Home యాదాద్రి భువనగిరి యాగాద్రిగా మారిన యాదాద్రి

యాగాద్రిగా మారిన యాదాద్రి

                  yadagirigutta

మారు మోగుతున్న వేదమంత్రాలు 

వైభవోపేతం అయుత మహావిష్ణు యాగం

శ్రీమద్రామాయణం మహా ధ్వని కావ్యం. కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. రామాయణ కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, చాలా శ్లోకాలకు కూడా ధ్వన్యర్థం వుండడం విశేషం. రుతువర్ణనలో కూడా ధ్వని స్ఫురిస్తుంది. అలాంటి ధ్వని ఆధారంగా, ఒక దృశ్య-శ్రవణ కావ్యంగా మలచిన ఒకానొక అద్భుత మహా  శ్రీ పంచాయ తన సహిత ఆయుత శ్రీ మహావిష్ణు మహా యాగం.

వేన-వేల ప్రపంచ చరిత్రలో కనీ-వినీ ఎరుగని, ఎవరిచేతా నిర్వహించబడని, నభూతో -న భవిష్యత్ గా పేర్కొనదగిన, అపురూప పంచాయతన సహిత అయుత శ్రీమహావిష్ణు మహాయాగాలకు హైదరాబాద్ సమీపంలోని యాదాద్రి పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీకారం చుట్టడం జరిగింది. హైదరాబాద్ కు చెందిన కె.హెచ్.ఎస్.సేవా ట్రస్ట్ సారధ్యంలో, దేశ-విదేశాలలో నివసిస్తున్న ఆ ట్రస్ట్ అభిమానుల ఆదరాభిమానాలతో, సహాయ-సహకారాలతో, ఈ మహాయాగం కొన్ని ఒడుదుడుకులను, బాలారిష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది. భక్తజనావళి, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులు, వారి వంతు సహాయం అందించడం విశేషం. సకల విశ్వశాంతి, సర్వమానవాళి మధ్యన సుహృద్భావన, పరస్పర సహకారం, మతసామరస్యంతో సహజీవనం, పర్యావరణ పరిరక్షణ, పాడి-పంటలు, సకాల వృష్ఠి, సకాల-సక్రమ ఋతు ప్రవేశాలు కోరుకుంటూ ఈ యాగం సాగుతున్నది. భూకంపాలు, వరదలు, తుఫానులు, అతివృష్టి, అనావృష్టి, విషజ్వరాలు, అంటువ్యాధులు లాంటి వాటి నివారణ కోసం రాబోయే కొన్నివేల సంవత్సరాలు ఈ జగత్తంతా శాంతియుతంగా కొనసాగాలనే ఏకైక లక్ష్యంతో ఈ 126 రోజుల మహాక్రతువు జరుగుతోంది. యాగాన్ని నిర్వహిస్తున్న ట్రస్టే, గతంలో, 2012 ఏప్రిల్ 21-మే 2 మధ్యన, భద్రాచలం సమీపంలోని ఏటపాకలో కేరళకు చెందిన సంప్రదాయ నంబూద్రి బ్రాహ్మణులతో ‘అతిరాత్రం‘ మహోత్కృష్ట సోమయాగాన్ని నిర్వహించినప్పుడు ఈ వ్యాస రచయిత ఆ కార్యక్రమానికి ప్రధాన సమన్వయకర్తగా వ్యవహరించాడు.

ఆ యాగాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలతో సహా యావత్ భారతావనికి చెందిన లక్షలాది మంది వీక్షించారు. ఇదే ట్రస్ట్ ఆధ్వర్యంలో 2013 ఫిబ్రవరి 13 నుండి 25 వరకు తూర్పుగోదావరి జిల్లా పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో ఆంధ్ర-, తెలంగాణ, -రాయలసీమ, -కర్ణాటక-, తమిళనాడు, -మహారాష్ట్రలకు చెందిన వేద-స్మార్త పండితులతో ‘అతిరుద్రం‘ మహోత్కృష్ట స్మార్థ యాగం, తదనంతరం, ‘అప్తోర్యామం‘ మహోత్కృష్ట సోమయాగం జరిగాయి. సకల జగత్ పరిరక్షకుడూ, సకల జీవరాశి పరిపోషకుడు శ్రీమహావిష్ణువు. అనంతకోటి బ్రహ్మాండానికి పరబ్రహ్మం ఆయనే. అతడికి సమానుడూ..-అధికుడూ ఎవరూ లేరు. గడ్డిపోచ కదలాలన్నా ఆయనే కారణం.

ఆయనే జగత్కారకుడని సకల వేద-శాస్త్ర, ఇతిహాస, పురాణాలు, ఉపనిషత్తులు నొక్కి వక్కాణిస్తున్నాయి. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర ఆరంభం రెండు పదాలలోనే వేదవ్యాస మహర్షి ‘విశ్వం విష్ణుః‘ అనీ, మంత్రపుష్పంలో ‘విశ్వం నారాయణం హరిం‘ అనీ, ‘యజ్ఞోవై విష్ణుః‘(యజ్ఞమంటేనే విష్ణువనీ) అనీ అనేక విధాలుగా శ్రీమహవిష్ణువును పేర్కొనడం అందరికీ తెలిసిన విషయమే. ఇంతవరకు ఎక్కడా నిర్వహించని ఇలాంటి మహాయజ్ఞం, శ్రీమహావిష్ణువు యోగనిద్రావస్థలో నుండే ఆషాఢ మాసం నుండి పరమపవిత్రమైన, శివ-కేశవ ప్రీతికరమైన, కార్తీక మాసం వరకూ గల చాతుర్మాస కాలక్రమంలోనే జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రం ఏర్పడిన తరువాత అనేక బృహత్ ప్రణాళికలు, అభ్యుదయ కార్యక్రమాలు చేపడుతున్న నేపధ్యంలో యాదగిరిగుట్టకు ‘యాదాద్రి’ గా నామకరణం చేసి, గుట్టకు కొత్తరూపులు సంతరించే ప్రణాళికకు రూపకల్పన చేసిన నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం మూల విరాట్ల స్థానాలకు భంగం వాటిల్లకుండా యధా స్థానంలోనే బృహదాలయ నిర్మాణం, సువిశాల ప్రాంగణంతో నలుదిశలా ప్రాకారాలు, రాజగోపురాలు, వంటశాలలు, భోజనశాలలు, వివిధ రకాల వసతి భవనాలు, పుష్పవనాలకు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్న నేపథ్యంలో; శోభాయమానమైన సుందర దివ్యధామంగా- టెంపుల్ సిటీగా- తీర్చిదిద్దాలని ఆలోచన చేసి శరవేగంతో నిర్మాణాలు గావిస్తున్న నేపథ్యంలో; చారిత్మాత్మకమైన, విశ్వవిఖ్యాతి పొందనున్న ఈ మహత్తర – బృహత్తర శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీమహావిష్ణు మహాయాగం నిర్వహించాలనే తలంపు కలిగింది. అలా కలగడానికి, బహుశా, ట్రస్ట్ సారథ్యాన్ని వహిస్తున్న బ్రహ్మశ్రీ హరిహరనాథ శర్మకు సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహమే గాక, స్వామివారి సంకల్పం, ఆజ్ఞ వుందని అనుకోవాలి.

జూన్ నెల 28 నుంచి ఆరంభమైన మహాయాగ పూర్వరంగంలో తొలుత జులై నెల 3 వరకు, 5 రోజులు, పంచ నారసింహ క్షేత్రమైన యాదాద్రిలోని మంచి ఉపాసకులైన బ్రాహ్మణులతో పంచనారసింహ ఉపాసన జరిగింది. ఆ తరువాత ద్వితీయ ఘట్టంలో 12 మంది ఋత్విజులు ప్రతినిత్యం 1,08,000 (ఒక లక్షా ఎనిమిది వేలు) చొప్పున శ్రీ నారాయణాష్టాక్షరీ జపం చేస్తున్నారు. జులై నెల 4 న మొదలైన ఈ కార్యక్రమం, 108 రోజుల పాటు అక్టోబర్ 19 వరకు నిరంతరాయంగా జరుగుతుంది. మొత్తం కార్యక్రమం అయ్యేనాటికి, 1,08,00,000 (ఒకకోటి ఎనిమిది లక్షలు) జపం చేస్తారు. అంతేకాకుండా, ఈ 108 రోజులలో తొలి ఏకాదశీ తిథి నుండీ 8 ఏకాదశీ పర్వదినాలలో అహోరాత్రంగా (24 గంటలు) విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, నామ సంకీర్తన, భక్తి కీర్తనలు, భక్తి పాటలు, భజనాదులు, గురుపూర్ణిమాదిగా ప్రతి మాస శివరాత్రి, వరలక్ష్మీవ్రతం, కృష్ణాష్టమి, వినాయకచతుర్ధి, దసరా పర్వదినాలలో విశేష అర్చనలు, అభిషేకాలు, హోమాలు జరుగుతున్నాయి. తృతీయ(చివరి) ఘట్టం అక్టోబర్ 20 న ప్రారంభమై, నెలాఖరు వరకూ సాగుతుంది. ఈ 12 రోజుల్లో, ద్వితీయ ఘట్టంలో 108 రోజులపాటు నిర్వహించడం జరిగిన 1,08,00,000 (ఒకకోటి ఎనిమిది లక్షలు) నారాయణాష్టాక్షరీ జప దశాంశమైన 10,80,000 నారాయణాష్టాక్షరీ హోమాలు జరుగుతాయి.

యాగ పరిసమాప్తం నవంబర్ 1, 2017 న. ‘అయుత’ అనేదానికి అర్థం ‘దశసహస్రం‘ (పదివేలు) అని. అలాంటి 10,000 పురుష సూక్త పూర్తి పాఠంతో నిర్వహించబడే హోమాలు కాబట్టి దీనికి అయుత అని పేరు పెట్టారు. అలా పదివేల పురుషసూక్త హోమాలు జరిగినప్పుడు దానికి పదిరెట్లు -అంటే, నియత (ఒక లక్ష) పారాయణలు జరుగుతాయి. అలాగే శ్రీవారైన శ్రీమహావిష్ణువుకు హోమాలు నిర్వహిస్తున్నపుడు ఆయన వక్షస్థల నివాసిని అయిన అమ్మవారిని గూడా సేవించుకోవాలిగదా? అందుకనే ఈ మహాక్రతువుల్లో అమ్మవారైన శ్రీమహాలక్ష్మికి ప్రీతికరంగా పదివేల ఎనిమిది వందల శ్రీసూక్త పారాయణలు; దశాంశమైన 1,080 శ్రీసూక్త హోమాలు; ‘మేదినీదేవీ వసుంధరా…. ‘విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియాం‘ (వేదవాక్యం) అంటూ, భూదేవికి ప్రీతికరంగా 1,080 భూసూక్త పారాయణలు చేస్తారు.

అలాగే దశాంశమైన 108 భూసూక్త హోమాలూ, నిత్యం స్వామివారికి, అమ్మవారికీ అభిషేక, అర్చన, అలంకరణాదులతోబాటు అనేక స్తోత్ర పారాయణాలు, నామసంకీర్తనాలూ, ప్రతినిత్యం పంచాయతన దేవతలైన గణపతికి అభిషేకం, అర్చన, అలంకారం, శీర్షోపనిషత్, చతురావృత తర్పణాలు, గణపతి హోమం, ఆదిత్యుడికి ప్రీతికరంగా సూర్యనమస్కారాలు, అభిషేకం, త్రిచార్చన, మహాసౌర-అరుణ పారాయణలూ, మహాసౌర-అరుణ హోమాలు జరుగుతాయి. ఇంకా, రుద్ర(శివ) ప్రీతికరంగా ప్రతినిత్యం 121 నమక-చమక పారాయణలతో కూడిన లఘు రుద్రాభిషేకంతో 11 రోజులలో మహారుద్రాభిషేకం, త్రిచార్చన-రుద్ర క్రమార్చన, రుద్రహోమం; దేవీ ప్రీతికరంగా ప్రతినిత్యం పూర్ణదీక్షాపరులు -ఉపాసకులూ ఐన ఋత్విజులచే శ్రీచక్ర నవావరణార్చన, చండీ పారాయణాలు, హోమాలు, భక్తుల అభీష్టానుసారంగా జరిగే అనేక విశేష హోమాలు, చతుర్వేద పారాయణలు సమాప్తమయ్యాయి. ఇది పూర్తి వైదిక కార్యక్రమం కాబట్టి, సందర్భం కుదిరినప్పుడల్లా పెద్దలచే ప్రచనాలుంటాయి.

సమర్ధులైన ఆచార్య-బ్రహ్మ-ఋత్విజుల నియామకంతో పాటు మంత్ర-క్రియా-ద్రవ్య లోపాలు ఎంతమాత్రం జరుగకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయని నిర్వాహకులు అంటున్నారు. భారత దేశంలో మునుపెన్నడూ జరుగని ఈ ‘శ్రీ పంచాయతన సహిత అయుత శ్రీ మహావిష్ణు యాగాలు ‘శ్రీవైకుంఠనారాయణ మహాసుదర్శన యంత్ర ప్రస్తార యాగశాల, హోమకుండాలలలో‘ నిర్వహించడం, ప్రతినిత్యం అన్న సమారాధన జరగడం విశేషంగా చెప్పుకోవాలి. యాగ పరిసమాప్త దివసమైన కార్తీక శుక్ల ద్వాదశీ పర్వదినాన, అంటే, నవంబర్ 1, 2017 బుధవారం నాడు అర్చనలు, మహాశాంతి హోమం, పూర్ణాహుతి, అవబృధం, వేదోక్త మహదాశీర్వచనం వుంటుంది. ఆ తరువాత మహాన్నసమారాధన వుంటుంది. జాతి-మత-కుల-వర్ణ-వర్గ బేధాలు లేకుండా దేశ-విదేశాలలో నున్న ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. యాదాద్రిలో జరుగుతున్న ఈ మహావిష్ణు మహాయాగానికి రావాల్సిందిగా నిర్వాహకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన వస్తారన్న ఆశాభావాన్ని వారు వ్యక్తపరిచారు.