Home దునియా సూపర్ స్టార్ డమ్

సూపర్ స్టార్ డమ్

Mahesh-Prabhash,-Rana

టాలీవుడ్‌లో 200కోట్ల గ్రూపులోకి చేరిపోయిపెద్ద బిజినెస్‌మ్యాన్‌గా మారిపోయిన మరో తెలుగు యువ నటుడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. టాలివుడ్‌లో టాల్‌గా కటౌట్‌లా నిలబడిపోయిన మహేష్‌వైపే ఇండియా అంతా చూస్తోంది. బాలీవుడ్ రమ్మని ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నా అటుగా వెళ్ళనంటాడు. అదేమంటే ఆ భాష మీద పట్టులేదంటాడు. తమిళంలో ధారళంగా మాట్లాడగల స్థాయి ఉందికదా అటు అడుగువేయడానికేమిటి అభ్యంతరం అంటే తెలుగు సినిమాయే నా ప్రయార్టీ అంటాడు. హిట్లో ఫ్లాపో టాలివుడ్‌లోనే తేల్చుకుంటానంటాడు. తెలుగుసినిమా గురించి దేశమంతా మాట్లాడుకునే రోజురావాలని, ఈ సినిమా సాధించే విజయాన్ని చూసి అన్ని భాషల వారు పండగ చేసుకోవాలని ఆయన ఎంతో గాఢంగా కోరుకుంటాడు. 24 ఫ్రేముల వాళ్ళూ ఒత్తిడి పెడితే ఈ మధ్యే స్పైడర్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఏ హీరో చేయడానికైనా సాహసించని ప్రయోగాలు చేయడానికి మహేష్ పూనుకుంటాడు. ఫ్లాప్ అయినా హిట్టయినా క్రేజు తగ్గని నటుడు, వాటి ప్రభావం ఏ రకంగానూ పడని నటుడు మహేష్‌బాబు. సినిమా ఫ్లాప్ అయితే దానికి బాధ్యత పూర్తిగా తనదే నంటాడు.

అదే సక్సెస్ అయితే ఆ విజయం యూనిట్ మొత్తానిదంటాడు. అదేమిటంటే ఆ సినిమాకు నేను సంతకం చేయకపోయుంటే ఆ సినిమాయే ఉండేది కాదు కదా అంటాడు. 1314 సంవత్సరాలలోనే చైల్డ్‌స్టార్‌గా గుర్తింపు పొందాడు. ఇప్పటికీ ఆ స్టార్ డమ్ అలాగే కంటిన్యూ అవుతోంది. 25 సినిమాలు చేసినా ఇప్పటికీ ఫెయిల్యూర్‌ను తేలికగా తీసుకునే లక్షణం రాలేదు. తన వల్ల ప్రొడ్యూసర్‌కు నష్టం జరిగిందంటే తనకిచ్చిన డబ్బు వెనకిచ్చేసి తనవంతు బాధ్యతను నెరవేరుస్తాడు. ఫెయిల్యూర్ తెచ్చిన బాధకు పరిష్కారం ఏమిటో తెలుసుకునే వరకు, జరిగిన పొరబాటును దిద్దుకునే వరకు ఇంట్లోనే తన గదిలోనూ తనని తాను బంధించుకుని ఆత్మశోధన కోసం ఒంటరి తపసుచేస్తాడు. ఆ కాలంలో నలుగురిలోకి రావడానికి ఇష్టపడడు. ఈ ప్రయత్నంలో నెలలు దొర్లిపోతాయి. అయినా ఆయన ఆత్మశోధన చేసుకోకుండా బైటికిరాడు.

ఇటీవల రెండు సినిమాలు ఆయనను అప్‌సెట్ చేసినా శ్రీమంతుడు సినిమా ఆయనలో ఉత్సాహాన్ని నింపింది. తాజాగా విడుదలైన భరత్ అనే నేను సినిమా కూడా మంచి కలక్షన్లతో రికార్డులు సృష్టిస్తుండడంతో ఆయన తిరిగి ఫాంలోకి వచ్చాడు. గ్లామర్ కింగ్ అనిపించుకునే మహేష్ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన 6వ నటుడిగా అందరినీ ఆకర్షిస్తున్నాడు. మేమందరం ముసలి వాళ్ళమైపోతున్నా మహేష్ ఏజ్ పెరగడం ఆగిపోయి కుర్రాడిలాగే ఉండిపోయాడు అని పోశాని కృష్ణమురళి అన్న మాటలు అక్షరాలా నిజం. రోజు రోజుకూ ఆయన అందం విజృంభిస్తున్నట్టే కలెక్షన్లు కూడా విజృంభిస్తున్నాయి. దేశ విదేశాలలో డాలర్లు దులపడంలో ముందుంటున్నాయి. ముఖ్యంగా అమెరికాలో మహేష్ అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. ఆయన సినిమాలకు వచ్చే విదేశీ కలెక్షన్లలో సగానికిపైగా అమెరికా నుంచి వస్తాయి.

బాలనటుడిగా సినిమాలలోకి ఎంటరై నూనుగు మీసాలైనా రాని దశలోనే స్టార్‌డమ్ అందుకుని ఇప్పడు మోస్ట్ డిజైరబుల్ హీరోలలో జాతీయస్థాయిలో 6వవాడిగా నిలిచిన మహేహ్‌బాబు స్వయంకృషికి నిలువుటద్దం. వయసు నాలుగు దశాబ్దాలకు చేరినా మిల్క్‌బాయ్‌లా ఉండడం విశేషం. ఆయన పేరు చెప్పుకుని ఎందరో సినిమాలలో సీన్‌లు సృష్టించారు. అష్టాచెమ్మా సినిమా మొత్తం మహేష్ పేరు చుట్టే తిరుగుతుంది. తెలుగుతెరమీద ఎందరో హీరోలున్నా సీనియర్‌లు, జూనియర్లు అన్న తేడాలేకుండా అంతా ముక్తకంఠంతో ఆయనను అందగాడు అని వేదికలెక్కి ప్రశంసించారు. ఏ యాక్టర్‌తోనూ అభిప్రాయభేదాలులేని మహేష్ మల్టీస్టారర్ చేయడాకి ఎవర్ రెడీ అంటాడు. హీరోల మధ్య ఇగోలు, పర్సనాలిటీ క్లాష్‌లు ఉండకూడదన్నది ఆయన కోరిక. ఎవరి సినిమా బాగున్నా, పాట బాగున్నా, డైలాగ్ బాగున్నా, ఆఖరికి ఫస్ట్‌లుక్ బాగున్నాఫోన్‌చేసి ప్రశంసించగల మంచి మనసున్న నటుడు మహేష్. నటన అంతా కెమెరా ముందే అది దాటి బైటికి వచ్చాక అందరిలో ఒక్కళ్ళమే అంటాడు. అందరితోనూ ఎంతో కలుపుగోలుగా ఉండే మహేష్ అందరినీ కలుపుకుని పోవడంలో సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు.

బల్లాలదేవుడు రానా

లీడర్‌గా రాణించి, బల్లాలదేవుడిగా బాహుబలితో పోటీ పడి ప్రజల హృదయాలను ఫస్ట్‌లుక్‌లోనే దోచుకున్న హీరో దగ్గుబాటి రానా. ప్రభాస్‌తో సమానంగా 1.89 మీటర్ల పొడవు కలిగి కండలు, చార్మ్‌లుక్ కలిగి బాహుబలిలో ఆయన చేసిన సంచలనం, బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన రేపిన దుమారం ఇంతా అంతాకాదు. ఒక్క సినిమా కోసం మొత్తం ఫిజిక్‌నే మార్చేసుకుని, డిఫరెంట్‌లుక్‌లో కనబడేందుకు తపించాడు. డైలాగ్‌మాడ్యులేషన్ పూర్తిగా మార్చేసి స్టైలిష్ విలన్‌గా అందరినీ ఆకట్టుకున్నాడు. బాహుబలి1 చూసినపుడు రానా, రమ్యకృష్ణలకే ఎక్కువ మార్కులుపడ్డాయి. బాహుబలి2లో ఆ క్రేజు కొనసాగినా ప్రభాస్ యాక్షన్‌లో విజృంభించి తన స్థానానికి న్యాయం చేశాడు. మంచి లుక్, దానికి తగ్గనటనతో తెరపై సందడి చేయడంతో సినిమా సమ ఉజ్జీల నడుమ సంగ్రామంగా మారింది.

మొట్టమొదటి సినిమా లీడర్‌తోనే ఫిలిమ్‌ఫేర్ అవార్డు, సిని ‘మా’ అవార్డు పొందాడు. దం మారో దం హిందీ సినిమాలో తొలిసారి నటించి జీ సినీ అవార్డులో బెస్ట్‌మేల్ డిబట్ అవార్డు పొందాడు. కృష్ణం వందే జగద్గురుం సినిమాకు సీమా బెస్ట్ యాక్టర్ అవార్డ్ పొందాడు. సినిమాలలో సంచలనాలు రేపుతున్న రానాది ఫిల్మీఫామిలీ! తాత దగ్గుబాటి రామానాయుడు సుప్రసిద్ధ నిర్మాత. రామానాయుడు స్టూడియో అధినేత. తండ్రి దగ్గుబాటి సురేశ్ లీడింగ్ ప్రొడ్యూసర్. ప్రముఖ హీరో దగ్గుబాటి వెంకటేశ్ ఈయన చిన్నాయిన. యువతరం హీరోగా రాణిస్తున్న నాగచైతన్య రానాకు బావ. ఇంత నేపథ్యం, సత్తా ఉన్న నటుడు కావడంతో ఆయన మోస్ట్ డిజైరబుల్ హీరోస్‌లో 7వ స్థానంలో హీరో మహేష్‌కు ఒక అడుగు దిగువన ఉన్నాడు. సినిమాలలో సీరియస్‌గా కనిపించే రానా యాంకరింగ్ చేసేటప్పుడు బైట ఎంతో హుషారుగా, సరదాగా నవ్వుతూ నవ్విస్తూ జోకులతో, పంచ్‌లతో మహా జోష్‌తో ఉంటాడు. తెలుగు సినిమాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన హీరోలు ముగ్గురూ జాతీయస్థాయిలో ప్రేక్షకులు కోరుకునే కథనాయకులుగా పేరు గుర్తింపు పొందడం, బ్రహ్మాండమైన క్రేజుతో కొనసాగడం తెలుగువారందరికీ గర్వకారణం.

రెబెల్‌స్టార్ ప్రభాస్

ఒకప్పుడు మధ్యతరగతి సామాన్యుడు పడ్డ కష్టాలన్నీ పడ్డాడు. వాళ్ళ నాన్న సినిమా నిర్మాత ఉప్పలపాటిరాజు. ఆయన మంచి సినిమాలే తీసినా విజయాలు వరసబెట్టి క్యూకట్టవు. సినిమా అటుఇటుగా ఆడినా, ఫ్లాప్ అయినా ఆర్థిక సమస్యలు ముసురుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు బాహుబలి సినిమా రెండు భాగాలకీ కలిపి 45కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్‌కు చేతిలో డబ్బులు ఆడక మిడిల్‌క్లాస్ తిండి తిని బస్సెక్కి కాలేజీకి వెళ్ళిన సందర్భాలున్నాయి. మాంచెస్టర్ యూనివర్శిటీలో చదువుకునే రోజులలోనూ ఇలాంటి అనుభవమే ఉంది. అక్కడి వారు మాత్రం బాగా డబ్బున్న సౌండ్ పార్టీయే అయినా సింపుల్‌గా ఎలా బస్సులో వెళ్తున్నాడో అని అనుకోవడం విన్నాడు. ఎలాగైనా వాళ్ళ మాటలు నిజంచేయాలని, ఆర్థికంగా సౌండ్‌గా మారాలని చాలా గట్టిగా అనుకునేవాడు.

ఆ పట్టుదలే కష్టపడి పనిచేసేలా చేసింది. బాహుబలిలాంటి హైటెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమాలో పనిచేసిన ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ చిరు బడ్జెట్‌తో, ఎనలాగ్ కెమెరాతో తయారైంది. ఈశ్వర్ సినిమాని తన ఇద్దరి చెల్లెళ్ళతో కలిసి చూశాడు. ఏ షాట్ తర్వాత ఏ షాట్ వస్తుందో..ఏ షాట్ ఎలా వచ్చిందో హాలులో కూచుని చూసినపుడే ప్రేక్షకులతోపాటే తనకూ తెలిసిందంటాడు ప్రభాస్. ఈశ్వర్ సినిమా బాగుంది..నేనే అంత బాగా చేయలేదు..అని అనుకున్నానంటాడు. దక్షిణాదిలో రజనీకాంత్ పెద్ద హీరోయే అయినా జాతీయస్థాయిలో రెండో స్థానంలో నిలిచేంత క్రేజున్న యాక్టర్‌గా ఏనాడూ నిలువలేదు. ఆ పని కేవలం 17 సినిమాలతో చేసి రికార్డు సృష్టించాడు. ఇన్ని సినిమాలు చేసినా ఇప్పటికీ అభిమానుల ముందు ధైర్యంగా నిలబడడానికి మొహమాటపడతాడు.

వాళ్ళది అమ్మలాంటి అభిమానం. మచ్చలేని ఆ అభిమానాన్ని నిలబెట్టుకోడానికి ఎంతైనా కష్టపడతాను. కానీ ఫలితం మనం ఆశించే విధంగా ఉంటుందని అనుకోడానికి లేదు కదా! అంటాడు. మోస్ట్ డిజైరబుల్ హీరోలలో రెండోవాడిగా నిలిచినా ఆ మొహమాటం ఆ సిగ్గరితనం ఇంకా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం సాహో సినిమా పెద్ద బడ్జెట్‌తో వస్తోంది. కేవలం క్లైమాక్స్ సీన్‌లు షూట్ చేయడానికే 300 కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఈ సినిమాపై అభిమానులు కూడా పెద్దగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తోంది. విదేశాలలోని అభిమానులు కూడా ఉవ్విళ్ళూరుతున్నారు.