Home ఎడిటోరియల్ ఏహ్య రాజకీయాల పట్ల సాహిత్యకారుల నిరసన

ఏహ్య రాజకీయాల పట్ల సాహిత్యకారుల నిరసన

poetryరాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, “భారతదేశ మనుగడకు సహనశీలత, భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని గౌరవించే ప్రధాన మైన నాగరికతా విలువలు” ఎంతో ప్రాముఖ్యతగలవని ఉద్బోధించారు.  ఈ సూత్రాలు మన ప్రజాస్వామ్యానికే గాక, అనేక నాగరితలు నశించినా, శతాబ్దాలుగా మనుగడ సాగిస్తున్న భారతదేశ ప్రాచీన సంస్కృతికి కూడా మూలాధారం అని ఆయన గుర్తుచేశారు. 

పాలక రాజకీయ పార్టీ భావజాలానికి అనుగుణంగా దేశంలో పెచ్చరిల్లిన భిన్నత్వ వ్యతిరేక హింసాప్రవృత్తి ఆలోచనాపరులు, సున్నిత మనస్కులైన సాహితీవేత్తలను కలతపరిచింది. హిందూత్వ ముసుగుధరించిన ముష్కరులు హేతువాదులు, రచయితలైన ముగ్గుర్ని హత్యచేయటం, ఆ బరితెగించిన దుండగులను అరెస్టు చేయటంలో ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం ప్రగతిశీలురతోపాటు సృజన శీలురైన మేధావులను కలవరపెడుతుండగానే, దాద్రీ సమీపంలోని బిషారా గ్రామంలో గోమాంసం తిన్నారు, ఫ్రిట్జ్‌లో దాచుకున్నారన్న పుకారు సృష్టించి, 50ఏళ్ల ముస్లింను హత్యచేసిన దారుణం వారి హృదయాలను గాయపరిచింది. రాజ్యాంగం నిర్దేశించిన లౌకికత, బహుళత్వం, భిన్నాభిప్రాయాల పట్ల గౌరవం, మతసహనం, సంస్కృతుల సహజీవన భావాలు ఇంత పచ్చిగా ఉల్లంఘించ బడుతుంటే, ఆహారంపేరుతో ఒక వ్యక్తిని హత్యచేసేస్థాయికి పైత్యం ప్రకోపిస్తే, పార్టీకి చెందిన నాయకులు – మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు – విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు, చేతలతో సామాజిక వాతావరణాన్ని కలుషితం చేస్తుంటే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి అధికారం చేబట్టిన పాలకులు మౌనం పాటించటం సామాజిక స్పృహకలిగిన ఎవరినైనా బాధించకమానదు. ఈ పరిస్థితిపట్ల నిరసన తెలియజేయటం తమ కనీస ధర్మంగా భావించిన పలువురు ప్రసిద్ధ రచయితలు కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమీలు తమను గౌరవించిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నారు. విద్యావేత్త, హేతువాది ఎంఎం. కల్బుర్గి హత్యతో కలతచెందిన ప్రముఖ హిందీ రచయిత ఉదయ్ ప్రకాశ్ ముందుగా గతనెలలోనే తన అవార్డును తిరిగి ఇచ్చివేశారు. తదుపరి పలువురు కన్నడ సాహితీవేత్తలు ఆయన్ను అనుసరించారు. పండిత జవహర్‌నెహ్రూ మేనకోడలు, ప్రసిద్ధ ఆంగ్ల రచయిత్రి నయనతార షహగల్ మూడురోజులక్రితం, దేశంలోని ప్రస్తుత ఆధిపత్య రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా నిరసిస్తూ తన కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును తిరిగి ఇచ్చివేస్తున్నట్లు ప్రకటించి సాహితీవేత్తల అసమ్మతి, నిరసన స్థాయిని పెంచారు. మరునాడే హిందీకవి అశోక్ వాజ్‌పేయి, ఆ మరునాడే ప్రసిద్ధ ఉర్దూ నవలాకారుడు రెహ్మాన్ అబ్బాస్ ఆమెను అనుసరించారు. మరికొందరు ఈ బాటలో నడవవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 11మంది కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీతలు మతోన్మాదశక్తులను అదుపు చేయటంలో కేంద్రప్రభుత్వ ఉదాసీనతను ఖండించారు. రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించటం ప్రజాస్వామ్య సంస్కృతికి, నాగరిక ప్రవర్తనకూ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, గొడ్డలిపెట్టుగా వారు నిరసించారు.
ఉగ్రహిందూత్వశక్తులు ఒక పద్ధతి ప్రకారం సాగిస్తున్న ప్రచారం, ప్రేరేపిస్తున్న హింసలో మైనారిటీలను భయభ్రాంతులను చేసి తమ అధికారానికి లోబడి అణిగిమణిగి ఉండేటట్లు చేయటమేకాక, హిందూమతంలోని ఉదారవాదులు నోరెత్తకుండా చేయాలన్న దురాలోచనకూడా స్పష్టం. హేతువాదులు, రచయితలైన నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే, ఎంఎం కల్బుర్గిల కుట్రపూరిత హత్యలో మర్మగర్భంగా గోచరించేది ఇదే. అంతకుముందు తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ ‘రచయితగా నేను చనిపోయాను అని ప్రకటించి కలం కింద పెట్టేయటానికి కారణం ఇటువంటి దురహంకార శక్తులే. నయనతార షహగల్ మాటల్లో, “భారతదేశంలో నేడు మనం చూస్తున్నది ఫాసిజం. తమ భావజాలంతో అంగీకరించని వారిని హత్యచేసే మేరకు, బహుళత్వానికున్న ఆవరణ అంతర్థాన మవుతున్నది”. అశోక్ వాజ్‌పేయి ఏమన్నారంటే ప్రభుత్వం “లౌకిక వ్యవస్థపై దాడిచేసే ప్రయత్నాలను సహించబోము” వంటి అనవసరపు మాటలు చెబుతున్నది. అదేసమయంలో “అన్ని రకాల హక్కులు, స్వేచ్ఛలను ఉల్లంఘించటమే పనిగా పెట్టుకున్నవారిని ప్రోత్సహిస్తున్నది. లక్షలమందిని ఉద్దేశించి అనర్గళంగా మాట్లాడే ప్రధానమంత్రి మనకున్నారు. ఇక్కడ రచయితలు, అమాయకప్రజలు హత్యచేయబడుతున్నారు. ఆయన మంత్రులు వివాదాస్పద ప్రకటనలు చేస్తుంటారు. ఆయన వారి నోరెందుకు మూయించరు?”. కాగా ఉర్దూ రచయిత రెహ్మాన్ అబ్బాస్ మాటల్లో, “ఇది (అవార్డులు తిరిగి ఇచ్చి వేయటం) చిన్న అడుగే కావచ్చు, ఇటువంటి కల్లోల కాలంలో ఇది తప్పని సరి. ఫాసిజానికి వ్యతిరేకంగా, మితవాద అసహనశక్తులకు వ్యతిరేకంగా, మతం, కొన్ని విభాగాల మనోభావాలు, పిడివాద సంస్కృతీ సిద్ధాంతాల మార్గాల్లో దేశాన్ని విభజించే వ్యూహంగా పెంపొందిస్తున్న అరాచకానికి వ్యతిరేకంగా గొంతెత్తటం మా విధి”.
రాజ్యాంగం భారత పౌరులందరికీ “ఆలోచన, భావ వ్యక్తీకరణ, విశ్వాస, ప్రార్థనా స్వేచ్ఛ కల్పించింది అని అన్నందుకు ఉపరాష్ట్రపతి హమీద్‌అన్సారీపై ఉగ్రహిందూత్వ వాదులు ఆయనపై హూంకరించాయి. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, “భారతదేశ మనుగడకు సహనశీలత, భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని గౌరవించే ప్రధానమైన నాగరికతా విలువలు” ఎంతో ప్రాముఖ్యతగలవని ఉద్బోధించారు. ఈ సూత్రాలు మన ప్రజాస్వామ్యానికే గాక, అనేక నాగరితలు నశించినా, శతాబ్దాలుగా మనుగడ సాగిస్తున్న భారతదేశ ప్రాచీన సంస్కృతికి కూడా మూలాధారం అని ఆయన గుర్తుచేశారు. దాద్రీ ఘటన సృష్టించిన కలకలం తదుపరి రాష్ట్రపతి సందేశం ఎంతో పరిణతితో కూడినది. హింసాత్మక ఘటనలను నోరు తెరిచి ఖండించలేని సంకటంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలు రాష్ట్రపతి సలహాను పాటించాలని బీహార్‌సభలో అన్నారు. మీడియా వ్యాఖ్యానించినట్లు ఇది ‘మతోన్మాద శక్తులకు గట్టి హెచ్చరిక’ అవునోకాదో రానున్న రోజులు నిర్ణయిస్తాయి. హిందువులు ముస్లింలపైన, ముస్లింలు హిందువులపైన పోరాటం చేయటం కాకుండా, ఉభయులూ కలిసి దారిద్య్రంపై పోరాటం చేయాలని ప్ర
ధాని అన్నారు. అందుకు అనువైన వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత దేశప్రధానిగా ఆయనదే! ప్రధాని ఈ ప్రకటన చేసిన మరునాడే, జమ్మూ-కశ్మీర్ అసెంబ్లీలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్‌పై బిజెపి ఎమ్మెల్యేలు భౌతికంగా దాడిచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు అడ్డుపడకపోతే అతడి పరిస్థితి ఏమయ్యేదో! ఇంతకీ అతను చేసిన తప్పేమిటి-ఆవుమాంసంతో విందు ఇచ్చాడట!