Home కలం వెంపర్లాటలో కవులు

వెంపర్లాటలో కవులు

india

తెలుగు కవిత్వంలో లబ్దప్రతిష్ఠులైన కవులు శ్రీశ్రీ     (మహాప్రస్థానం), సోమసుందర్ (వజ్రాయుధం),  బాలగంగాధర్ తిలక్ (అమృతం కురిసిన రాత్రి), ఆరుద్ర  (త్వమేవాహం),దాశరథి  (రుద్రవీణ ) ఇలా చెప్పుకుంటూపోతే వీరికి ఈ కీర్తి తెచ్చిన కవిత్వం   వస్తువుగా ప్రజలకు సన్నిహితం గా కావడం ద్వారా ‘రూపం’గా ప్రజలను ఆకట్టుకునేలా చెప్పడం ద్వారా ఉన్నత స్థితిని పొందగలిగారు. వీరెప్పుడూ అవార్డుల కోసం వెంపర్లాడలేదు. నిరంతరం కవిత్వం నే  తపనగా జీవించారు. 

మానవ శరీరంలో అవాంఛనీయంగా పెరిగే శరీర భాగాన్ని వైద్య పరిభాషలో కణితి అని పిలుస్తారు. అది క్రమంగా వ్రణంగా మారి ‘క్యాన్సర్’ లాంటి ప్రమాదకర రూపం తీసుకుని శరీరాన్ని వికృతంగా తయారు చేయడమే కాక ఒక్కోసారి ప్రాణాంతకమే అవుతుంది. సరిగ్గా అలాంటి భావపరమైన అవాంఛనీయ ‘జబ్బు’ ఒకటి తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని పట్టి పీడిస్తుంది. దాని పేరే కీర్తి ‘కండూతి’. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కవితాక్షరాలకు పట్టిన కొత్త తెగులుగా ఇది ముందుకొచ్చింది. దీనిని ప్రస్తుతం శస్త్ర చికిత్స తప్ప మామూలు ‘కాయకల్పచికిత్సలు’ సరిపడవు అనే స్థితికి ఎదిగిపోయింది. తెలుగు భాషా అభివృద్ధిలో, విస్తృతిలో కవిత్వానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. పురాతన కాలం నుండి ఆధునిక కవుల వరకు తాము సృష్టించిన భావాల, పదాల అక్షర సంపద అద్భుతమైనది. అది తెలుగు భాషా, సాహిత్యాలను పరిపూర్ణం చేసింది. అందులో కవిత్వానిది సింహభాగం. ఆహారసేకరణ దశ. ఉత్పత్తి దశ, నిల్వ దశ వరకు శ్రమైక జీవన మానవ నాగరికతా పయనం లాగానే భాష, అక్షర చైతన్యం సైతం ఎదుగుతూ వచ్చింది. పురాతన సాహిత్య పదకోశాలు నుండి జనజీవన సామాన్యం నుండి పుట్టుకొచ్చిన అశేష పదసంపద సృష్టించిన జానపథ సాహిత్యం వరకు మన కవిత్వం భావావేశం ఎదిగిన క్రమం మనం చూస్తాం. అచ్ఛు యంత్రం కనుగొన్న తర్వాత విప్లవాత్మకమైన భావవ్యాప్తి ద్వారా ప్రపంచ సాహిత్యం, అక్షరం మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది.జ్ఞానం,’పుస్తకం’ ద్వారా నిక్షిప్తం అయి విస్తృత రూపం తీసుకొంది. ప్రపంచ వ్యాప్తంగా, జాతీయంగా వచ్చిన ఉద్యమాల్లో అనేక సాహిత్య ప్రక్రియలు పురుడు పోసుకున్నాయి. అందులో భాగంగా కవిత్వం ఒక భావావేశ రూపంగా, నూతన పదసృష్టి ప్రబంధంగా, వినూత్న భావ విప్లవ రూప ప్రక్రియ గా ముందుకొచ్చింది. అది ప్రజా ఉద్యమాలు, అస్తిత్వ ఉద్యమాల ద్వారా దాని ఉనికి నిలుపుకుంటూ నేటి గ్లోబల్ యుగానికి ఓ విశిష్ట ప్రక్రియగా కవిత్వం ముందుకొచ్చింది. ఈ దశలో కాలం తెచ్చిన కొన్ని మార్పులు, అవి మోసుకొచ్చిన ‘వైరస్’ కవిత్వ ఉద్యమాలను చుట్టుముట్టి కొత్త జబ్బుల్ని సైతం కొనితెచ్చింది. భూస్వామ్య సమాజంలో భూస్వామ్య అనుకూల భావజాలం, పెట్టుబడిదారీ సమాజంలో అమ్మకపు సరుకు లాంటి ఓ రూపంలో, నేటి ప్రపంచీకరణ వేగవంతమౌతున్న దశలో కార్పొరేట్ శక్తులు, బహుళజాతి సంస్థల భాషా, కళాదప్పిక తీర్చే ‘ఒయాసిస్సు’గా అక్షర ఉద్యమాలు మారిపోయాయి. పద్యరూపంలో మన తెలుగు సాహిత్యంలో కవిత్వం పుట్టినా పాశ్చాత్య సొబగులు నింపుకొని వచనకవిత్వం పురుడు పోసుకుంది.మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఛందోబందోబస్తులు తెంచేసుకొని వచన కవిత్వం భూమార్గం పట్టింది. ఆధునిక మానవుని చుట్టూ అల్లుకుపోయిన లతలా తెలుగు కవిత్వం పెనవేసుకు పోయింది. తెలుగునాట కవిత్వోద్యమాన్ని పరిశీలిస్తే ప్రజా ఉద్యమాల నుండి పుట్టిన అభ్యుదయ కవిత్వోద్యమం అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావం, అటు తరువాత సినిమా రంగం సృష్టించిన భాషావ్యాప్తి, 1960 దశకం తర్వాత తెలుగు సాహిత్యంలో వినిపించిన నిరసన కవిత్వం దిగంబరం, పైగంబరం, తిరగబడు కవులు ఇలా రాసుకుంటూ పోతే ‘నక్సల్బరీ‘ఉద్యమం తర్వాత విప్లవోద్యమ సుస్వరంగా విప్లవ రచయితల సంఘం దాని నుండి శాఖోప శాఖలుగా పలు ప్రజారచయితల సంఘాలు బయటకొచ్చాయి. 1980వ దశకం తర్వాత స్త్రీవాద, దళిత ఉద్యమ అస్తిత్వస్వరాలు, 21వ శతాబ్దంలో ప్రాంతీయ అస్తిత్వ స్వరాలు కవిత్వరూపంలో బయటకొచ్చాయి. వీటి నుండి తెలుగు కవిత్వం తమ ఉనికిని నిలబెట్టుకుంది. అయితే ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తుల అవసరాలైతేనేం, అస్తిత్వ ఉద్యమాల వెర్రి రూపాలైతేనేం కులసంఘాల పేరుతో కవిత్వ గుంపులు తయారవుతున్నాయి. తమకు తాము ‘అస్తిత్వం’ పేరుతో ముద్రలు వేసుకునే ‘కుల’ ప్రాతిపదికన గిరిగీసుకొని తెలుగు సాహిత్యంలో విభజన, విచ్ఛిన్నతకు బీజాలు వేస్తున్నారు . నేడు ప్రసార మాధ్యమాల వెర్రితలలు సైతం ఈ వేలంవెర్రిని ప్రోత్సహించేది గా ఉంది.ఇది ఒక విధమైన ప్రక్కదారి తెలుగు కవిత్వ ఉద్యమంలో కనిపిస్తుండగా నేటి ‘గ్లోబలైజేషన్‘మరికొన్ని అంటురోగాల్ని తెలుగు కవిత్వంలోకి ప్రవేశపెట్టింది. అదే ‘కీర్తి కండూతి ‘అనబడే కొత్త జబ్బు. తెలుగు కవిత్వంలో లబ్దప్రతిష్ఠులైన కవులు శ్రీశ్రీ (మహాప్రస్థానం), సోమసుందర్ (వజ్రాయుధం), బాలగంగాధర్ తిలక్ (అమృతం కురిసిన రాత్రి), ఆరుద్ర (త్వమేవాహం),దాశరథి (రుద్రవీణ ) ఇలా చెప్పుకుంటూపోతే వీరికి ఈ కీర్తి తెచ్చిన కవిత్వం వస్తువుగా ప్రజలకు సన్నిహితం గా కావడం ద్వారా ‘రూపం’గా ప్రజలను ఆకట్టుకునేలా చెప్పడం ద్వారా ఉన్నత స్థితిని పొందగలిగారు. వీరెప్పుడూ అవార్డుల కోసం వెంపర్లాడలేదు. నిరంతరం కవిత్వం నే తపనగా జీవించారు. తెలుగు సాహిత్యంలో విమర్శలో పతాకస్థాయి నెదిగిన ముప్పాళ్ళ రంగనాయకమ్మ, చలం లాంటి వాళ్ళు ఏ అవార్డుల కోసం ప్రయత్నించలేదు. తమ కలాన్ని సమాజానికి అంకితం చేశారు. వారికి వచ్చిన లబ్ద ప్రతిష్టతలు కేవలం రచనా శక్తి ఆధారంగా లభించిన గుర్తింపులే. కానీ నేటికీ తెలుగు కవిత్వంలో కొన్ని ప్లాస్టిక్ నవ్వుల్ని, అక్షరాల్ని అరువు తెచ్చుకుని వాటిని కాసుల చుట్టూ కమనీయ అక్షరాలుగా మలిచి అమ్ముకుంటున్న స్థితి, మునుపెన్నడూ లేనివిధంగా పాలకవర్గాల ప్రాపకంకై పాకులాడుతున్న దుస్థితి తెలుగు కవిత్వ ఉద్యమంలో కనిపిస్తుంది. ఈ భ్రమా పూరిత గ్లోబల్ సమాజం సృష్టించిన విషపు చట్రం లోనికి కవులు, కవిత్వోద్యమం లాగబడుతుంది. అందుకు ఒకానొక రూపంగా ‘సన్మానాలు- అవార్డులు’ అనే రూపంలో అది వ్యక్తమవుతూ వచ్చింది. తమ భావ పొందిక కు కేంద్ర బిందువైన ప్రజలను వదిలి అది ‘కీర్తి కండూతి’ అనే కొత్త జబ్బుతో పతనం అంచుల్లోకి పరిగెడుతుంది. 1980 దశకంలో ప్రభుత్వం ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ , రాష్ట్ర సాహిత్య పరిషత్తు అవార్డులు, ప్రైవేట్ గా ఉత్తమ కవిత్వానికి అందజేసిన ‘కుందుర్తి‘లాంటి కవుల పేరిట ఇచ్చిన అవార్డులు ఉండేవి. అవి కొంత చెప్పుకోవడానికి కొన్ని ప్రామాణికాలు, ఎంపికకు ఒక ప్రాతిపదికను పాదుకొల్పాయి.కానీ నేడు ఆ ఒరవడికి తిలోదకాలిచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందలాది అవార్డులు, రివార్డులు ,సన్మాన వేదికలు కవిత్వ రంగంలో రూపుదిద్దుకున్నాయి. కొందరు ప్రజలకు దూరమైన కవులు, కవిత్వ ఉద్యమాల్లో కలుపు మొక్కలు, అక్షరం ఉడిగిన మాజీలు, కొత్తగా పేరుకోసం సాహిత్య వ్యాపారంలో ప్రవేశించిన గ్లోబల్ వ్యాపారులు, విద్యా వ్యాపారులు ఈ జబ్బును విస్తృతం చేశారు. ఎలాంటి సాహిత్యం లేని వ్యక్తుల పేరుతో ,తల్లిదండ్రుల పేరుతో లేక తమ ఊర్ల పేరుతో అవార్డులు ప్రకటించి తామేదో వినూత్న ప్రయోగాలు చేస్తున్నట్లు భ్రమింప చేస్తున్నారు. మరికొందరు సహస్ర కవి సమ్మేళనాలను, గిన్నిస్ బుక్ నమోదులని ఉన్మాదస్థితి కి కవిత్వ స్థాయిని దిగజార్చుతున్నారు. ఎక్కడ చూసిన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘సన్మానాలు- అవార్డులు’ పేరుతో కవిత్వ ప్రయాణం మార్గాన్ని అపసవ్యత వైపు మల్లిస్తున్నారు. రాబోయే తరం నేటి మీడియా కవిత్వ ఉద్యమం అంటే ‘అవార్డులు-సన్మానాలేమో!’ అని భ్రమించేస్థితి కి ఈ ఉన్మాదం ముదిరింది. ఇప్పటికే తెలుగు సాహిత్యంలో కవిత్వం లో ప్రభుత్వ అవార్డుల ప్రమాణాలు దిగజారి పైరవీల స్థాయికి చేరిపోయింది. తమకు సన్నిహితమైన మార్గాల ద్వారా ప్రభుత్వాలను ప్రసన్నం చేసుకునే దుస్థితి, ఎంపిక సంఘాల్ని బుట్టలో వేసుకునే స్థాయికి తెలుగు సాహిత్యం దిగజారింది. ఇక ప్రైవేటు ‘అవార్డు’ల పేరుతో మొదలైన జాతర తమ గుంపేదో తాము ముద్ర వేసుకొని తమ అవార్డు తమ గుంపు కిచ్చి ‘గుర్తింపు’,’ రాణింపు ‘క్రీడలకు కొత్త రాగాలు సమకూర్చుతున్నారు. ఎంపిక ప్రమాణాలు వ్యక్తిగత స్థాయికి దిగజార్చి ‘అవార్డులు- సన్మానాలు’ ఓ సరిచేయలేని జబ్బుగా మార్చి వేశారు. ఈ వ్యక్తివాద ధోరణులు తెలుగు కవిత్వాలలో ప్రబలడం వలన సాహిత్య ప్రమాణాలు అడుగంటి పోతున్నాయి. ఫలితంగా నాసిరకం కవిత్వం ఉత్పత్తి అవుతుంది. ఎవరికివారు కవిసమ్మేళనాలు పెట్టుకొని దాన్నే చదువుకుని ఆనందిస్తున్నారు. వాటినే ఎవరికి వారు పుస్తకాలు అచ్చు వేసుకొని పంచుకుంటున్నారు. కొన్ని కుల ముఠాలు అస్తిత్వం పేరుతో పాలకవర్గాలకు ఉపయోగపడేలా ఆధునిక మనువాదులు గా మారి శ్రామిక వర్గాన్ని చైతన్యం చేయడానికి బదులు కులం పునాదుల్ని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. మరి కొందరు తాము అచ్చు వేసుకున్న పుస్తకాన్ని తామే అమ్ముకునే స్టాల్స్ , మొబైలింగ్ వ్యాపారం పేరుతో యాగీ చేస్తున్నారు. నిజంగా ప్రజల వస్తువుగా, రూపంగా , సారంగా ప్రభావితం చేసే కవిత్వానికి ఇన్ని కుప్పిగంతులు అవసరం లేదు. పెడదారి పట్టినదేదైనా అంతిమంగా పాలకవర్గానికి సేవ చేసేదే. పైరవీలతో బ్రతుకు వెళ్లదీసేదే కానీ ప్రజలకు చేరువయ్యేది కాదు, ఉపయోగపడేది కాదు. దీనితో యువ కవులు తమ లక్ష్యాల్ని మరచి భాషా పటుత్వం పెంచుకోవడం, వస్తు శైలిని అభివృద్ధి చేసుకోవడానికి బదులు భ్రమల లోకంలో విహరిస్తూ అవార్డులు- సన్మానాలు వైపు పరుగులు తీసే తప్పుడు వాతావరణం తెలుగునాట కనిపిస్తోంది. ఇది ఇలా కొనసాగితే తెలుగు కవిత్వ ద్వారంలో కుక్కమూతి పిందెలు మరిన్ని పూసి భ్రష్టత్వం దిశగా పయనించే ప్రమాదం ఉంది. ఇట్లాంటి వాతావరణం తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కవిత్వంలో ప్రవేశించడానికి ప్రధాన కారణం ఒకటి ప్రజా ఉద్యమాల వైఫల్యం, ఉత్తమ సాహిత్యం వెనుకపట్టు కాగా కవిత్వం, సాహిత్య విమర్శలలో పదును కోల్పోవడం సైతం ఒక కారణంగా ఉంది. నేటి తెలుగు సాహిత్యంలో సాహిత్య విమర్శ ‘గుంపుల’ముఠాల స్థాయికి దిగజారింది. ఒక ఏనుగు గుడ్డివాడు కథను గుర్తుకు తెచ్చేలా పాదాలు, తొండం,తోక, దంతాలు పట్టుకొని ఏనుగు స్వరూపం అలాగే ఉందని వర్ణించినట్లు , భావించినట్లు ఎవరి గుంపుకు అనువైన ప్రమాణాలు ఆ పీఠాధిపతులైన విమర్శకులు ప్రమాణాలు రూపొందించుకొని ఉన్న దిగజారిన సాహిత్య వాతావరణాన్ని సరి చేయడానికి బదులు మరింత దిగజార్చుతున్నారు.
తెలుగు సాహిత్యం, కవిత్వం లో నెలకొంటున్న పెడ ధోరణుల పట్ల భాషా, సాహిత్య అభిమానులు అప్రమత్తం కావలసి ఉన్నది. అవార్డులు సన్మానాలకు వెంపర్లాడే సరికొత్త జబ్బు నుండి యువ తరం రచయితలు కవులు సన్మార్గం వైపు నడిపించే కృషి ప్రస్తుతం అవసరం. ప్రపంచం గ్లోబలీకరణ దిశగా పరిణతి చెందిన దశలో అనేక మానవ వైవిధ్యాలు వైరుధ్యాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి అద్భుత పరిణామాల గుట్టును ప్రజలకు విప్పిచెప్పే దిశగా కవిత్వం , సాహిత్యం ప్రయాణించాలి. మానవ మనుగడను ప్రమాదకరం వైపు నడిపిస్తున్న వైషమ్యాలు, పర్యావరణ సమస్యలు ,ముంపు సమస్యలు, బహుళజాతి సంస్థల దుర్మార్గాల నుండి ప్రజలకు ఉత్పన్నమవుతున్న సమస్యలు, ఆధునిక మీడియా , సమాజం మనిషికి విసురుతున్న సవాళ్లు సాహిత్యరంగంలో ప్రస్ఫుటం అవుతున్నాయి. మనిషిచుట్టూ పొంచి ఉన్న ప్రమాదం పట్ల అక్షరాలు అప్రమత్తం కావాలి. సమాజం విస్తృతం- విశాలం అవుతున్నకొద్దీ సాహిత్య ప్రయోజనం ,కొలమానాలు అందుకనుగుణంగా సరైన దిశలో కర్తవ్యాలు నిర్వర్తించాలి. ప్రజాసమస్యలు , ప్రజలు చుట్టే అల్లుకున్న కవిత్వం , సాహిత్యం మాత్రమే రూపంలో , సారంలో సజీవ సాహిత్యంగా చరిత్రలో మనగలిగింది. నిజంగా కవులకు రచయితలకు గుర్తింపు ఇచ్చింది అదే! దుశ్శాలువల క్రింద దాగిన దుర్నీతి, అవార్డులు ఎప్పుడూ కవుల్నీ కవిత్వాన్నీ ఉన్నతంగా నిలపలేవు. కనీసం అవి ప్రోత్సాహకాలుగా కూడా ప్రస్తుతం లేవని ఘంటాపథంగా చెప్పవచ్చును. ఆ దిశగా భాషా, కవిత్వ , సాహిత్య ఉద్యమాలు నిలవాలని ,నడవాలని ఆశిద్దాం.

యన్.తిర్మల్ 9441864514