Home ఎడిటోరియల్ వాణిజ్య యుద్ధం దిశగా…

వాణిజ్య యుద్ధం దిశగా…

sampadakeyam

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలతో ప్రపంచం వాణిజ్య యుద్ధం దిశగా ప్రయాణిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని వదిలించుకుని ఇప్పుడిప్పుడే వృద్ధిమార్గం పట్టిన దశలో స్వేచ్ఛా వాణిజ్య నిరోధక చర్యలు ప్రమాదకరమని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) ద్వారా దశాబ్దాలపాటు సాగిన చర్చలు అంతర్జాతీయ వాణిజ్యాన్ని స్థిరమైన ప్రాతిపదికపై ఉంచాయి. ప్రపంచదేశాలు ఉమ్మడిగా అంగీకరించిన నియమ నిబంధనలు ఉల్లంఘనకు గురైతే అందుకు పాల్పడిన దేశాన్ని శిక్షించే అధికారంకూడా డబ్లుటిఒకు ఉంది. ప్రపంచ వాణిజ్యం సంక్షోభాల్లో చిక్కుకోకుండా సాఫీగా సాగిపోయేందుకు, వర్థమాన ప్రపంచంపై స్వారీ చేసేందుకు అది పెట్టుబడిదారీ ప్రపంచం సృష్టించిన వ్యవస్థే. ఆహార సబ్సిడీలు ఎత్తివేయాలని ఇటీవల కాలంలో అది చేస్తున్న ఒత్తిడిని, తమ ప్రజలకు ఆహార భద్రత పేరుతో భారత్, ఇతర వర్థమాన దేశాలు ప్రతిఘటిస్తుండటం గుర్తు చేసుకోదగింది. అభివృద్ధి చెందిన దేశాల ప్రయోజనాలను కాపాడే ఆ సంస్థ సైతం ట్రంప్ రక్షణాత్మక విధానాలను తప్పుపట్టాల్సి వస్తోంది. ట్రంప్ ఏకపక్ష చర్యలతో అమెరికాచైనా మధ్య తలెత్తిన వాణిజ్య సంఘర్షణ విషయంలో ‘సంయమనం పాటించాలి, అత్యవసరంగా చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాలని’ డబ్లుటిఒ డైరెక్టర్ జనరల్ రాబర్టో అజివిడో విజ్ఞప్తి చేశారు. యూరప్ దేశాలతో ఒబామా ప్రభుత్వ కాలంలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమెరికాకు నష్టమని, దాన్ని రద్దు చేస్తానని దాడికి దిగిన ట్రంప్, యూరోపియన్ యూనియన్ సహా తమ కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలనుంచి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై వరుసగా 25శాతం, 15 శాతం చొప్పున ముందుగా సుంకాలు పెంచారు. నిరసనలు రావటంతో ఆ నిర్ణయం అమలును నిలుపుదలలో ఉంచి మే 1లోపు ఒప్పందం కుదుర్చుకోవాలని షరతు పెట్టారు. ఈ గడువులో ఒప్పందం సాధ్యం కాదని రాబర్టో భావిస్తుండగా, ఇది తలకు తుపాకీ గురిపెట్టినట్లుగా ఉందని ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయిల్ మక్రాన్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ తాజాగా చైనాతో వాణిజ్య ఘర్షణ ప్రారంభించారు. చైనా అక్రమంగా అమెరికా మేథో హక్కులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఆరోపించారు. చైనాలో జాయింట్ వెంచర్ పరిశ్రమలు నెలకొల్పే అమెరికన్ ఉన్నతస్థాయి టెక్నాలజీ కంపెనీలనుంచి టెక్నాలజీ బదిలీని చైనా డిమాండ్ చేస్తోంది. దీనిపై అమెరికా గత ఆగస్టులో డబ్లుటిఒలో ఫిర్యాదు చేసింది. చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, రుణదాత కూడా. ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో అమెరికా లోటు (2017లో) 375.2 బిలియన్ అమెరికన్ డాలర్లు. చైనాతో వాణిజ్యలోటు అమెరికాలో 60లక్షల ఉద్యోగాలను నష్టపరుస్తోందని అంచనాకు వచ్చిన ట్రంప్, చైనా నుండి దిగుమతులపై 60బిలియన్ డాలర్లమేర సుంకాలు పెంచుతూ ఎగ్జిక్యూటివ్ మెమొరాండంపై గురువారం సంతకం చేశారు. దీనికి ప్రతిస్పందనగా చైనా 128 అమెరికన్ వస్తువులపై 3 బిలియన్ డాలర్ల మేరకు సుంకం పెంచింది. తొలిదశలో 15శాతం పెంపుదల ఉంటుందని, చర్చల్లో అంగీకారం కుదరకపోతే రెండో దశలో 25శాతానికి పెంచుతామని చైనా ప్రకటించింది.
ప్రస్తుతానికి భారత్‌పై ఈ వాణిజ్య ఘర్షణ ప్రభావం లేకపోయినా ఇది కొనసాగితే ఎగుమతులు పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాక, భారత్‌పట్ల ట్రంప్‌కు కొందరు విశ్వసిస్తున్నట్లు ప్రత్యేక ప్రేమేమీ లేదు. ఒక అమెరికన్ కంపెనీకి చెందిన మోటారు సైకిళ్ల దిగుమతులపై సుంకం తగ్గించకపోతే, భారత్‌నుంచి ఆటోమొబైల్స్ దిగుమతిపై సుంకాలు పెంచుతామని ట్రంప్ హెచ్చరించటం, మోడీ ప్రభుత్వం స్వల్పంగా సుంకం తగ్గించటాన్ని అపహాస్యం చేయటం ఇటీవలి వ్యవహారమే. సబ్సిడీ రూల్స్ ఉల్లంఘనంటూ చైనాతో పాటు భారత్‌ను కలగలిపి డబ్లుటిఒలో అమెరికా ఫిర్యాదు చేసింది. అందువల్ల ట్రంప్ ‘రక్షణాత్మక’ విధానం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతోంది. ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరి ఊహకు అందదు కాబట్టి ఇది వాణిజ్య యుద్ధంగా మారుతుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.