Thursday, April 18, 2024

మిస్సింగ్ కేసును పట్టించుకోని పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇరవై రోజుల క్రితం యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందినా కుటుంబ సభ్యులకు పోలీసులు చెప్పకపోయిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…శ్రావణ్ కుమార్(23) అనే యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో చాదర్‌ఘాట్ పోలీసులు యువకుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన యువకుడు మృతిచెందాడు. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదం జరిగిన రెండు రోజుల తర్వాత చాదర్‌ఘాట్ పోలీసులకు తమ కుమారుడు కన్పించడంలేదని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో ఓ యువకుడు చికిత్స పొందుతున్న విషయం వారికి చెప్పలేదు.

ఫిర్యాదు తీసుకుని ఆచూకీ కనిపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన వారు పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రి మార్చురీలో ఉన్న మృతదేహాన్ని చూసి తమ కుమారుడేనని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు కానీ వారికి అసలు విషయం తెలియలేదు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. రోడ్డు ప్రమాదాన్ని పోలీసులు కావాలని దాచిపెట్టారని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతదేహంతో కుటుంబ సభ్యులు చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆదివారం ధర్నా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News