Home తాజా వార్తలు 2019 తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం: యువీ

2019 తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం: యువీ

Yuvraj Singh says Will take a call on my Career after 2019 World Cup

ఇండోర్: టీమిండియాకు తన ఒంటిచెత్తో ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. 2011 ప్రపంచకప్‌లో క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ది సీరిస్‌గా నిలవడంతో పాటు భారత్‌కు టైటిల్ అందిచండంలో కీలక పాత్ర పోషించాడు యువీ. ఇక పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లోనూ యువరాజ్ తనదైన ఆటశైలీతో రెచ్చిపోతుంటాడు. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో యువీ ఇంగ్లండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐపిఎల్‌లో యువీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా యువరాజ్ విలేకర్లతో మాట్లాడుతూ… ఫార్మాట్‌తో సంబంధం లేకుండా 2019 వరకు క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది ఇంగ్లండ్, వేల్స్ ఆతిథ్యం ఇవ్వనున్న ప్రపంచకప్‌లో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. అందుకే అప్పటి వరకు సమయం తీసుకుంటున్నాను. ఆ తర్వాత నా క్రికెట్ కెరీర్‌పై కీలక నిర్ణయం ప్రకటిస్తానన్నాడు. గత 18ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాను. ప్రతి క్రీడాకారుడు ఏదో ఒక రోజు తన ఆటకు దూరం కావాల్సిందే. ఇందులో నేనేమీ మినహాయింపు కాదు. నేను ఏదో ఒక రోజు తన ఆటకు దూరం కావాల్సిందేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన దృష్టి ఐపిఎల్‌పై ఉందని, లీగ్‌లు ముగిసే సరికి తుది నాలుగు జట్లలో చోటు దక్కించుకోవడమే తమ లక్ష్యంగా పేర్కొన్నాడు. అంతేగాక ఈ సీజన్‌లో తమ జట్టు అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో బలంగా ఉందన్నాడు. ఇక కరేబియన్ స్టార్ క్రిస్ గేల్ బాగా రాణిస్తున్నాడని, అతడి ఫామ్ తమ జట్టుకు ఎంతో ముఖ్యమని యువీ అభిప్రాయపడ్డాడు.