Home స్పెషల్ ఆర్టికల్స్ ప్రేమ పెళ్లి: 2 నెలలకే యువకుడి ఆత్మహత్య!

ప్రేమ పెళ్లి: 2 నెలలకే యువకుడి ఆత్మహత్య!

Young Man Commits Suicide due to Harassment of Wife

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి వేధింపులు భరించలేక పెళ్లైన రెండు నెలలకే యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన నేరేడ్‌మెట్ పరిధిలోని కాకతీయనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… సికింద్రాబాద్ పాత గ్యాస్‌మండికి చెందిన రావుల సన్ని(21) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాకతీయనగర్‌కు చెందిన ఐశ్వర్యతో సన్నికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సన్ని ఇంట్లోవారిని ఒప్పించి రెండు నెలల కిందట ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. కాకతీయనగర్‌లో కాపురం పెట్టారు. కొన్నిరోజులు సజావుగానే సాగింది వీరి కాపురం. తరువాత భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో భార్యతో పాటు అత్త కూడా తరచూ సన్నితో గొడవపడేవారు. ఈ క్రమంలో 10 రోజుల కిందట గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఐశ్వర్యను ఎన్నిసార్లు ఇంటికి రమ్మని పిలిచిన ఫలితం లేకుండా పోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సన్ని సోమవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.