Home తాజా వార్తలు నటుడి వస్త్ర దుకాణంలో చోరీ చేసిన నేరస్థురాలి అరెస్టు

నటుడి వస్త్ర దుకాణంలో చోరీ చేసిన నేరస్థురాలి అరెస్టు

Woman Thief arrested who theft in actor Uttej's Clothes Shop

హైదరాబాద్: సినీ నటుడు ఉత్తేజ్ వస్త్ర దుకాణంలో చీరలు చోరీ చేసిన మహిళను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన రెండు నెలల తర్వాత ఆమె పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని తాడేపల్లికి చెందిన కనకదుర్గమ్మ (50) మేలో కూకట్‌పల్లిలో ఉండే తన బంధువుల ఇంటికి మరో ఇద్దరితో కలిసి వచ్చింది. వారు ముగ్గురూ కలిసి మే 17న ఎల్లారెడ్డిగూడలో ఉన్న ఉత్తేజ్ బట్టల షాపుకు చీరలు కొనేందుకు వచ్చారు. అయితే, చీరలు కొంటున్నట్టు నటిస్తూ ఉప్పాడ, బనారస్‌ పట్టుచీరలను కనకదుర్గ దొంగిలించి మెల్లగా అక్కడి నుంచి ఉడాయించింది. వారు వెళ్లిపోయిన తర్వాత చీరల లెక్క చూస్తే 20 చీరలు తక్కువ వచ్చాయి. దీంతో చీరలు దొంగలించబడ్డాయని షాపు నిర్వాహకులు వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసిటివి ఫుటీజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలిని, ఆమె సహాయకులను గుర్తించారు. ఈ క్రమంలో కనకదుర్గమ్మ విజయవాడకు చెందిన పాత నేరస్తురాలిగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో విజయవాడ వెళ్లిన ఎస్సార్ నగర్ పోలీసులు అమెను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు.