Home ఆఫ్ బీట్ శ్రీ శక్తయ్యింది

శ్రీ శక్తయ్యింది

అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నా, మగతృష్ణ మహిళని వెనక్కి లాగుతూనే ఉంది. అమ్మా, అక్కా, చెల్లి, భార్య ఒకెత్తు ఇతర మహిళలు ఒకెత్తు మగదృష్టిలో.. ఎంతెత్తు ఎదిగిన స్త్రీ అయినా మగాడి చూపులో దిగిన స్త్రీగానే మిగులుతుంది. కార్యాలయాల్లో, పనిచోటుల్లో కాస్త మర్యాదలు నటిస్తున్నా సినీరంగంలో మాత్రం ‘అవకాశం ఇస్తే ఏమిస్తావ్’ అంటూ ‘కమిట్మెంట్’ చేయించడం జరుగుతుంది. సరిగ్గా ఇక్కడే ఆమె బలహీనతని క్యాష్ చేసుకుంటారు. ఏవో స్టార్ హీరోయిన్ల కథలు చదివి కలలరెక్కలు తొడిగి కళల ప్రపంచానికి తరలివస్తే…ఇదేమిట్రా దేవుడా అంటూ లోపల్లోపల కుమిలిపోతూ ‘కమిట్’ కాకుండా మళ్లీ వెనక్కి వెళ్లిపోతే కాకుల్లా పొడిచే సమాజం గుర్తొచ్చి, ఒప్పుకోవాలా , తప్పుకోవాలా డైలమా ఇన్నాళ్లు…ఇప్పుడు ఒక చిన్న ఆశ శ్రీరెడ్డి రూపంలో.. సినీ చీకట్లను కాస్తయినా కరిగిస్తుందా…?

 సినిమా ఇండస్ట్రీలో మహిళలను అంగడిబొమ్మలుగా చేసి ఆడుకుంటోందని మహిళా లోకం గర్జిస్తోంది..ఇంత జరుగుతున్నా ఇండస్ట్రీలోని పెద్దలు అనబడేవారు ఎవ్వరూ ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నిస్తోంది..రీల్‌లైఫ్‌లోనే హీరోలా..రియల్ లైఫ్‌లో కాదా అని నిలదీ స్తోంది..శ్రీరెడ్డి ఉదంతం తర్వాత ఆమెకు మద్దతుగా  పలువురు ఆర్టిస్టులు మీడియా ముందుకు వచ్చారు. వారికి మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు సినీ రంగంలో ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగింది. ఇందులో మహిళా నటులు శ్రీరెడ్డి, అపూర్వ, క్యారెక్టర్ ఆర్టిస్టులు సునీతారెడ్డి, సంధ్యానాయుడు, హేమలతోపాటు మహిళా సంఘాల ప్రతిని ధులు సంధ్య, దేవి, న్యాయవాదులు, రచయిత్రులు, మహిళా పాత్రికేయులు పాల్గొన్నారు. సినీ రంగంలో జరుగుతున్న అకృత్యాలు ఆపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సినీ పెద్దలు ముందుకు వచ్చి తమ సమస్యలపై చర్చించాలని లేకుంటే లైంగిక వేధింపుల వెనుక ఎవరెవరున్నారో పేర్లతో సహా బయట పెడతామని ఆర్టిస్టులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏం మాట్లాడారో చూద్దాం..

మా శక్తేంటో చూపిస్తాం…

cini5

ఒక్క సినిమా పూర్తయ్యేనాటికి ఎందరో అమ్మాయిలు నలిగిపోతారు ఇండస్ట్రీలో. మాంసాన్ని అమ్మినట్లు మానాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది. లేకుంటే అవకాశాలు రావు. నామటుకు నేను ఎన్నోసార్లు అవకాశాల కోసం అడిగితే, తమతో గడపమని అన్నారు. నటనంటే ప్రాణం కాబట్టి అవకాశం ఇస్తారనే ఆశతో వారితో గడిపాను. అయినా అవకాశం ఇవ్వలేదు. మోసం చేశారు. నా వేదనను చెప్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇలాంటప్పుడు ఎవరి బట్టలు విప్పకుండానే ఆవేదనతో నా బట్టలు నేనే విప్పుకున్నాను. ఇలా సినీ ఇండస్ట్రీలో మోసపోతున్న అమ్మాయిలెందరో ఉన్నారు. అవకాశాలిస్తానంటూ ఎంతోమందిని వాడుకున్న వాకాటి అప్పారావును ఎవరూ ఎందుకు ప్రశ్నించరో అర్థం కావడంలేదు. వాకాడ అప్పారావు గురించి తీవ్ర స్థాయిలో ఓ ప్రముఖ చానల్‌లో మాట్లాడాం. ఆ మరుసటి రోజే రంగస్థలం సక్సెస్ ఫంక్షన్ చేసుకున్నారు. వాళ్ల సంస్థలో ఓ ఉద్యోగి ఇంత మంది అమ్మాయిల ఉసురుబోసుకుంటే ..మీకేం పట్టదా? తీగలాగితే డొంక కదులుతుందని మీకు భయం. ఇంకా పేర్లున్నాయి. కచ్చితంగా ఒక్కొక్కరిని బయట పెడతాం. హీరోలకేమో కోట్లకు కోట్లు ఇస్తారు. కేరక్టర్ ఆర్టిస్టులకు ఇవ్వడానికి బాధెందుకు. తెలుగు హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణం. ఒకమ్మాయిని బట్టలు విప్పుకుని నిరసన తెలియజేస్తే, దీని గురించి ఇంటర్నేషనల్ లెవల్లో జనాలు మాట్లాడుతూ ఉంటే లోకల్ నాయకులుగానీ, ప్రతిపక్షాలు గానీ , సినిమా హీరోలుగానీ ఒక్కరూ నోరువిప్పలేదు. అంటే వాళ్లకు తెలీదా? వాళ్లకు వినబడట్లేదా? ఫిల్మ్ నగర్ రెడ్‌లైట్ ఏరియాలా తయారయింది. ఆరు దాటిందంటే వీళ్ల విచ్చలవిడి చేష్టలకు అంతం లేదు. ఏమైనా అంటే శ్రీరెడ్డి బూతులు మాట్లాడింది అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. కడుపుమండిపోతేనే కదా అలాంటి మాటలు వచ్చేది. ఇంత మెయిన్‌టెయిన్ చేస్తున్నా, యాక్టింగ్ చేయడం వచ్చినా అవకాశాలు ఇవ్వకుంటే మండదా.. బూతులు రావా?
హీరోలు నల్లగా, చామనచాయగా ఉండొచ్చు. హీరోయిన్లు మాత్రం తెల్లగా,హైట్‌గా ఉండాలా? డాన్సర్లను కూడా ఫారెన్ నుంచి తీసుకొస్తున్నారు. ఎవరైనా గిల్లినా, గిచ్చినా చెప్పుకోవడానికి ఇక్కడ ఒక ఉమెన్ వింగ్ లేనేలేదు. డబుల్ మీనింగ్‌లు, అది ఇది అని ఆడోళ్ల గురించి మాట్లాడితే ఊరుకోం. తెలుగు అమ్మాయిల గురించిగానీ, స్కిన్ కలర్ గురించి గానీ ఇకనుంచి ఎవరైనా మాట్లాడితే మాత్రం గుడ్డలూడదీసి కొడతాం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రాన్స్‌జెండర్లను కూడా భాగస్వామ్యం చేయండి. డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకు హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తులో షూటింగ్‌ల మీద తెగబడిపోయి స్త్రీశక్తి అంటే ఏంటో చూపించే రోజులొస్తాయి. ఇప్పట్నుంచే జాగ్రత్తగా ఉండండి. కేసిఆర్ నాయకత్వంలో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం.

అధ్యయన కమిటీ వేయాలి..

cini7

ఇక్కడ సినీ కళాకారుల బాధలు మేం విన్నాం. కానీ అందరి సమక్షంలో మాట్లాడితే వీళ్ల బాధేంటో అందరికీ తెలుస్తోంది. సినీ రంగంలో  లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీ ఎంత తీవ్రంగా ఉందో వీళ్ల మాటలు వింటే తెలుస్తోంది.  తెరమీద రంగుని, ఆకారాలని, మనుషుల్ని, స్త్రీలని డి గ్రేట్ చేసి చూపించగలిగే సినిమా ఏదైనా ఉందంటే అది మన తెలుగు సినిమానే.  జస్టిస్ వర్మ కమిటీ తరహాలో సినిమా రంగంలో జరుగుతున్న అంశాలపై అధ్యయన కమిటీ వేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారానే మహిళా ఆర్టిస్టుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇండస్ట్రీలో కో ఆర్డినేటర్ వ్యవస్థను తొలగించాలి.

 ప్యాకేజీల కోసం అమ్ముడుపోయాడు..

cini2

సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక, ఆర్థిక దోపిడీపై ఓపెన్ డిబెట్ పెట్టాలి. దానికి సినీ పెద్దలు హాజరవ్వాలి. అప్పుడు మేం బడా బాబుల బాగోతాలు పేర్లతో సహా బయటపెడతాం. ఎన్నో సర్జరీలు చేస్తే గానీ హీరోలు కాలేని మొహాలు వారివి. ఇండస్ట్రీలో అమ్మాయిలకు అన్యాయం జరిగితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చెప్పాడు. అలా చేస్తే పీఎస్‌లు సరిపోవు సర్.  పోలీసుల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు. మీకు  మా గురించి ఆలోచించేందుకు టైమే లేదు. ఉచిత సలహాలు మాత్రం ఇస్తారు.  ప్యాకేజీల కోసం పవన్ అమ్ముడుపోయాడు.  మహిళలెవరూ పవన్‌కు ఓటెయ్యరు. ఇది నిజం.  శివాజీరాజా ఎందుకు బయటకు రావడం లేదు. వస్తే పరువు పోతుందని భయమా?

ఆమె వెనకాల మేమంతా ఉన్నాం..

cini1
మమ్మల్ని అనుభవించేముందు మీ ఇంట్లో వాళ్లు గుర్తుకురారా. చిన్న చిన్న అమ్మాయిలతో ఆడుకుంటారా. పసిమొగ్గల్ని ఇండస్ట్రీలో ఎందుకు చంపుతున్నారు. మొన్న చానల్ వాళ్లు అడిగారు. నిరసన ఎలాగైనా తెలియజేయవచ్చు. అది మన ఇష్టం. ఇంతమంది గోడు పట్టించుకోకుండా ఉంటే ఫిల్మ్‌చాంబర్ ముందు ఆత్మహత్య చేసుకుంటాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఆఫర్లు ఇవ్వకపోగా ఈ అంగాలు ఎలా ఉంటాయో చూపించు అంటూ సినీ వెధవలు వికృత ఆనందాలు పొందారు. అమ్మ యాక్టింగ్ కోసం కూడా పరాయి ఆర్టిస్టులు కావాలా? స్త్రీశక్తి వెనకాల మేమందరం ఉన్నాం.

మానవతాకోణంలో చూడండి..

cini10

కేవలం శ్రీరెడ్డి మాత్రమే కాదు చాలా మంది ఉన్నారిక్కడ. అందరూ కలవండి. వీళ్ల ద్వారా బయటకు వస్తే సరిపోతుంది అనుకోవద్దు. మహిళలకు మహిళలైనా సపోర్ట్‌గా ఉండాలి. మా అసోసియేషన్ వీరికి తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. ‘మా’ అంటే అమ్మ. బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడే బాధ్యత కదా. ‘మా’ అసోసియేషన్ వారికి మరింత అండగా ఉండండి. ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడండి. ఆడపిల్లను సాటి మనిషిగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం  బాధ్యత తీసుకోవాలి. మానవతాకోణంతో చూడాలి.ఇంకెవ్వరూ ఈ ఫీల్డ్‌లోకి రాకుండా ఉండాలని మాత్రం చూడకండి.

సినీ పరిశ్రమ ఉలిక్కిపడ్డది..

cini3

ఇండస్ట్రీలో కనిపిస్తున్న మౌనం భయంకమైన కుట్రలా కనిపిస్తోంది. మా అసోసియేషన్ తన గొయ్యి తానే తవ్వుకుంది. నిర్భంధం అనే మాట శ్రీరెడ్డిని కదిలించింది. ఇప్పుడు వీరికి మేం అండగా ఉన్నాం. ఈ యుద్దం ప్రజా జీవితానికి సంబంధించింది. ఇండస్ట్రీకి కాదు. మహిళలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు.

సమస్యపై పోరాడతాం

cini4

ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుపడాలి. కొండేపూడి నిర్మల అప్పుడే జూనియర్ ఆర్టిస్టులపై ఓ ఆర్టికల్ రాసింది. ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువైంది. ఆర్టిస్టుల వెనుక మేం ఉన్నాం. సమస్య తీరేవరకూ పోరాడదాం. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదో అర్థంకాదు. ఇదంతా చట్టపరిధిలోకి తీసుకురావాలి. సినిమాల్లో ఆడపిల్లల జీవితాలు నాశనమౌతుంటే ఎవరికీ పట్టదా.

మీ మధ్య చిచ్చుపెట్టే అవకాశం ఉంది..

cini9

సినీ రంగంలో కేవలం లైంగిక దోపిడీ మాత్రమే కాకుండా కనీస సౌకర్యాలు లేని దశలో అక్కడ ఉన్న మొత్తం మహిళలు, పిల్లలు, ఆర్టిస్టులు ఇబ్బందులు పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. దీన్ని మహిళా సంఘాలు సీరియస్‌గా తీసుకున్నాయి. శ్రీరెడ్డి ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిసన్ సుమోటాగా స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరణ కూడా కోరింది.సినీ రంగంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రస్తుతం సంఘటితమౌతున్న ఆర్టిస్టుల మధ్య ఇతరులు చిచ్చుపెట్టే అవకాశాలున్నాయి. వాటన్నింటికి బెదరకుండా నిలబడాలి.

మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా..?

cini8

సినిమా ఆర్టిస్టులకు కనీస వేతనాలు రాకుండా బ్రోకర్లే తీసుకుంటున్న మాట నిజం. సినిమా పెద్దలెవ్వరూ దీనిపై పెదవి విప్పరెందుకు? తాత వయసున్నవారుకూడా తమతో గడపాలని అమ్మాయిలను కోరుకుంటున్నారు. సిగ్గులేదా? పైగా శ్రీరెడ్డి గుడ్డలిప్పుకుందంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.  తెలుగు ఆర్టిస్టులకు నెలలో పది రోజులు షూటింగ్ ఇవ్వండి. కోఆర్డినేటర్లు లేకుండా చూడండి. నేను ఇలాంటి సమస్య ఫేస్ చేయలేదు. కానీ శ్రీరెడ్డి ద్వారా తెలుసుకున్నా. చాలా మంది అమ్మాయిలు బాధపడుతున్నారు. ఒక వెయ్యి రూపాయల కోసం అమ్మాయి ఇంత మంది దగ్గర పడుకోవాల్సిన అవసరం ఏంటండి.  మనకు నచ్చని వ్యక్తి పక్కన కూర్చుంటేనే సహించలేం. అలాంటిది వాళ్లిచ్చే వెయ్యి కోసం అమ్మాయిలు ఇలా పడుకోవాలా? యూట్యూబ్‌ల్లో కామెంట్లు పెట్టేవాళ్లు ఎంత శాడిస్టుల్లా తయారయ్యారు. బూతు కామెంట్లు పెడుతున్నారు. ఏం మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీరు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు బూతు కామెంట్లు పెట్టవద్దు.

శ్రమకు తగ్గ ఫలితం కావాలి…

cini6

సినిమా కంపెనీ 3500 నుంచి 4వేలు ఇస్తుంటే మధ్యలో కోఆర్డినేటర్లు తీసుకుంటున్నారు. మాకు మాత్రం కేవలం 1500 ఇస్తున్నారు. మమ్మల్ని జలగల్లా పీడిస్తున్నారు. ఇంక ఊరుకునేదిలేదు. శ్రమకు తగ్గ ఫలితం మాక్కావాలి. ఇండస్ట్రీలో మా కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. పట్టించుకునే నాథుడులేడు. నరకయాతన అనుభవిస్తున్నాం. సీఎం కేసీఆర్ అయినా మా సమస్యల్ని పట్టించుకోవాలి.ఇండస్ట్రీలో పదేళ్ల నుంచి ఉన్నాను. అమ్మయిలనే అడుగుతున్నారు అని అంటున్నారు. కాదండి నాలాంటి ఆంటీలను కూడా అడుగుతున్నారు. 80 ఏళ్ల ముసలివాళ్లను కూడా వాడుకుంటున్నారు. ఉదయం లొకేషన్‌లో అమ్మా అని పిలుస్తారు. కానీ సాయంత్రం అయ్యేసరికి సంధ్యా ఏంచేస్తున్నావ్ అంటారు. పదిహేడేళ్ల కుర్రాడు కూడా అసభ్యకర మెసేజ్‌లు పెడతాడు. మేం ఎవ్వరికీ చెప్పుకోలేం ఇలాంటి బాధలు. కమిట్‌మెంట్ ఇస్తే క్యారెక్టర్లు ఇస్తారు ఇది నిజం. నేను స్టేజీ ఆర్టిస్టులను. నందులు వచ్చాయి. నేను చేసిన యాక్టింగ్‌కి. ఇక్కడ మాత్రం పనికిరావట్లేదు. ఇక్కడ మగవాళ్లే వేశ్యలు. ఆడోళ్లు కాదు.

– మల్లీశ్వరి వారణాసి