Home ఎడిటోరియల్ ఆరోగ్య హక్కులపై అవగాహనే ఎయిడ్స్ వ్యాధికి అంతం

ఆరోగ్య హక్కులపై అవగాహనే ఎయిడ్స్ వ్యాధికి అంతం

aids

ఏ ప్రాంతమైనా, ఏ స్థాయికి చెందిన వ్యక్తులకైనా, ఎలాంటి పరిస్థితులలో నివసించే వారికైనా కనీస ప్రాథమిక హక్కు ఆరోగ్యపరిరక్షణ. ఇల్లుఒళ్లు శుభ్రత చాలా రోగాలని దూరం చేస్తుంది. వీటిపై అవగాహనలోపం సర్వరోగాలకి పునాది వేస్తుంది. అలా ప్రపంచాన్ని వణికించే వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటని ప్రపంచ ఎయిడ్స్ దినమైన ఈ రోజు తెలుసుకోవాలి. అందుకే ‘రైట్ టు హెల్త్’ అనే నినాదంతో ప్రపంచంలో పలు దేశాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వ్యాధి నివారణకి కృషి చేస్తున్నాయి. 2017 జులైలో పారిస్‌లో విడుదలైన “UNAIDS ఎండింగ్ ఎయిడ్స్ రిపోర్ట్‌” ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి తీవ్రతని చెప్పే నిజాలను వెల్లడించింది. దీనినిబట్టి చూస్తే వ్యాధిపై అవగాహనకి ప్రచారం ఇంకా ఉధృతం చేయాలని తెలుస్తున్నది. 2016 చివరి వరకు 3.6కోట్ల ప్రపంచ జనాభా (36 మిలియన్లు) హెచ్‌ఐవితో జీవిస్తున్నారు. వీరిలో 10లక్షలమంది వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడంవల్ల ఎయిడ్స్ ముదిరి చనిపోయారని తెలుస్తుంది. వ్యాధిపై అవగాహన పెంచుకొని “యాంటీ రిట్రోవైరల్ థెరపి”ని పాటిస్తూ 1.95కోట్ల మంది వ్యాధిని అదుపులో ఉంచుకొన్నట్లు నివేదికల ద్వారా తెలుస్తున్నది. వ్యాధి నివారణకి ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రచారం జరుగుతున్నా 2016 సం॥లో 18లక్షల కొత్త హెచ్‌ఐవి కేసులు బయటపడ్డాయి. అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్, డ్రగ్స్ వాడకం, స్వలింగ సంపర్కాలు ఈ కేసులకి కారకాలని రూఢి అయింది.
ఇండియాలో వ్యాధి తీవ్రతపై పలు చైతన్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. పోయిన 10 సం॥లతో పోలిస్తే కొత్త హెచ్‌ఐవిఇన్‌ఫెక్షన్స్ సుమారుగా సగానికి తగ్గుముఖం పట్టాయి. కానీ 2030సం॥కల్లా ఎయిడ్స్‌వ్యాధిని అంతం చెయ్యాలన్న ప్రపంచ కల నెరవేరాలంటే ఈ తగ్గుదల రేటు ఇంకా ఎక్కువగా పెరగాల్సి ఉంది. 2౦16 చివరి వరకు 21లక్షలమంది హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులు ఇండియాలో ఉన్నారు. 2005వ సం॥లో ఒక లక్షా 50వేల కొత్త ఇన్‌ఫెక్షన్స్ ఉంటే అవి 2016లో 80వేలకు తగ్గటం శుభసూచకం. ప్రతి సం॥20% తగ్గటం ప్రజల్లో పెరిగిన అవగాహనను వైద్యం అందుబాటువల్లనే సాధ్యమైందని చెప్పకుండా ఉండలేము. వివిధ కారణాలవలన సగానికి పైగా వ్యాధిగ్రస్తులు “జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం” కింద ఇచ్చే ఉచిత వైద్యాన్ని వాడుకోవడం లేదని తెలుస్తున్నది. UNAIDS డైరెక్టర్ ఆఫ్ ఇండియా ద్వారా కొత్త “టెస్ట్ అండ్ ట్రీట్‌” పాలసీని అందుబాటులోకి తెచ్చి హెచ్‌ఐవి పాజిటివ్ వారికి వైద్యం అందించి వైరల్ లోడ్ తగ్గించి తద్వారా వచ్చే టిబి, నెమ్ములాంటి వ్యాధులని రూపుమాపడానికి “నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం” చేసే కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎయిడ్స్‌పై పెరిగిన అవగాహన వల్ల పిల్లల్లో ఎయిడ్స్ సంబంధిత వ్యాధులు సగానికి పైగా తగ్గాయి. 2005 నుండి 2016 వరకు సుమారు 48% మరణాలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి.
హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థులు సమాజంలో వివక్షలకి గురౌతున్న కారణంగా ప్రభుత్వం వారి పరిరక్షణ కోసం “హెచ్‌ఐవి అండ్ ఎయిడ్స్ యాక్ట్ 2017” ని ప్రవేశపెట్టింది. దక్షిణాసియాలో ఇలాంటి చట్టాన్ని ప్రవేశపెట్టిన మొదటి దేశం భారత్. హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులను ఏ రకమైన వివక్షకి లేదా హెరాస్‌మెంట్‌కి గురి చేసినవారికి ఈ చట్టం కింద శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి చట్టాలు లేక చాలామంది హెచ్‌ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆదరణకి గురికాక మరణించినట్లు కూడా నివేదికలలో తెలుస్తున్నది. ఇలాంటి మానవ సంరక్షణ సంబంధిత, ఆరోగ్య హక్కుల చట్టాలు రావటం చాలామంచిదంటున్న స్వచ్ఛంద సేవాసంస్థల కృషి పెరిగినట్లు తెలుస్తున్నది. ఈ చట్టం వ్యాధితో బాధపడేవారికి ఊరట నిచ్చి వారి జీవన ప్రమాణాలని పెంచుతుందనటంలో అతిశయోక్తి లేదు. ఐరాస పిలుపునిచ్చినట్లుగా ‘మన ఆరోగ్యం మన హక్కు’ అనే స్పృహ ఇలాంటి చట్టాల ద్వారా పెరుగుతుంది.
హెచ్‌ఐవి వ్యాధితో నివసిస్తూ “యాంటీ రిట్రో వైరల్ థెరపీ” వైద్యాన్ని పొందుతున్న దేశాలు (శాతాల వారీగా)- 2017 మధ్య వరకు
ఇండియా 5%, మొజాంబిక్ 5%
కెన్యా 5% జింబాబ్వే 5%
నైజీరియా 5% ఉగాండ 5%
దక్షిణాఫ్రికా 20% మిగతాప్రపంచం50%

భారతదేశంలో హెచ్‌ఐవితో నివసిస్తున్న వారి సంఖ్య ః ఇండియా estimation report- 2015 ఆధారంగా
1549 సం॥ల వారిలో హెచ్‌ఐవి ప్రాబల్యం 0.26% (0.22%0.32%) మగవారిలో 0.30; ఆడవారిలో 0.22%

రాష్ట్రాల వారీగా ప్రాబల్యం
మణిపూర్ 1.15%
మిజోరాం 0.80%
నాగాలాండ్ 0.78%
ఆం.ప్ర, తెలంగాణ 0.66%
కర్ణాటక 0.45%
గుజరాత్ 0.42%
గోవా 0.40%

రాష్ట్రాల వారీగా హెచ్‌ఐవి వ్యాధిగ్రస్థులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 3.95లక్షలు
మహారాష్ట్ర 3.01లక్షలు
కర్ణాటక 1.99 లక్షలు
గుజరాత్ 1.66లక్షలు
బీహార్ 1.51లక్షలు
ఉత్తరప్రదేశ్ 1.50లక్షలు
రాజస్థాన్ 1.03లక్షలు
తమిళనాడు 1.43లక్షలు
వెస్ట్ బెంగాల్ 1.29లక్షలు

                                                                                                                                         * డాక్టర్ పోటు భగత్