Home ఆఫ్ బీట్ నేడు ప్రపంచ డయాబెటిస్ డే

నేడు ప్రపంచ డయాబెటిస్ డే

DIABETES

మనతెలంగాణ/సిటీబ్యూరో : టైప్2 మధుమేహం నగర వాసుల గుండెల్లో రైళ్లను పరిగెత్తిస్తోంది. కొద్ది కాలం క్రితం వరకు టైప్-1 ఎక్కువగా కనిపించగా…ఆ పరిస్థితులు ఇటీవల మారిపోయి ఇతరత్రా మధుమేహం విస్తృతి పెరిగిపోతుంది. టైప్-2 మధుమేహం శిశువులు, యువతలో వేగంగా వ్యాప్తి చెందుతుందని కిమ్స్ ఆసుపత్రి ఎండో క్రైనాలజీ, డయాబెటాలజిస్టు డాక్టర్ బాబుల్‌రెడ్డి తెలిపారు. నేడు ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం సందర్భంగా మనతెలంగాణ ప్రత్యేక కథనం. ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ల మంది మధుమేహంతో బాదపడుతుండగా ప్రతి 10సెకన్లకు ఒకరి చొప్పున మరణిస్తున్నారని, అదే 10సెకన్లలో మరో ఇద్దరికి డయాబెటిస్ వస్తుందని ఇటీవల జరిగిన సెర్చ్ అధ్యయనంలో తేలింది.

1980తో పోలీస్తే ప్రస్తుతం మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య 75శాతంగా పెరిగింది. ఇందులో టైప్2 మధుమేహ వ్యాధిగ్రస్తులే ఎక్కువగా ఉన్నారు. అధిక బరువు ఉండటం, ఎప్పుడూ కూర్చోని పనిచేయడం, కుటుంబ నేపథ్యం వంటి ఆరోగ్య కారణాల రీత్యా టైప్2 మధుమేహానికి లోనయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. యుక్తవయసులో వచ్చే మధుమేహం వల్ల సుదీర్ఘ కాలం పాటు వ్యాధులకు కారకంగా మారుతుంది. తరచుగా వ్యా ధులు తలెత్తేందుకు కారణంగా కూడా నిలుస్తుంది. ఈ తరహాలో మధుమేహం వల్ల ఉత్పాదకత వయస్సు తగ్గిపోవడం కారణంగా సామాజిక ఆర్థిక పరస్థితుల్లో కూడా మార్పు తలెత్తుతుంది. విభిన్నమైన అధ్యయనాల ప్రకారం యుక్తవయసు వారిలో మధుమేహం కారణంగా ఆరోగ్యపరమైన తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. యువతలో టైప్2 డ యాబెటీస్ పెరగడం వెనుక బీటా సెల్ పనితీరులో తిరోగమనం కనిపించడమే కారణంగా చెప్పవచ్చు. న్యూట్రియెంట్ స్టిమ్యులేటెడ్ ఇన్సులిన్ సిక్రేషన్ కోల్పొవడం వెనుక సరైన, ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, పలు ఉదాంతాల ప్రకారం బీసెల్ పనితీరులో వేగవంతమైన మార్పులు చోటుచేసుకోవడం వల్ల యుక్త వయ సు వారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

డయాబెటిస్ అంటే : ఈ వ్యాధి రావడానికి కారణం క్లోమగ్రంథిలో బీటా కణాలు ఇన్సూలిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. ఒకవేళ ఉత్పత్తి అయిన ఇన్సులిన్ కూడా సరిగా పనిచేయకపోవడం. వ్యాధి నిరోదక వ్యవస్థకు సంబంధించిన కారణాల వల్ల చిన్నారుల్లో కూడా ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బీటా కణాలు పనిచేయక పోవడం వల్ల వీళ్లలో అసలు ఇన్సూలిన్ తయారు కాదు. అందువల్ల వీళ్లకు తప్పనిసరిగా ఇన్సూలిన్ ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మన చేతుల్లో ఉన్న డయాబెటిస్ రెండో రకం. 90శాతం మంది టైప్-2 మధుమేహం ఉన్న వాళ్లే. ఇది తాత్కలికమే అయినప్పటికీ ధీర్ఘాకాలంలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు.

జాగ్రత్తలు పాటించండి : నేటి సమాజంలో మానసిక ఒత్తిడి, ఆందోళనలు, అధిక శ్రమ వలన యుక్త వయసులోనే మధుమేహ వ్యాధిని ఎక్కువగా చూస్తున్నాం. ప్రజారోగ్యం, అభివృద్ధికి మధుమేహం కూడా ప్రమాదకరమైన అంశంగా పరిగణించాలి. విదేశాల్లో 40 ఏళ్ల పైబడిన వారికి ఈ వ్యాధి వస్తోంది. కానీ, మన దేశంలో మాత్రం 30 ఏళ్ల వరకే ఈ వ్యాధి బారిన చాలా మంది పడుతున్నారు. ఇందుకు కారణం బయట ఆహారానికి అలవాటు పడటమే. నూనె, నాన్‌వెజ్, చక్కెర, కొవ్వు పదార్థాలను తగ్గించాలి. ధూమపానం, మద్యపానం ను ఎక్కువగా తీసుకోవడం, శారీరక శ్రమలేకపోవడం, అధిక బరువు వల్ల ఈ వ్యాధి వస్తోంది. ప్రతి సంవత్సరాని ఒక సారి ప్రతి ఒక్కరు షుగర్ టెస్టు చేయించుకోవాలి. కొద్ది కొద్ది లక్షణాలు ఉన్నప్పుడే ఆహారపు అలవాట్లు, జీవనవిధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్యమైన శరీర బరువును మెయిన్‌టెన్ చేయడం, ప్రతిరోజు కనీసం 30నిమిషాలు తగ్గకుండా శారీరక శ్రమ చేయడం, నిత్యం 3 నుంచి 5 సార్లు పండ్లు కూరగాయాలు తీసుకోవడం, క్రమం తప్పకుండా రక్తంలో గ్లూకోజ్, గైకోటెడ్ హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించుకోవడం చేయాలి. ప్రత్యేకించి చిన్నారులు తీసుకునే ప్యాకిడ్ ఫుడ్ విషయంలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మధుమేహాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది.