Home తాజా వార్తలు జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సిబిఐ కోర్టు

జగన్ పిటిషన్‌ను కొట్టివేసిన సిబిఐ కోర్టు

YS-Jagan1

హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని వైసిపి చీఫ్ జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. నవంబరు 2వ తేదీ నుంచి ఎపిలో ప్రతిపక్ష నేతగా తాను పాదయాత్ర చేయనున్నట్టు ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్నందున ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కాలేనని, ఈ క్రమంలోనే తనకు ఆరు నెలల పాటు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే కేసు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని సిబిఐ, ఇడి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న సిబిఐ కోర్టు జగన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం వల్ల జగన్‌కు జరిగే నష్టమేమిటని కోర్టు ప్రశ్నించింది. వారంలో ఆరు రోజులు పాదయాత్ర చేసి శుక్రవారం నాడు కోర్టుకు హాజరు కావొచ్చని, ఒక పౌరుడిగా కోర్టుకు హాజరవుతున్నట్టు ప్రజలకు చెప్పొచ్చని, జగన్‌కు కూడా విశ్రాంతి లభిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. జగన్ పిటిషన్‌ను సిబిఐ కోర్టు కొట్టి వేయడంతో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు ఆయన తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు.

YSCP Chief Jagan’s Petition Dismissed in CBI Court