Home తాజా వార్తలు నా టార్గెట్ వచ్చే వరల్డ్ కప్: యువరాజ్

నా టార్గెట్ వచ్చే వరల్డ్ కప్: యువరాజ్

Yuvraj Singh wants play in 2019 ICC World Cup

ముంబయి: ఫామ్ లేమి, ఫిట్‌నెస్‌ సమస్యతో గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ వేదికగా 2019లో జరగనున్న ప్రపంచకప్‌లో ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు. ప్రస్తుతం యువి దేశవాళీ టోర్నీ ‘విజయ్ హజారే ట్రోఫీ’లో ఆడుతున్నాడు. అయితే,  ఈ టోర్నీలో కూడా ఇప్పటివరకు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. 7 మ్యాచ్‌లు ఆడిన యువరాజ్ పేలవమైన ఆటతీరుతో 264 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో భారత జట్టులో అతని పునరాగమనం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరోవైపు  మిడిలార్డర్‌లో యువ ఆటగాళ్లు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మనీశ్ పాండే, కేదార్ జాదవ్,  దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌ల రూపంలో మిడిలార్డర్‌లో తీవ్ర పోటీ ఉంది. వీళ్లను దాటి యువి జట్టులోకి రావడం మరింత కష్టం. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2017 ఆరంభంలో భారత జట్టులోకి పునరాగమనం చేసిన యువరాజ్ ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో 150 పరుగులు చేసి సత్తాచాటాడు. దాంతో మళ్లీ యువరాజ్ కెరీర్‌ గాడిన పడిందనుకున్నారు. కానీ, గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో మళ్లీ యువి ఘోరంగా విఫలమయ్యాడు. ఆ తరువాత మళ్లీ జట్టులో చోటు దక్కలేదు. ఇదిలాఉండగా తాజాగా ‘విజయ్ హజారే ట్రోఫీ’లో ఆడుతున్న యువరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి టార్గెట్ వచ్చే ప్రపంచకప్ లో ఆడటమేనని చెప్పుకొచ్చాడు. కానీ, ఏదైన అద్భుతం జరిగితే తప్ప యువి తిరిగి  టీమిండియాలో రావడం గగనమే.

Yuvraj Singh wants play in 2019 ICC World Cup.