Home ఆఫ్ బీట్ లక్ష్మీ రావే మా ఇంటికి..!

లక్ష్మీ రావే మా ఇంటికి..!

Women have a devoted relationship to the placenta

శ్రావణమాసానికి మహిళలకూ అవినాభావ సంబంధం ఉంది.  లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, తమ కుటుంబాన్ని చల్లంగా చూడమని అమ్మను వేడుకుంటూ ప్రతి మహిళా వరలక్ష్మీవ్రతాన్ని నోచుకుంటుంది. శ్రావణమాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంనాడు  వరలక్ష్మీవ్రతాన్ని జరుపుకుంటారు. ముత్తయిదువులకు వాయన తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడాలు, బంధువులు స్నేహితులతో విందుభోజనాలు ఆరగిస్తారు.  వరలక్ష్మీ వ్రతాన్ని  ఏవిధంగా చేసుకోవాలో తెలియజేసే ప్రయత్నం సకుటుంబం పాఠకుల కోసం …. 

‘‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం’’…

వ్రతాలు ఏం చేసినా ప్రత్యేక కోరికలు తీరాలనుకున్నప్పుడు కలశస్థాపన చేసితీరాలి. మార్కండేయ పురాణంలో వరలక్ష్మీవ్రత సంబంధమైన గాథలున్నాయి. భృగు మహర్షికి ఖ్యాతి అనే భార్యకు లక్ష్మీదేవి కూతురుగా పుట్టింది. పూర్వం విష్ణుమూర్తి వక్షస్థలంపై తన్నిన భృగు మహర్షి, పశ్చాత్తాపంతో అమ్మ కోసం తపస్సు చేసి ప్రసన్నం చేసుకుని ఆమెను కూతురుగా పొందాడు. శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు భృగువుకు కూతురుగా పుట్టింది లక్ష్మీదేవి. అలా ఆరోజు నుంచి వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోవడం ప్రారంభమైనట్లు పురాణ గాథ.

వ్రతానికి కావలసిన పూజా సామగ్రి : పసుపు : 100 గ్రా., కుంకుమ : 100 గ్రా., ఒక డబ్బా : గంధం, విడిపూలు, పూల దండలు : 6, తమల పాకులు : 30, వక్కలు : వంద గ్రా., ఖర్జూరాలు 50 గ్రా.,అగరవత్తులు, కర్పూరం, రూపాయి నాణాలు, ఒక తెల్ల టవల్, జాకెట్ ముక్కలు, మామిడి ఆకులు, ఒక డజన్ అరటిపండ్లు, ఇతర ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫొటో, కలశం, కొబ్బరి కాయలు, తెల్లదారం లేదా పసుపు రాసిన తోరం ః 2, స్వీట్లు, బియ్యం 2 కిలోలు, కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు, దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్స్,ట్రేలు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, బౌల్స్.

కంకణం ఎలా తయారుచేసుకోవాలి : తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. తోరాన్ని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి పూజించి ఉంచుకోవాలి. తోరాన్ని తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధం కావాలి. నవ సూత్ర శుభప్రదం. నవ అంటే కొత్తది అని అర్థం, నవ అంటే తొమ్మది దారాలు కలిగినదని అర్థం. తోరాన్ని వ్రతం చేసుకున్న ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కట్టుకోవాలి. ఆడవాళ్లయినా సరే కుడిచేతికే కట్టుకోవాలని శాస్త్రం చెబుతోంది. వంశం నిలవడానికి, ధనం నిలవడానికి తోరం పనిచేస్తుంది. ఆ తొమ్మిది నవరంధ్రాలకు, నవనాడులకు, నవగ్రంధులకు సంకేతాలు.

వ్రత విధానం: వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి.

గణపతి పూజ: అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యేవక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక అంటూ
గణపతిపై అక్షతలు చల్లాలి. యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణికాయ నమః
ఓంలంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓంధూమకేతవే నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయనమః
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూ స్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!!
నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓం వ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
కలశపూజ : కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదో యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాల పైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.
అధాంగపూజ: పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.
చంచలాయై నమ:  పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, మలవాస్యినమ: – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యే నమ:- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమ: – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్మై నమః – సర్వాణ్యంగాని పూజయామి. (ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి)
తోరానికి పూజ :తోరాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ కింది విధంగా పూజ చేయాలి.
కమలాయైనమ:- ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః – ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రేనమః – తృతీయ గ్రంథిం పూజయామి,
విశ్వజన్యనమ: – చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మై నమః – పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిన్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోద్యనమః – అష్టమగ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీయై నమ: – నవమ గ్రంథిం పూజయామి అంటూ శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి.
వ్రత కథాప్రారంభం: శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పాడు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు.ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒక దానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వర
లక్ష్మీవ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు గల యోగ్యురాలు.
వరలక్ష్మీ సాక్షాత్కారం : వరలక్ష్మీ వ్రతానికి ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి ‘హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు.

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే, శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జెలు ఘల్లు ఘల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీవ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగిడారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు. ఈ కథ విన్నా, వ్రతం చేసినా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పాడు.ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి.