Home లైఫ్ స్టైల్ లేచింది మహిళాలోకం…

లేచింది మహిళాలోకం…

Women

 

వేకువ జామునే స్కూటీలపై ఆ ఊరి మహిళలు రయ్.. రయ్ మంటూ పరుగులు తీస్తారు. ఏ చిన్న అవసరం వచ్చినా పురుషులపై ఆధారపడకుండా వారి పనులు వారే చేసుకుంటున్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంబిస్తూ అధిక దిగుబళ్లు సాధిస్తున్నారు. ఉద్యోగం చేస్తున్న మహిళలకు మేము ఏమాత్రం తీసిపోమంటూ మారుతున్న కాలంతో పాటు దూసుకెళ్తున్నారు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన మహిళారైతులు.

ఒకప్పుడు వ్యవసాయంలో పురుషులకు సాయంగా ఉంటూ కూలీ పనులు చేస్తుండేవారు మహిళలు. పొలానికి వెళ్లాలంటే కుటుంబంలోని వాళ్లెవరైనా తమ వాహనాలపై తీసుకెళ్తుంటారు లేదా… కాలినడకనే ఎంత దూరమైన నడిచి వెళ్లేవారు. కానీ.. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో మాత్రం సొంతంగా వాహనాలను నడుపుతూ కాలం మారిందని నిరూపిస్తున్నారు మహిళా రైతులు.

వ్యవసాయ క్షేత్రంలో మహిళా కుసుమాలు: జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌లో దాదాపు 100 మంది మహిళారైతులు పొలానికి వెళ్లేందుకు, పశులవులకు మేత తేవడానికి, కూరగాయలు అమ్మేందుకు మార్కెట్‌కు పురుషులపై ఆధారపడకుండా తమ సొంత స్కూటీలపై వెళ్తున్నారు. అన్ని పనులు వారే చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయ పనులన్నీ చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

గడపగడపకూ ఓ స్కూటీ: మహిళలు వాహనాలు నడపడం ఒకప్పుడు పట్టణాలకే పరిమితం. ఇప్పుడు కాలం పూర్తిగా మారింది. అన్ని గ్రామాల్లోనూ అతివలు వాహనాలు నడుపుతున్నారు. లక్ష్మీపూర్‌లో మాత్రం ప్రతీ ఇంట్లోనూ ద్విచక్రవాహనం నడిపే మహిళలున్నారు. గడపగడపకూ ఓ స్కూటీ ఉంది.

లక్ష్మీపూర్ అది ఓ బ్రాండ్: లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్న 15 వందల కుటుంబాల్లో దాదాపు 12 వందల రైతు కుటుంబాలున్నాయి. ఆధునిక పద్ధుతుల ద్వారా అధిక దిగుబడులు సాధిస్తూ ఇప్పటికే ఈ ఊరు ఆదర్శంగా నిలిచింది. వారి పంటలను వారే లక్ష్మీపూర్ బ్రాండ్‌తో మార్కెట్లో విక్రయించడం మొదలు పెట్టారు. సంఘంగా ఏర్పడి విత్తనాలు, ఎరువుల్ని సమకూర్చుకుంటున్నారు. వీటికితోడు స్కూటీలపై దూసుకెళ్తూ మహిళారైతులు ప్రత్యేకత చాటుతున్నారు.

Women Live Independently