Home స్కోర్ మహిళల ఆసియాకప్ హాకీ విజేత భారత్

మహిళల ఆసియాకప్ హాకీ విజేత భారత్

hocke2కకమిగహర (జపాన్): ఆసియాకప్ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో 54 తేడాతో చైనాను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. అంతేగాక ఈ విజయంతో వచ్చే ఏడాది జరిగే మహిళా హాకీ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కాగా, దక్షిణ కొరియా కాంస్య పతకాన్ని సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కొరియా 10 తేడాతో ఆతిథ్య జపాన్‌ను ఓడించింది. ఇదిలావుండగా భారత మహిళా జట్టు ఆసియా కప్‌లో విజేతగా నిలువడం 2004 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా, ఈ ఏడాది భారత పురుషుల జట్టు కూడా ఆసియా కప్ హాకీలో టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
హోరాహోరీ…
ఆదివారం జరిగిన ఫైనల్ పోరు ప్రారంభం నుంచే నువ్వానేనా అన్నట్టు సాగింది. రెండు జట్లు కూడా అద్భుత ఆటను కనబరిచాయి. ఒకరి గోల్ పోస్ట్‌పై మరోకరు దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించాయి. అయితే పటిష్టమైన డిఫెన్స్ వల్ల రెండు జట్లు కూడా గోల్స్ సాధించలేక పోయాయి. చైనాతో పోల్చితే భారత్ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే చైనా గోడను తట్టుకొని గోల్స్ చేయలేక పోయింది. అయితే ఎట్టకేలక భారత్ నిరీక్షణ ఫలించింది 25వ నిమిషంలో స్టార్ క్రీడాకారిణి నవ్‌జ్యోత్ కౌర్ భారత్‌కు తొలి గోల్ అందించింది. తర్వాత భారత్ మరింత పుంజుకొని ఆడింది. అయితే ప్రథమార్ధంలో మరో గోల్‌ను సాధించలేక పోయింది. రెండో అర్ధభాగంలో కూడా హోరాహోరీ పోరు తప్పలేదు. రెండు జట్లు కూడా గోల్ కోసం సర్వం ఒడ్డాయి. అయితే భారత్‌కు మెరుగైన అవకాశాలు లభించినా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయింది. ఒకటి రెండు సార్లు గోల్స్ చేసే అవకాశాలు దక్కినా దాన్ని సద్వియోగం చేసుకోవడంలో విఫలమైంది. ఇదిలావుండగా ఆట నాలుగో క్వార్టర్‌లో చైనా పుంజుకుంది. వరుస దాడులతో భారత్‌ను హడలెత్తించింది. వీరి ధాటికి భారత్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఇదే క్రమంల 47వ నిమిషంలో తియాన్ తియాన్ లువో చైనాకు మొదటి గోల్ అందించింది. దీంతో స్కోరు 11తో సమమైంది. తర్వాత కూడా రెండు జట్లు గోల్స్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అయితే మరో గోల్ చేయడంలో మాత్రం విఫలమయ్యాయి. నిర్ణీత సమయం ముగిసే సమయానికి రెండు జట్లు సమంగా నిలిచాయి.
దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో కూడా ఉత్కంఠ పోరు సాగింది. రెండు జట్లు కూడా అసాధారణ ఆటను కనబరిచాయి. రెండు జట్ల క్రీడాకారిణిలు తమ షాట్లను సద్వినియోగం చేసుకోవడంలో సఫలమయ్యారు. దీంతో పోరు 44తో సమంగా నిలిచింది. చివరి అవకాశంలో భారత కెప్టెన్ రాణి గోల్ కొట్టింది. దీంతో భారత్ 54 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఐదో షాట్‌ను గోల్‌గా మలచడంలో చైనా క్రీడాకారిణి విఫలమైంది. భారత గోల్ కీపర్ సవిత అసాధారణ ప్రతిభతో చైనా క్రీడాకారిణి గోల్ చేయకుండా అడ్డుకుంది. అంతే భారత్ ఆసియాకప్ విజేతగా అవతరించింది. ఈ గెలుపుతో భారత బృందంలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు చైనా క్రీడాకారిణిలు బోరున విలపించారు.
అభినందనల వెల్లువ…
ఇదిలావుండగా ఆసియాకప్ మహిళల హాకీలో విజేతగా నిలిచిన భారత జట్టుపై అభినందనల వర్షం కురిసింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు భారత జట్టును అభినందించారు. అద్భుత ఆటతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, క్రికెటర్లు రహానె, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ, మాజీ స్టార్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, మహ్మద్ కైఫ్ తదితరులు కూడా భారత హాకీ జట్టును అభినందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీరంతా హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు.