Home స్కోర్ ఫైనల్లో యువ భారత్

ఫైనల్లో యువ భారత్

శుభ్‌మన్ అజేయ శతకం, చెలరేగిన ఇషాన్,
సెమీస్‌లో పాకిస్థాన్ చిత్తు, అండర్19 ప్రపంచకప్

Under-19క్రిస్ట్‌చర్చ్: భారత యువ జట్టు అండర్19 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకుంది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 203 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. శనివారం జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. భారత్ ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి కావడం విశేషం. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక పాక్ యువ జట్టు 29.3 ఓవర్లలోనే 69 పరుగులకే కుప్పకూలింది. అజేయ సెంచరీతో శుభ్‌మన్ గిల్, అద్భు బౌలింగ్ ఇషాన్ పోరెల్ భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ ఓడకుండానే భారత్ ఫైనల్‌కు చేరుకుంది.
టపటపా…
క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. యువ బౌలర్ ఇషాన్ పోరెల్ అసాధారణ బౌలింగ్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ఇషాన్ దెబ్బకు పాక్ టాప్ ఆర్డర్ బెంబెలెత్తిపోయిది. ఓపెనర్లు ఇమ్రాన్ షా (2), మహ్మద్ జైద్ ఆలమ్ (7)లను ఇషాన్ వెనక్కి పంపాడు. అంతేగాక అలీ జర్యాబ్ (1), ఆమద్ ఆలమ్ (4)లను కూడా ఇషాన్ పెవిలియన్ పంపించాడు. దీంతో పాక్ మళ్లీ కోలుకోలేక పోయింది. ఇషాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోవడంతో పాక్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలువడమే గగనమైపోయింది. పాక్ జట్టులో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెలా స్కోరును అందుకున్నారు. వికెట్ కీపర్ రోహెల్ నజీర్ (18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సాద్ ఖాన్ (15), మహ్మద్ మూసా (11) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరుకు చేరుకున్నారు. దీంతో పాక్ బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు ఎంతగా శాసించారో ఊహించవచ్చు. మరోవైపు శివాసింగ్, రియాన్ పరాగ్ రెండేసి వికెట్లు పడగొట్టి పాక్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడంలో తమవంతు పాత్ర పోషించారు. భారత బౌలర్లు అసాధారణ రీతిలో చెలరేగి పోవడంతో పాకిస్థాన్ కేవలం 69 పరుగులకే కుప్పకూలింది.
శుభారంభం…
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్ పృథ్వీషా, మన్‌జోత్ కల్రా శుభారంభం అందించారు. ఇద్దరు పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఇద్దరు వేగంగా ఆడడంతో స్కోరు బోర్డు పరిగెత్తింది. అద్భుత ఫాంలో ఉన్న షా ఈసారి కూడా జోరును కొనసాగించాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తింఆడు. అయితే 42 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 41 పరుగులు చేసి రనౌటయ్యాడు. దీంతో 89 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే మరో ఓపెనర్ మన్‌జోత్ కల్రా కూడా ఔటయ్యాడు. ధాటిగా ఆడిన మన్‌జోత్ ఏడు ఫోర్లతో 47 పరుగులు చేశాడు.
శుభ్‌మన్ శతకం…
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచే బాధ్యతను శుభ్‌మన్ గిల్ తనపై వేసుకున్నాడు. అతనికి వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ అండగా నిలిచాడు. శుభ్‌మన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును ముందుకు నడిపించాడు. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటూనే అడపాదడపా బౌండరీలతో స్కోరు వేగం తగ్గకుండా చూశాడు. మరోవైపు పాక్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ ముందుకు సాగారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా గిల్ తన జోరును కొనసాగించాడు. అతనికి అనుకుల్ రాయ్ సహకారం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయ్ 4 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. కాగా, శుభ్‌మన్ గిల్ 94 బంతుల్లోనే ఏడు బౌండరీలతో 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ స్కోరు 272 పరుగులకు చేరింది. పాక్ బౌలర్లలో మహ్మద్ మూసా నాలుగు, అర్షద్ ఇక్బాల్ మూడు వికెట్లు పడగొట్టారు.