మాస్కో: 2026లో జరిగే ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ నిర్వహణ హక్కులను ఉత్తర అమెరికా దక్కించుకుంది. ఈ టోర్నమెంట్‌ను అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. బుధవారం మాస్కోలో జరిగిన ఫిఫా కాంగ్రెస్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచకప్ కోసం నిర్వహించిన బిడ్‌లో మొరాకో కంటే ఈ మూడు దేశాలకు అత్యధిక ఓట్లు లభించడంతో ఆతిథ్య హక్కులు దక్కాయి. 2022 ప్రపంచకప్‌కు దోహా ఖతర్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2026 ప్రపంచకప్ నిర్వహణ కోసం జరిగిన బిడ్‌లో అమెరికా, కెనడా, మెక్సికోలకు 134 ఓట్లు లభించాయి. మొరాకోకు కేవలం 65 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ప్రపంచకప్ ఫుట్‌బాల్ నిర్వహణ అవకాశం ఉత్తర అమెరికా దేశాలకు దక్కింది. 1994 తర్వాత ఉత్తమ అమెరికాకు ప్రపంచకప్ ఫుట్‌బాల్ నిర్వహించే ఛాన్స్ దొరకడం ఇదే ప్రథమం. కాగా, 2026లో జరిగే ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య 48కు పెరుగనుంది. బుధవారం మాస్కోలో జరిగిన ఫిఫా కాంగ్రెస్ బేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఫుట్‌బాల్ నిర్వహణ అవకాశం దక్కడంతో మెక్సికో, అమెరికా, కెనడా ఫుట్‌బాల్ దేశాల్లో సంబరాలు జరుపుకున్నారు. అంతేగాక ఈ దేశాల ఫుట్‌బాల్ సమాఖ్య ప్రతినిధులు కూడా ఫిఫా కాంగ్రెస్‌లో ఒకరినొకరు అభినందించుకున్నారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.