Home తాజా వార్తలు యోగేశ్వర్‌దత్‌కు రజతం..?

యోగేశ్వర్‌దత్‌కు రజతం..?

Yogeshwar-Dutt2న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా వెనుదిరిగిన భారత రెజ్లర్ యోగేశ్వర్‌దత్‌కు కాస్త ఊరట లభించనుంది. లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ గెలిచిన కాంస్య పతకం బదులుగా.. రజత పతకం ఇవ్వనున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 60 కెజిల పురుషుల ఫ్రీస్టైల్ విభాగంలో బరిలోకి దిగిన యోగేశ్వర్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇదే విభాగంలో రజతం గెలిచిన రష్యా రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ శాంపిల్స్‌పై తాజాగా జరిపిన డోప్ టెస్టులో అతడి శాంపిల్స్ పాజిటివ్ అని తెలింది. అయితే దీనిపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కమిటీల నుంచి లేఖ వచ్చిన తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్య ధ్రువీకరించి యోగేశ్వర్‌కు రజత పతకాన్ని అందించనుంది. కాగా, నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్, రెండు సార్లు ఒలింపిక్ విజేతగా నిలిచిన బెసిక్ 2013లో రష్యాలో జరిగిన కారు ప్రమాదంలో చనిపోయాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలు సాధించగా.. అందులో రెండు రజతాలు ఉన్నాయి. షూటింగ్‌లో విజయ్‌కుమార్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకం సాధించారు. ఇప్పుడు యోగేశ్వర్ పతకాన్ని మార్చితే ఆ సంఖ్య మూడుకు చేరుతుంది. ఇదిలావుండగా గత ఒలింపిక్స్ వరకు అత్యాధునిక టెక్నాలజీ లేని కారణంగా దాదాపు అన్ని దేశాల అథ్లెట్ల శాంపిల్స్‌పై తాజాగా టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.