Home అంతర్జాతీయ వార్తలు సౌదీ మహిళకు మరో సడలింపు

సౌదీ మహిళకు మరో సడలింపు

soudi-imageసౌదీ మహిళకు మరో సడలింపు
రియాద్ : సౌదీ అరేబియాలో మహిళలను స్పోర్ట్ స్టేడియంలలోకి ఇదే తొలిసారిగా వచ్చే ఏడాదినుంచి అనుమతిస్తారు. ఇంతకుముందు కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశం ఉన్న క్రీడా మైదానాలలోకి స్త్రీలను, కుటుంబాలను అనుమతించే ఈ చారిత్రక నిర్ణయాన్ని అధికారులు ఆదివారం ప్రకటించారు. మితవాద సాంప్రదాయాలను కఠినంగా అమలు చేసే సౌదీ అరేబియా మహిళలపట్ల అత్యంత తీవ్రమైన ఆంక్షలను అమలు చేస్తోంది. అయితే ప్రపంచం విమర్శలనుంచి తప్పించుకోవడానికి తన వైఖరిని ఇటీవల సవరించుకొంటోంది. కొద్దినెలల క్రితం మహిళల వాహనాల డ్రైవింగ్ హక్కును గుర్తిస్తూ నిర్ణయం ప్రకటించించింది. ఇప్పుడు ఆటల స్టేడియంలలోకి మహిళలను అనుమతిస్తామని మరో చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశపు శక్తివంతమైన యువరాజు మహ్మద్ బీన్ సల్మాన్ చేపట్టిన సంస్కరణల పర్వంలో ఇది భాగం. రియాద్, జద్దా, తమ్మామ్ లోని మూడు స్టేడియంలలోకి మహిళలను 2018 ఆరంభంనుంచి అనుమతిస్తారు. జనరల్ స్పోర్ట్ అథారిటీ ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆ మైదానాల లోపల రెస్టారెంట్లు, కఫేలు, వీడియో స్క్రీన్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. గతనెల ఫుట్‌బాల్ క్రీడలకు పేరుబడిన రియాద్‌లోని ఒక స్టేడియంలోకి వందలమంది మహిళలను అనుమతించారు. అది సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం రోజున ఆ ఘటన జరిగింది. సౌదీ లో అమలులో ఉన్న పురుష సంరక్షక వ్యవస్థ ప్రకారం కుటుంబంలోని తండ్రిగాని, భర్తగాని, సోదరుడు గాని మహిళ చదుకోవడానికి, ప్రయాణించడానికి లేదా ఇతర కార్యకలాపాలకు  అనుమతి  ఇవ్వాల్సి ఉంటుంది.