Search
Wednesday 21 November 2018
  • :
  • :

ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి

harish

*విజ్ఞానాన్ని పెంచుకోవడానికి సైన్స్‌ఫేర్‌లు దోహదం
*ప్రభుత్వ పాఠశాలల్లో పిటిఎంలు నిర్వహించాలి
*మంత్రి టి.హరీశ్‌రావు

మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : కెసిఆర్ సిఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తున్నారని వాటి సత్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌ను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు అన్ని వసతి సౌకర్యాలు కల్పించడమే కాకుండా డిజిటల్ తరగతులను ప్రారంభించి ఆధునిక సాంకేతికతను వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇందుకు ఉదాహరణ సిద్దిపేటలోని ప్రశాంత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలేనన్నారు. ప్రతి పాఠశాలను స్వచ్ఛ పాఠశాలగా రూపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సైన్స్‌ఫేర్‌ల వల్ల విద్యార్థుల్లో వున్న ప్రతిభ వెలుగులోకి రావడంతో పాటు అందరూ విజ్ఞానవంతులు కావచ్చని అన్నారు. సైన్స్‌ఫేర్‌లు మొక్కుబడిగా నిర్వహించకుండా విద్యార్థుల పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని కలిగించడానికి సైన్స్‌ఫేర్‌లు ఎంతో దోహదపడతాయని అన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించి మొదటి స్థానంలో నిలిచేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేసి రాశికన్న వాసి ముఖ్యమేనన్న విధంగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల్లో నెలకొకసారి పేరెంట్, టీచర్స్ మీటింగ్‌లను నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం కోసం 13.13 కోట్ల రూపాయలను మంజూరు చేసామని తెలిపారు. కలెక్టర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ సైన్స్‌ఫేర్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీటి ద్వారా విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఒ విజయలక్ష్మి, చైర్మన్ కె.రాజనర్సు, కౌన్సిలర్ మోయిజ్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సైన్స్‌ఫేర్‌లో 436 ఎగ్జిబిట్స్‌ను విద్యార్థులు ఫ్రదర్శిస్తున్నారు. ఈనెల 6వ తేదీ వరకు ఈ సైన్స్‌ఫేర్‌ను నిర్వహించనున్నారు. సమావేశం అనంతరం మంత్రి హరీశ్‌రావు విద్యార్థుల ఎగ్జిబిట్స్‌ను పరిశీలించారు.

Comments

comments