Home వార్తలు రెజ్లర్ యోగేశ్వర్‌కు కాంస్యం నుంచి రజతం

రెజ్లర్ యోగేశ్వర్‌కు కాంస్యం నుంచి రజతం

yogeshwarన్యూఢిల్లీ: 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్‌కు కాంస్య పతకం వచ్చినప్పటికీ దాని స్థానంలో అతడికి ఇప్పుడు రజత పతకాన్ని ఖరారు చేశారు. ఈ విషయాన్ని యోగేశ్వర్ సైతం తన ట్విట్టర్ దారా ధ్రువీకరించాడు. కాంస్యం నుంచి రజతానికి మార్చినట్లు తనకు మంగళవారం ఉదయమే తెలిసనట్లు పేర్కొన్నాడు. పైగా తన పతకాన్ని దేశ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 60 కిలోల పురుషుల ఫ్రీ స్టయిల్ విభాగంలో యోగేశ్వర్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. అయితే ఇటీవల ‘వాడా’ డోపింగ్ పరీక్షల్లో అప్పట్లో రజతం గెలిచిన బెసిక్ నిషిద్ధ ఉత్ప్రరకాలు వాడినట్లు తేలింది. లండన్ ఒలింపిక్స్‌కు ముందు బెసిక్ నుంచి సేకరించిన నమూనాలను మరోసారి పరీక్షించగా ఆ విషయం ధ్రువపడింది. దీంతో అతడి స్థానాన్ని రద్దు చేశారు. అంతేకాదు నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, రెండుసార్లు ఒలింపిక్ విజేతగా నిలిచిన బెసిక్ 2013లో రష్యాలో జరిగిన ఓ కారు ప్రమాదంలో మృతి చెందాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. అందులో రెండు రజత పతకాలున్నాయి. షూటింగ్‌లో విజయ్ కుమార్, రెజ్లింగ్‌లో సుశీల్ కుమార్ రజత పతకం సాధించారు. తాజా నిర్ణయంతో యోగేశర్‌కు రజతం రావడంతో ఆ సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది.
యోగి రజతంపై సెహ్వాగ్ చమక్కులు
క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వ్యాఖ్యానాలు, చమత్కారాలు చేస్తూ క్రియాశీలంగా ఉంటున్నాడు. ఒలింపిక్ పతాకాల విషయంలో 120 కోట్ల జనాభా కలిగిన దేశం కేవలం రెండు పతకాలు సాధించగానే దేశంలో వేడుకలు చేసుకోవడం ఏమిటంటూ బ్రిటిష్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యానాలకు సెహ్వాగ్ ట్విట్టర్ వేదికగా గట్టిగానే బుద్ధి చెప్పాడు. అయితే తాజాగా రెజ్లర్ యోగేశ్వర్ దత్ రజతంపై కూడా ట్విట్టర్‌లో తనదై న శైలిలో చమక్కు విసిరాడు. లండన్ ఒలింపిక్స్‌లో కైవసం చేసుకున్న కాంస్యం ఇప్పుడు రజతానికి అప్‌గ్రేడ్ అయ్యిందంటూ ట్వీట్ చేశాడు. “ భారత క్రికెట్ జట్టు అమెరికాలో అప్‌గ్రేడ్ అయినట్లు, ఆశిష్ నెహ్రా స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ అయినట్లు, ఇప్పుడు యోగేశ్వర్ దత్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో సాధించి న కాంస్య పతకం నుంచి రజతాని కి అప్‌గ్రేడ్ అయింది.” అంటూ తన ట్వీట్‌లో చమత్కరించాడు.