Home తాజా వార్తలు వివిప్యాట్‌లో చూసుకోండి

వివిప్యాట్‌లో చూసుకోండి

Vivi Pat

 

మన తెలంగాణ/హైదరాబాద్: బ్యాలెట్ యూనిట్‌పై ఒక గుర్తుకు ఓటు వేస్తే అదే గుర్తుకు పడిందా అనే అనుమానం చాలా మందికి ఉండేది. ఈ ఎన్నికల్లో ఆ అనుమానాలేమి ఉండవు. ఎందుకంటే ఏ గుర్తుకు ఓటు వేసారో దాన్ని ధృవీకరిస్తూ వివిప్యాట్ మిషన్‌లోని డిస్‌ప్లేలో కనిపించి, టోకెన్ లాంటి రసీదు ముద్రించి డ్రాప్ బాక్స్‌లో పడేలా ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్నికల సంఘం ఓటర్ల సౌలభ్యం కోసం వినియోగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల్లో వివిప్యాట్‌లను వాడుతోంది. ఓటరు బ్యాలెట్ యూనిట్‌లో ఒక అభ్యర్థి గుర్తుకు ఓటు వేస్తే, మరొకరికి వెళ్తుందని వచ్చిన ఆరోపణల నుంచి పుట్టిన వివిప్యాట్‌తో ఇప్పుడు ఓటరు బ్యాలెట్ యూనిట్‌లో ఎవరికి ఏ గుర్తుకు ఓటు వేసారో చూసుకునే డిజిటల్ డిస్‌ప్లే అవకాశం కల్పించింది. పైగా ఓటు వేసిన గుర్తుకు సంబంధించి వివిప్యాట్ల కింద ఉన్న డ్రాప్ బాక్సులో రసీదు ప్రింట్ కూడా అందులో పడిపోతుంది. వీటి ద్వారా కంట్రోల్ యూనిట్‌లో పోల్ అయిన ఓట్ల సంఖ్యను, వివిప్యాట్‌లో ఉన్న రసీదులతో లెక్క సరిచూసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఓటు వేయండి ఇలా
1. పోలింగ్ కేంద్రంలోకి ఓటరు ప్రవేశించే ముందు పోలీసు సిబ్బందికి ఓటరు స్లిప్పు లేదా ఓటరు ఐడి ఎపిక్ కార్డు, ఇసి అనుమతించిన 12 ఫోటో గుర్తింపు కార్డులలో ఏదేని ఒకటి చూపి, లోపలికి ప్రవేశించాలి.
2. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన తరువాత సంబంధిత పోలింగ్ ఏజెంట్లు, అధికారులు నిజమైన ఓటరుగా గుర్తించి అనుమతిస్తారు.
3. కంట్రోల్ యూనిట్ వద్దనున్న పోలింగ్ (ప్రిసైడింగ్) ఆఫీసర్ తన వద్దనున్న కంట్రోల్ యూనిట్ బటన్ నొక్కి ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
4. బూత్‌లోకి వెళ్లిన ఓటరు అప్పుడు ఓటరు బ్యాలెట్ యూనిట్‌లో తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఓటు వేస్తారు. వెంటనే దాని పక్కనే ఉన్న వివిప్యాట్ మిషన్‌పై ఉన్న డిజిటల్ స్క్రీన్‌పై ఎవరికి ఓటు వేసారో కనిపిస్తుంది. ఆ కనిపించిన గుర్తు ప్రింట్ అయి, వివిప్యాట్ డ్రాప్ బాక్సులో పడుతుంది. బ్యాలెట్ యూనిట్‌పై అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్ నొక్కి తరువాత వివిప్యాట్‌లో 7 సెకన్‌ల పాటు డిజిటల్ స్క్రీన్‌లో ఏ గుర్తుకు వేసామో డిస్‌ప్లే చేస్తుంది.
5. ఓటు వేసిన గుర్తుకు కాకుండా వేరే గుర్తు వివిప్యాట్ డిస్‌ప్లేలో కనిపిస్తే వెంటనే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయాలి. ఒకవేళ కావాలనే అబద్ధం చెబితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.

You Visiting vote on display in Vivi Pat Mission

Telangana Latest News