం

మహిళను నగ్నంగా ఊరేగించిన దుండగులు
ఆర్‌జెడి నేతతో పాటు ఆరుగురి అరెస్టు

 Woman Paraded Naked On Streets In Bihar

బీహార్ : బీహార్ రాష్ట్రీయ జనతాదళ్ నేతతో పాటు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. ఒక మహిళ విమలేష్ షా అనే వ్యక్తిని చంపిందని అనుమానించి ఆమెని నగ్నంగా ఊరేగించారని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సంఘటన బీహార్‌లోని భోజ్‌పూర్‌లో చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన 19 ఏళ్ల విమలేష్ షా అనే యువకుడు 24 గంటల తరువాత రైల్వే ట్రాక్ ప్రక్కన శవమై కనిపించాడు. దీంతో జిల్లాలోని బిహియా బ్లాక్‌లోని మార్కెట్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయని భోజ్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ అవకాష్ కుమార్ చెప్పారు. మృతుడైన షా సొంత ఊరు దామోదర్‌పూర్‌లోని వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని అక్కడికి దగ్గరలో ఉన్న రెడ్ లైట్ ఏరియాలోని వారే చంపారని అనుమానించారని ఆయన తెలిపారు. మృతుడికి సంబంధించిన గ్రామస్తులు మార్కెట్‌లోని దుకాణాలకు నిప్పు పెట్టారు. అనేకమంది స్థానికులపై దాడికి దిగారు.

దాడులు చేస్తున్న వారు ఒక మహిళని వీధిలో పట్టుకుని, బట్టలు చింపి నగ్నంగా మార్చి ఆ మహిళని తన్నుకుంటూ, కొట్టుకుంటూ ఊరేగించారని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సంఘటనతో బిహియా పోలీస్ స్టేషన్‌కు చెందిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్, జిఆర్‌పి ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు మరో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అల్లర్లకు దిగిన మూకలు అటువైపుగా వెళ్తున్న రైలుపై రాళ్లు రువ్వాయని ఆయన తెలిపారు. షా హత్యపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, అల్లర్లకు పాల్పడిన, మహిళని నగ్నంగా ఊరేగించిన వారిపై కేసు నమోదు చేశామని సూపరింటెండెంట్ అవకాష్ కుమార్ చెప్పారు.

అరెస్టయిన వారిలో ఆర్‌జెడి నేత కౌషల్ కిశోర్ యాదవ్ కూడా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, సిఎం నితీష్ కుమార్ రాజీనామ చేయాలని ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు. మహిళల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాంతి భద్రతలు కరువైన బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని హిందుస్తాన్ అవామి మోర్చా చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మంజి డిమాండ్ చేశారు. అయితే ఆర్‌జెడి నేత కుషాల్ కిశోర్ యాదవ్ ఎన్నో హీనమైన సంఘటనల్లో పాల్గొన్నాడని, బిహియా ఘటనలోనూ ఆయన హస్తముందని అధికార జనతాదళ్ ( యునైటెడ్ ) ఎంఎల్‌సి, పార్టీ ప్రతినిధి నీరజ్ కుమార్ ఆరోపించారు.

Comments

comments