Home ఆఫ్ బీట్ ‘చేతివాటం’ కమీషన్ కింగ్

‘చేతివాటం’ కమీషన్ కింగ్

Chat-cartoon1

తెలుగువాళ్ల సాహిత్యమంతా అయితే ఇమిటేషన్లు కాకపోతే రిపిటేషను! ఆ ముక్క ఇంతకుముందే ఎవరో అనేశారు కాబట్టి ఆఖరికి విమర్శ కూడా రిపిటేషనే! కాస్త రాయడం ఒచ్చిన ప్రతివాడూ మునుపు రామాయణ మహాభారతాల మీద చెయ్యి చేసుకొనేవాడు. మనకి మూల గ్రంథాలని కూడా కన్‌ఫ్యూజ్ చేసి పెట్టారీ రిపిటీషన్ లేక ఇమిటేషన్‌గాళ్ళు. సర్వమానవ సమానత్వం విశ్వజనీనకత అని పెద్ద పెద్ద టోపీల వాళ్లు ఘోషించే ఈరోజుల్లో రిపిటీషన్స్… ఇమిటేషన్ అని ఓ మూల కూచొని రోదించడం మానాలి. మంచి అన్నది కాపీ అయితే కాపీలే కొడుదున్!
ఇక చెత్త రాతల సంగతి అంటారా- సరిహద్దుల పేచీ లేకుండా అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో చెత్త సాహిత్యం ఒకే తీరుగా ఉంటుంది. మురికి కాల్వ హైదరాబాద్‌లో అయినా జగ్గయ్యపేటలో అయినా ఒకేలా ఉంటంది కదా. ఎలాగూ వాటి మీద వాలేవి ఈగలే. ఈగల బుద్ధి ఏ దేశంలోనైనా ఒకటే. వాలాల్సిన వాటిమీద ఎలాగూ వాలిపోతాయ్! కాపీ రైటర్లూ అంతే!
నినాదం అంటే గుర్తొచ్చింది. నిదానం లేనిదే నినాదం. అమెరికాలో వాన పడిందనే వార్త కార్చిచ్చులా వ్యాపించగానే ఆలోచించకుండా ‘గొడుగులు తెరవండోహోయ్’ అనే నినాదం ఇండియాలో పుట్టుకొచ్చేస్తోంది. పాకిస్థాన్‌లో తుఫాను వస్తే మాత్రం మన కొబ్బరిచెట్లు తెలివైనవి కనుక తొందరపడి కాయలు రాల్చవు- ‘ప్రో పాక్’ ముద్రపడుతుందని! నినాదాల విషయంలో జంతువులు కూడా తెలివిగానే ప్రవర్తిస్తాయి. నినాదాలని వినవు ఆచరించవు. కేవలం భోం చేస్తాయి. రకరకాల నినాదాలని భోం చేసినా సిటీ గేదెలు తెల్లటిపాలే ఎలా యిస్తాయబ్బా!
‘గోవుల్ని ప్రేమించండి’ అనే ఓ నినాదం రాసి ఉన్న వాల్‌పోస్టర్ దగ్గర ఓ ఢిల్లీ ఆవు ఎండలో వగరుస్తూ తచ్చాడం సిటీ బస్సు కిటికీలోంచి ఓసారి చూశాను. బహుశా ప్రేమించడం ఎలాగో ఆలోచిస్తోంది కావును. తిరుగు ప్రయాణంలో మరో బస్సు కిటికీలోంచి చూసేసరికి ఆ ఆవు ఆ యొక్క నినాదాన్ని కొమ్ములతో పరామర్శిస్తోంది.
పరామర్శ తెలుగు రచయితల నిఘంటువులో లేదు. ఇంగ్లీషు నవలని తెలుగువాళ్ళు పరామర్శించరు. దానికి చక్కగా తెలుగు లేబుల్ అతికిస్తారు. ‘ప్లేగియరిజం’ పేగు పేగునా ఉన్న తరువాత రిపిటేషన్ మీద ఎన్ని పిటిషన్లు పెట్టినా ఏం ప్రయోజనం?
తెలుగునాట నవలలు పట్రమ్మని భర్తలని సెకండ్ హాండ్ బుక్‌షాపులకి, సందు చివర లైబ్రరీకి తరిమే గృహిణులున్నారు. కాని భార్యని నవలలు రాయమని పోరే భర్తలు అరుదు. ఈ ‘వంట’ ఆమె చేస్తే అసలు వంట ఆయన చేస్తారు. అందుకే ఏవంటా ఒరిజినల్ కాదు. కాకపోతే పోనీయ్యండి. ఆ బాధ పడేది కొంప కొచ్చే అతిథులూ… కొని చదివే పాఠకులే కదా!,కేజీల చదువులాగే కిలోల సాహిత్యం.
అసలీరకం చోరాయణాన్ని క్రిమినల్ ప్రాస్‌జర్ కోడ్‌లో చేర్చి ‘నవలలు రాయకుండా చదివే శిక్ష వేయాలి. తాను కాపీ కొట్టినది ఎంత లావు నవలైతే అంత లావు శిక్షలుండాలి. ‘పద్యమా అది ఫ్రెంచి మద్యమా’ అని శ్రీశ్రీ గారు మెచ్చుకొంటే ఆ కవి చిన్నబుచ్చుకున్నాట్ట. ఎందుకంటే శ్రీశ్రీ గారికి ఫ్రెంచి సాహిత్యం బాగా తెలుసునని తెలిసి! తెలిసినవాళ్లే కాపీని ‘స్మెల్’ చేయగలరు కదా! దొంగోళ్లం మనం అయినప్పుడు దుర్భిణి వేసి పట్టేసేవాడు మూడో వాడవడం రివాజు. ఆయుధాల కమిషన్ లాగా ఈ సాహిత్యం ‘చేతివాటం’ కమిషన్ దక్కేదెవరికి? పబ్లిషర్‌కా? ఎడిటర్‌కా? తేల్చేదెవరు?