Home తాజా వార్తలు టీమిండియాకు పరీక్ష

టీమిండియాకు పరీక్ష

నేడు బంగ్లాతో వార్మప్ పోరు
కార్డిఫ్: ప్రపంచకప్‌కు సన్నాహకంగా నిర్వహిస్తున్న రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌ను ఎదుర్కొంటోంది. కివీస్‌తో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడే చివరి సన్నాహక మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తన లోపాలపై భారత్ దృష్టి పెట్టింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. కివీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్‌తో జరుగనున్న రెండో మ్యాచ్ భారత్‌కు పరీక్షగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా రానున్న ప్రపంచకప్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలని భారత్ భావిస్తోంది. కాగా, బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకుంటే ఈ మ్యాచ్‌లో గెలవడం భారత్‌కు కష్టమేమి కాదు. ఓపెనర్లు ధావన్, రోహిత్‌లు శుభారంభం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఓపెనర్లే కీలకంగా మారిన విషయం తెలిసిందే. బౌన్స్‌కు సహకరించే ఇంగ్లండ్ పిచ్‌లపై శుభారంభం లభిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా బ్యాట్‌ను ఝులిపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు తమ బ్యాట్‌కు పదును పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలోనే ధావన్, రోహిత్‌లు అత్యుత్తమ ఓపెనర్లుగా పేరు తెచ్చుకున్నారు. పలు మ్యాచుల్లో శుభారంభం అందించిన ఘనత వీరికుంది. అంతేగాక ఇంగ్లండ్ పిచ్‌లపై కూడా రికార్డు మెరుగ్గానే ఉంది. ఈసారి కూడా అదే జోరును కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
కోహ్లినే కీలకం

మరోవైపు టీమిండియా ఆశలన్నీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై నెలకొన్నాయి. ఒంటిచేత్తో మ్యాచ్ తారుమారు చేసే సత్తా కలిగిన కోహ్లి తొలి వార్మప్ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే పడింది. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో కోహ్లి ఉన్నాడు. కోహ్లి చెలరేగితే బంగ్లా బౌలర్లకు ఇబ్బందులు తప్పక పోవచ్చు. ఎంతటి పెద్ద బౌలర్‌కైనా చుక్కలు చూపించే సత్తా కోహ్లికి ఉంది. దీంతో ప్రపంచకప్‌లో భారత్ గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా విరాట్‌కు మాత్రమే ఉందని చెప్పక తప్పదు. ఇక, లోకేశ్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోని, విజయ్ శంకర్‌లు కూడా జట్టుకు అండగా నిలవాలి. వీరంత మెరుగ్గా రాణిస్తేనే భారత్ విజయవకాశాలు మెరుగవుతాయి.
గెలుపే లక్ష్యంగా


కాగా, బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్‌లో గెలుపే లక్షంగా పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా సమతూకంగా ఉంది. పెద్ద పెద్ద జట్లను ఓడించే సత్తా బంగ్లాకు ఉంది. దీంతో భారత్‌పై కూడా సంచలన విజయంపై కన్నేసింది. తమీమ్ ఇక్బాల్, దాస్, రహీం, సాకిబ్, మహ్మదుల్లా, సాకిబ్, సౌమ్య సర్కార్ తదితరులతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. తమీమ్, దాస్‌లు భీకర ఫామ్‌లో ఉన్నారు. భారత్‌పై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా బంగ్లాదేశ్ చాలా పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో భారత్‌కు గట్టి పోటీ తప్పక పోవచ్చు.

World Cup 2019: Ind vs Bangladesh warm up match today