Home జాతీయ వార్తలు సిపిఐ అగ్రనేతలను కలిసిన వైఎస్ జగన్

సిపిఐ అగ్రనేతలను కలిసిన వైఎస్ జగన్

jagan-n-suravaramఢిల్లీ: తన మీద కేసులు కొత్తేమి కావని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో సిపిఐ అగ్రనేతలు సురవరం సుధాకర్ రెడ్డి, డి. రాజా తదితరులను కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన సురవరం సుధాకర్ రెడ్డి, రాజాలతో కలిసి వైసిపి నుండి 21 మంది ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడమే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన వైనాన్ని వివరించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం ఇచ్చారు.
తనపై పెట్టిన కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమేనని అన్నారు. కాంగ్రెస్, టిడిపి నాయకులు కుమ్మక్కై తనపై కేసులు బనాయించారని విమర్శించారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు తనపై కేసులు లేవని, పార్టీనుండి బయటకు వెళ్లిన వెంటనే కేసులు పెట్టారని తెలిపారు. ఒక వ్యక్తి తప్పు చేసినట్టు రుజువుకాకపోవడంతో మూడు నెలలకంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంచే అధికారం లేదని, అయితే అందుకు విరుద్ధంగా తనను 16 నెలలపాటు జైల్లో పెట్టారని అన్నారు. జగన్ కనబడకపోతే పార్టీ ఉండదని భావించి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్ర పన్నారన్నారు. అప్పుడూ వాళ్లు తనను ఏమీ చేయలేరనీ, పైన దేవుడున్నాడు.. ఇక్కడ ప్రజలున్నారని జగన్ వ్యాఖ్యానించారు.