Home జిల్లాలు ‘యాదాద్రి-భువనగిరి’గా యాదాద్రి జిల్లా

‘యాదాద్రి-భువనగిరి’గా యాదాద్రి జిల్లా

kcrయాదాద్రి : యాదాద్రి జిల్లాను ఇకపై ‘యాదాద్రి-భువనిగిరి’ జిల్లాగా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. బుధవారం యాదాద్రి జిల్లా అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. అనంతరం ఆయన భువనగిరిలోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నేత ఎలిమినేటి కృష్ణారెడ్డిని కెసిఆర్ కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రిని భువనగిరి జిల్లాగా మార్చాలని ఆయన సిఎంను కోరారు. దీంతో కృష్ణారెడ్డి విజ్ఞప్తి మేరకు యాదాద్రి జిల్లాను ‘యాదాద్రి-భువనగిరి’ జిల్లాగా పిలవాలని కెసిఆర్ వెల్లడించారు.
జిల్లా కేంద్రం కావడంతో భువనగిరి చాలా అభివృద్ధి చెందుతుందని కెసిఆర్ అన్నారు. రవాణా వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. భువనగిరిలో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని.. దీంతో యాదాద్రి-భువనగిరి జంటగా అభివృద్ధి చెందుతాయని సిఎం అన్నారు. అంతకు మందు యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కెసిఆర్ యాదాద్రి అభివృద్ధి పనులపై అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాదాద్రి ప్రధాన ఆలయ విస్తరణ, ఆలయ నగరి అభివృద్ధి పనులను పరిశీలించారు. యాదగిరిపల్లిలో గవర్నర్, సిఎం అతిథిగృహాలను సైతం పరిశీలించిన అనంతరం సిఎం హరిత రెస్టారెంట్‌లో ‘యాడా’ అధికారులతో సమీక్షించారు.