Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి

విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు తెలిపిన భర్త
భర్తే కొట్టి చంపాడని మృతురాలి బంధువుల ఆరోపణ
వెలుగురాళ్ళ తండాలో ఉద్రిక్తత

Husband-Murdered-to-Wife

మనతెలంగాణ/ రంగారెడ్డి: కడ్తాల్ మండలంలోని మైసిగండి పంచాయతీ వెలుగురాళ్ళ తండాలో బుధవారం వివాహిత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. కడ్తాల్ ఎస్‌హెచ్‌వో సుందరయ్య తెలిపిన వివరాల ప్రకారం…… నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చౌదర్‌పల్లి పంచాయతీ బద్య్రగాని తండాకు చెందిన సంగీతను(28) 2002వ సంవత్సరంలో వెలుగురాళ్ళ తండాకు చెందిన ఇస్లావత్ రాజుతో వివాహం జరిగింది. వీరికి త్రిశ, భరత్ అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా బుధవారం ఉదయం తమ సొంత వ్యవసాయ పొలం వద్ద బోరు మోటార్ స్టాటర్ పక్కన సంగీత అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్య విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిదని ఇస్లావత్ రాజు తండా వాసులకు తెలిపాడు.

తండా వాసుల నుంచి సమాచారం తెల్సుకున్న మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై ఉన్న గాయాలను చూపిస్తూ సంగీతను భర్తే కొట్టి చంపి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు చిత్రీకరిస్తున్నాడని, ఇస్లావత్ రాజు వచ్చేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదని ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న కడ్తాల్, ఆమనగల్లు ఎస్‌ఐలు సుందరయ్య, మల్లీశ్వర్‌లు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు సిద్దమవుతుండగా పోలీసులతో మృతురాలి బంధువులు వాగ్వాదానికి దిగారు. వారితో మాట్లాడిన ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది వారిని ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. సంగీత సోదరుడు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Comments

comments