Home ఎడిటోరియల్ జుకర్‘బగ్’ గుప్పెట్లో గోప్యత!

జుకర్‘బగ్’ గుప్పెట్లో గోప్యత!

Mark-jukar-burg

సామాజిక మాధ్యమాలు(సోషల్‌మీడియా) నేడు జీవితంలో భాగమైనాయి. ఫేస్‌బుక్, వాట్సప్, ట్విటర్‌లు ప్రతీ ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. దీనిలో అగ్రస్థానం మాత్రం ఫేస్‌బుక్‌దే. 200కోట్లకు పైగామంది ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ వాడుతున్నారు. ఫేస్‌బుక్ చాలామందికి తోడునీడగా మారింది. జీవితంలో భాగమైంది. మిత్రత్వం, బంధుత్వం ప్రతీది ఫేస్‌బుక్‌తోనే అన్నట్లుగా మారింది. ఫేస్‌బుక్‌లేని జీవితం నిరర్ధకం అన్నట్లయింది. తమ బాధలను, సంతోషాలను, భావావేశాలను, భావోద్వేగాలను, మానసిక ఆలోచనలను పంచుకునే వేదికగా ఫేస్‌బుక్ మారింది. వ్యాపారప్రకటనలకు, సంపాదనకు మార్గంగా కూడా ఉ-ంది.
ఇంతగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న ఈ ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్‌గారికి మాత్రం ఇటీవల కొన్ని కష్టాలు వచ్చినాయి. ఆకస్మాత్తుగా తన ఆస్థివిలువ పడిపోయింది. ప్రపంచ శతశతకోటీశ్వరులలో 5వ స్థానంలో ఉన్న జుకర్‌బర్గ్ ఈ మార్చినెలలో 7వ స్థానానికి పడిపోయారు. స్టాక్‌మార్కెట్‌లో ఫేస్‌బుక్ షేర్ల విలువ -ఉన్నట్టుండి తగ్గింది. వారంలోనే 65వేల కోట్ల సంపద కోల్పోయారు. ఫేస్‌బుక్ మీద వ్యతిరేకత పెరిగింది. డిలిట్‌ఫేస్‌బుక్ అనే యాష్‌టాగ్ ప్రచారంలోకి వచ్చింది. ఫేస్‌బుక్ సంస్థ సంక్షోభంలో పడింది. ఎందుకిలా జరిగింది?
ఎందుకంటే గత ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడానికి కారణాలలో ఒకటి ఫేస్‌బుక్ కూడానని. ఫేస్‌బుక్ వాడకందార్ల సమాచారాన్ని ట్రంప్ కొనుక్కుని తన ఎన్నికల ప్రచారాన్ని రూపొందించుకోడానికి వాడుకున్నాడని ఇటీవల బయటపడింది. ఫేస్‌బుక్ వాడే వారి అనుమతి లేకుండా దాదాపు 5కోట్ల వాడకందార్ల వ్యక్తిగత సమాచారం కేంబ్రిడ్జి అనలైటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకుని సేకరించి, విశ్లేషించి ట్రంప్ ఎన్నికల ప్రచారప్రకటనల రూపకల్పనకు సహకరించిందనే విషయం ఇటీవల బయటికి రావడంతో ఈ శ్కాం సంగతి బయటపడింది. ఇది ఒక పెద్ద మోసం. అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికలనే ప్రభావితం చేయగలిగిన స్థాయిలో -ఉన్న కుంభకోణమిది. ఈ విషయం ప్రపంచమంతా సంచలనం కలిగించింది. ఫేస్‌బుక్ విశ్వసనీయతకే దెబ్బ తగిలింది. అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు తమ ప్రజల సమాచారం వారి అనుమతి లేకుండా ఇతరులకు చేరవేశారా? అని ఫేస్‌బుక్ కంపెనీకి నోటీసులు ఇచ్చాయి. ఇంకా అనేక దేశాలు రకరకాల పద్ధతిలో స్పందిస్తున్నాయి. తమ దేశ ప్రజల సమాచారం ఏమైనా తప్పుడువిధంగా వినియోగించబడిందానని అనేక దేశాలు అనుమానలు వ్యక్తం చేస్తున్నాయి. హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఫేస్‌బుక్ అధినేత జుకర్‌బర్గ్ వాడకందార్లకు బహిరంగ క్షమాపణ చెప్పాడు. విశ్వసనీయతను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని ప్రకటించాడు.
అసలు ఏం జరుగుతోంది? ఫేస్‌బుక్ మనం ఫ్రీగానే వాడుతున్నాం కదా! మరి జుకర్ బర్గ్‌కు ఆదాయం ఎలా వస్తుంది? ప్రపంచ శతశతకోటీశ్వరులలో మొదటి 5 గురిలో ఒకడిగా తక్కువ కాలంలోనే ఎలా ఎదిగాడు? ఆకస్మాత్తుగా 65వేల కోట్ల సంపద ఎలా కోల్పోయాడు? దీనికి మన జీవితాలకు ఏమన్నా సంబంధం -ఉందా? ఇప్పుడు ఈ సందేహాలు అనేక మందికి వస్తున్నాయి?
జుకర్‌బర్గ్‌కు ప్రధాన ఆదాయం అడ్వర్టైజుమెంట్ల ద్వారా వస్తుంది. ఈ అడ్వర్టైజుమెంట్లను ఆకర్షించడానికి ఫేస్‌బుక్ ఏమి చేస్తున్నది? మన వ్యక్తిగత సమాచారాన్ని క్రోడీకరించి విశ్లేషణ చేస్తుంది. మన అభిరుచులు, ఆసక్తులు ఏమిటో తెలుసుకుంటుంది. వాటి ఆధారంగా అడ్వర్టైజ్‌మెంట్లు, స్పాన్సర్డ్ కార్యక్రమాలు మన ఫేస్‌బుక్‌లోకి వస్తాయి. మనకు సినిమాలు ఇష్టమైతే సినిమాల యాడ్స్, సైన్స్ ఇష్టమైతే సైన్స్ యాడ్స్, ఆహారం ఇష్టమైతే ఆహారం యాడ్స్ మన ఫేస్‌బుక్‌లోకి వస్తాయి. మనకు ఏ రకమైన సినిమాలు అంటే ఆసక్తో తెలుసుకుని అలాంటి సినిమాల యాడ్స్ వస్తుంటాయి. మన ఆసక్తులు, అభిరుచులు, మన సమాచారం వాళ్ళకు ఎలా తెలుస్తుంది? ఫేస్‌బుక్‌లో లైక్‌లు, షేర్‌లు, కామెంట్స్ చేస్తుంటాం. మనం ఫేస్‌బుక్‌లో షేర్‌చేసే విషయాలు మన మిత్రులకు మాత్రమే తెలుస్తాయని అనుకుంటాం. నా ఫేస్‌బుక్ అకౌంట్ కదా! పాస్‌వర్డ్ నాకే తెలుసు కదా అనుకుంటాం. కానీ ఈ మన సమాచారమంతా ఫేస్‌బుక్ డాటా సెంటర్‌కు చేరుతుంది. అక్కడ వారు దీనిని గమనిస్తుంటారు. మనం ఏమి పోస్ట్ చేస్తున్నాం, మన భావాలేమిటి, మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఏ ఏ విషయాలు చర్చిస్తున్నాం అనేది వీటిని విశ్లేషించి మన అభిరుచులను తెలుసుకుంటారు. దాని ఆధారంగా మనకు అడ్వర్టైజుమెంట్లు పంపుతుంటారు. మనం ఏమి కొనుక్కోవాలో, ఏ సినిమాలు చూడాలో వంటివి ప్రభావితం చేస్తుంది ఫేస్‌బుక్ ఆ యాడ్స్‌తో. సైకోగ్రాఫిక్ టార్గెటింగ్‌తో మన ఆలోచనలను, అభిరుచులను ప్రభావితం చేస్తుంటారు. దీనితో ఫేస్‌బుక్ ఆదాయం పెరుగుతుంది.
ఇది సరే ఇంతకూ అమెరికా ఎన్నికల సంగతి, ఫేస్‌బుక్ శ్కాం సంగతి ఏమిటి? అమెరికాలో ట్రంప్ ఎన్నికల సందర్భంగా కేంబ్రిడ్జి అనలైటికా అనే సంస్థ ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకుని అక్కడి 5కోట్ల మంది ఫేస్‌బుక్ వాడకందార్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. వాళ-్ళ ఏ ఏ అంశాలు చర్చిస్తున్నారు? వేటికి స్పందిస్తున్నారు? అనే అనేక రకాల అంశాలను సేకరించి విశ్లేషించారు. దాని ఆధారంగా ట్రంప్ ఎన్నికల ప్రచార యాడ్స్ రూపొందించారు. ఎలక్ట్రానికల్ బ్రెయిన్‌వాష్ అన్నమాట. ప్రత్యర్థుల మాటల్లో ఓటర్లు దేనికి స్పందిస్తున్నారో గమనించి వారి ప్రచారం తప్పనే విధంగా సమాచారాన్ని అందించారు. తమ ప్రచారంలో వేటిని వ్యతిరేకిస్తున్నారో గమనించి వాటిని మార్చుకున్నట్లు నమ్మించే యాడ్స్ రూపొందించి ఓటర్లు తమ అభిప్రాయాలు మార్చుకునేలా చేయడానికి ఫేస్‌బుక్ ఈ సమాచారాన్ని వాడుకుంది. ఓటర్ల మనసులను తమకనుకూలంగా నియంత్రించేలా సైకోగ్రాఫిక్ టార్గెటింగ్ చేసింది. ఇలా వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్ వాడకందార్ల అనుమతి లేకుండా వాడుకోవడంపై పెద్ద వ్యతిరేకత వచ్చింది. దీనికి కేంబ్రిడ్జి అనలైటికా సంస్థను మరీ ముఖ్యంగా అందులోని ఉ-ద్యోగి కోగన్ అనే అతనిని బాధ్యునిగా చూపెడుతున్నారు. ఇది ఏదో ఇకరిద్దరి తప్పుడు వ్యవహారమా? లేక అసలు సామాజిక మాధ్యమాలలోనే లోపమా? దీనిపైనే ఇప్పుడు అమెరికాలో చర్చ, విచారణ జరుగుతున్నది. ఇతర మరే దేశానైనా తమ దేశపౌరుల సమాచారాన్ని కూడా ఇలా ఎవరికైనా ఇచ్చాయా తెలపాలని ఫేస్‌బుక్ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. మన దేశంలో కూడా బి.జె.పి., కాంగ్రెస్‌లు ఇలాంటి ఒప్పందాలు చేసుకుని సమాచారాన్ని తెప్పించుకుని వినియోగించుకుంటున్నాయి. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియనే అపహాస్యం చేస్తున్నది. ప్రజాస్వామ్యానికి సవాలు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నది. అసత్య ప్రచారాలను రూపొందించి ప్రజల అభిప్రాయాలను తమకనుగుణంగా మార్చుకుని ఎన్నికల్లో గెలిచేలా ప్రణాళికలు వేసేవారికి ఫేస్‌బుక్ తోడ్పడుతుంది. ప్రజల వాస్తవ అభిప్రాయాలకు విలువ లేకుండా పోతుంది. డిజిటల్ బ్రెయిన్ వాష్ ఎన్నికలను నడిపే ప్రక్రియగా మారుతున్నది. ప్రజల మనసులను తమకనుకూలంగా నియంత్రించుకునే మానసికస్థితులపై గురి అనే ప్రమాదకర పరిస్థితులు వస్తున్నాయి.
వందలకోట్లకు పైగా -ఉన్నవారి సమాచారాన్ని ఎలా సేకరించగలరు? ఎలా విశ్లేషిస్తారు? ఇది సాధ్యమా? ఇలాంటి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించే విధానాన్నే బిగ్‌డేటా అంటున్నారు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ రంగంలో ఎక్కువ -ఉద్యోగాలు ఈ బిగ్‌డేటా రంగంలోనే లభ్యమవుతున్నాయి. భూగోళమంతా నేడు వాడుతున్న కంప్యూటర్లు, సాఫ్ట్‌ఫోన్లలోని డేటా అంతా 2013 లో 4.4 జెటాబైట్స్ -ఉండగా 2020నాటికి 44 జెటాబైట్స్, 2025నాటికి 163 జెటాబైట్స్‌కు చేరుకుంటుందని అంచనా. ఈ డేటాను క్రోడీకరించి విశ్లేషణ చేయడం ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారింది. బిగ్‌డేటా నిపుణులకు ఇప్పుడు చాలా డిమాండ్ -ఉంది. డాటా మేనేజ్‌మెంట్ కోర్సులు బాగా పెరుగుతున్నాయి.
అయితే ఇక్కడే ఒక ప్రశ్న ఉ-త్పన్నమవుతుంది. ఈ డిజిటల్ యుగంలో మన వ్యక్తిగత సమాచారం గోప్యంగా -ఉండడం సాధ్యమేనా? మన రహస్యాలు మనకే సొంతమా? ఇప్పటికే ఆధార్‌కార్డు వంటి వాటితో మన సమాచారం అందరికీ తెలిసిపోతున్నది. బాంక్ కార్డ్సు, పేటిఎవ్‌ు వంటి వాటితో మనం ఎక్కడెక్కడ లావాదేవీలు నడుపుతున్నామో బహిరంగ రహస్యంగా మారింది. ఇక మనం ఎక్కడ -ఉన్నామో ట్రాకింగ్ చేయడం సులువైపోతున్నది. మెట్రో రైలు పాసులు, స్మార్ట్‌కార్డ్స్ మనం ఎక్కడ -ఉన్నామో చెప్పుతున్నాయి. మనం వెళ్ళే వాహనాల సమాచారాన్ని టోల్‌రోడ్స్ చెబుతున్నాయి. ఎక్కడ టోల్‌గేట్ దగ్గర టోల్ కట్టినా మన సమాచారం రికార్డు అవుతున్నది. ఇక కాలనీలు, మాల్స్, కార్యాలయాలు ప్రతీచోట ఉ-ండే సి.సి.టి.వి.లు మన విడియోలను రికార్డు చేస్తున్నాయి. వాట్సప్‌లు కూడా అదే పని చేస్తున్నాయి. ఏవైనా పెద్ద కంపెనీలు మన సమాచారం కావాలంటే ఎంత సులువుగా కనుక్కోవచ్చో ఈ సాంకేతిక నైపుణ్యంతో. మన వ్యక్తిగత జీవనం అనేది నేడు కనపడకుండా పోతున్నది. అంతా బహిరంగమే అవుతున్నది. మన వ్యక్తిగత సమాచారం వ్యాపార వనరుగా మారిన తరుణంలో మనం కూడా వ్యాపార సరుకుగా మారుతున్నాం. మన మనసులను కూడా నియంత్రించే విధానాలను వ్యాపారవేత్తలు రూపొందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేడు వ్యాపారంలో భాగమవుతున్నది. ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. వ్యక్తి స్వేచ్ఛ, మానవహక్కులు అనేవి కోల్పోయే పరిస్థితులు వస్తున్నవి. సమాజం దీని గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాల్సిన అవసరం -ంది. లేకపోతే మనుషులే వ్యాపార సరుకులుగా మారిపోతే ఇక వ్యాపార ప్రయోజనాలు తప్ప ఇంకేమీ మిగలవు. ప్రజలే బలిపశ-వులు.
ఇంటర్‌నెట్‌ను, సామాజిక మాధ్యమాల యాజమాన్యాలను నియంత్రించే విధానాలు రావాలి. అందుకనుగుణమైన చట్టాలు రూపొందించాలి. వ్యక్తిగత అంశాలు రహస్యంగా -ఉంచుకోవడం ప్రతి ఒక్కరి హక్కు దానిని ఏ సంస్థ తస్కరించినా అది సామాజిక నేరమే.

వినుతా రెడ్డి
9515405916