Home తాజా వార్తలు ఇరిగేషన్‌లో మన కృషిని చూసి వరల్డ్ బ్యాంకు ఫిదా

ఇరిగేషన్‌లో మన కృషిని చూసి వరల్డ్ బ్యాంకు ఫిదా

World Bankఅధ్యయనానికి నమూనాగా తీసుకుంటున్నట్టు సిఎస్‌కు లేఖ
భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల రంగాన్ని
భేష్‌గా మెరుగుపరుస్తున్నారని ప్రశంస

మన తెలంగాణ/హైదరాబాద్: భారతదేశంలో నీటిపారుదల రంగం అభివృద్ధిపై తాము చేపట్టదలచిన అధ్యయనానికి తెలంగాణలో జరుగుతున్న విశేష కృషిని నమూనాగా తీసుకోదలిచినట్లు ప్రపంచబ్యాంకు ప్ర భుత్వానికి తెలియజేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషికి ఈ నెల 12న ప్రపంచ బ్యాంకుప్రధాన వనరుల ని ర్వహణ నిపుణుడు ఇజ్స్‌బ్రాండ్ హెచ్ డి జోంగ్ ఒక లేఖ ద్వారా తెలిపారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడమే కాకుండా అధిక మొత్తంలో ఖర్చు చేస్తూ, సామర్థం పెంచుకుంటున్నారని అందులో పేర్కొంది. నీటిపారుదల విషయంలో మన దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న సంస్థాగత ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, నీటిపారుదల వ్యవస్థల్లో సేవలను మెరుగపర్చేందుకు ఉన్న అడ్డంకులను ప్రపంచ బ్యాంకు ఒక అధ్యయనాన్ని చేపట్టనుంది.

ఇందులో రాష్ట్రాలలో ఉన్న వివిధ లోపాలను గుర్తించడం, వైవిధ్యాలను అన్వేషించడం వంటివి ఉన్నాయి. స్వయంగా కేంద్ర నీటి వనరుల మంత్రిత్వ శాఖనే తెలంగాణను ప్రపంచ బ్యాంకు అధ్యయనంలో చేర్చుకోవాలని, వారి సూచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించడం గమనార్హం. గత ఏడాది జరిగిన స్టేక్ హోల్డర్ కన్సల్టెషన్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఇంప్రూవింగ్ ఇరిగేషన్ సర్వీస్ డెలివరీ ఇన్ ఇండియాపై ఇచ్చిన వివరాలు చాలా విలువైనవని ప్రపంచ బ్యాంకు తన లేఖలో గుర్తు చేసింది. అదే ఇప్పుడు తమ అధ్యయనంగా తెలంగాణను కలుపుకునేందుకు దోహదం చేసినట్లు పేర్కొన్నారు. కెపిఎంజి అడ్వైజరీ సర్వీసెస్ డైరెక్టర్ సుమోలేంద్ర ఘోష్, ప్రపంచ బ్యాంకు డెవలప్మెంట్ రీసెర్చ్ గ్రూప్ ఎకనామిస్ట్ శామ్యూల్ అషేర్ నేతృత్వంలోని పరిశోధనా బృందం ఈ అధ్యయనం చేయనుంది. ఈ బృందానికి రాష్ట్రం నిరంతర మార్గదర్శకత్వం చేయాలని కోరారు.

రెండో దశల్లో అధ్యయనం

ప్రపంచ బ్యాంకు మన దేశంలోని రెండు దశల్లో నీటిపారుదల రంగంపై అధ్యయనం చేస్తోంది. ఇందులో మొదటి దశలో కాలువల నిర్మాణ వ్యవస్థ అదనపు విలువను అంచనా వేయడానికి ఆర్థిక, భౌగోళిక- విశ్లేషణ, అధ్యయనం చేయనున్నారు. ముందుగా సాగునీటికి వినియోగిస్తున్న పెద్ద కాలువల్లో ప్రారంభం నుంచి చివర వరకే నీటిని అందించే విధానం మరింతంగా అధ్యయనం చేస్తారు. దీని పరిజ్ఞానాన్ని మరింత మెరుగుపర్చి, ఒకేస్వభావం ఉన్న సరిహద్దు గ్రామాల్లో పోల్చనున్నారు. ఈ విధానం టెక్నాలజీ పనితీరు వైవిధ్యం వివరించడానికి సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు.

అలాగే సాంకేతిక, వాణిజ్యపరమైన అంశాలను మరింతంగా అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న జల వనరుల వ్యవస్థను మరింతగా మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుంది. వ్యవస్థీకృతంగా చేపట్టాల్సిన చర్యలు, ఏర్పాట్లు, విభిన్న అంశాలు, జీవన ప్రమాణాల్లో చోటు చేసుకునే మార్పు, జల వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడం తదితరాలన్ని ఈ అధ్యయనంలోని ప్రత్యేకాంశాలుగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించుకున్న లక్ష్యాలు, వీటితో పాటు జలవనరుల సంస్థలు సాగునీటి వ్యవస్థను మరింత పటిష్టపర్చేందుకు పోషించే పాత్రలకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఏ అవకాశాలు ఉన్నాయో, ఏ రకంగా మెరుగుపర్చుకోవచ్చునో ఈ అధ్యయనం పరిశీలిస్తుంది.

World Bank to Study Telangana Irrigation Service Delivery