Monday, December 23, 2024

ఓ మెట్టు దిగుతా: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పార్టీని వీడిన వారంతా తిరిగి రావాలని, అవసరమైతే తాను ఓ మెట్టు దిగుతానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గాంధీ భవన్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ను గద్దెదించేందుకు కలిసి పోరాటం చేద్దామని ఆయన కోరారు. వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పార్టీ నుండి ఇతర పార్టీల్లో చేరిన నేతలంతా కాంగ్రెస్ లోకి రావాలని కోరారు. పార్టీని వీడిన నాయకులతో తనకు ఏమైనా అవమానాలు జరిగినా తనకు ఇబ్బంది లేదన్నారు. అవసరమైతే తాను ఓ మెట్టు దిగుతానని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుక తమతో కలిసి రావాలని కోరారు. తానే మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి చెప్పారు. తనతో ఇబ్బంది అనుకుంటే పార్టీలో ఉన్న ఇతర సీనియర్లతో చర్చించాలని కూడా కోరారు. కాంగ్రెస్ పార్టీ అమ్మ వంటిందన్నారు. అందరూ ఆదరించాలని ఆయన కోరారు.

మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది
మోడీని ఓడించవచ్చునని కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందని చెప్పారు. కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతించిందని తెలిపారు. అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొన్ని నిలిచిన అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యానికి అండగా నిలిచారని కొనియాడారు. కర్ణాటక ఫలితాలపై దేశ నలుమూలల చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని మేథావులు, బుద్ధి జీవులు, సిద్ధాంతకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపును స్వాగతిస్తున్నారు. ఎడారిలో ఒయాసిస్సుగా మాదిరిగా కాంగ్రెస్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బద్ధ వ్యతిరేకులు కూడా కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పును అభినందించారు.

బిజెపికి ఇప్పుడు బిసిలు గుర్తుకు వచ్చారా?
బిజెపికి ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో యూనివర్సిటీల్లో రిక్రూట్ మెంట్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ వరకు రిజర్వేషన్లు కల్పించిందన్నారు. కానీ విపి సింగ్ హయాంలో మండల్ కమిషన్ ద్వారా బిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తే దానికి వ్యతిరేకంగా కమాండల్ పేరుతో దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టింది బిజెపి కాదా? అని రేవంత్ ప్రశ్నించారు. బిసి జనాభాకు తగ్గట్టుగా నిధులు, అభివృద్ధి జరగాలంటే బిసి జనగణన చేపట్టాలని కాంగ్రెస్ స్పష్టమైన విధానం తీసుకుందన్నారు. ఇతర పార్టీలు ఇదే డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. మరీ బిసి జనాభా లెక్కించడాన్ని ఎవరు అడ్డుకుంటున్నారో మోడీ చెప్పాలన్నారు.

మోడీ ఒక్కరే ప్రధాని అయితే బిసిల కడుపు నిండినట్లు కాదని రేవంత్ బిజెపి నేతలకు చురకలు అంటించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే ఉందిగా మరి బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పదవి పోయే ముందు బిసిలు గుర్తొచ్చారా? అని ఎద్దేవా చేశారు. త్వరలో బిసిలకు కాంగ్రెస్ పార్టీ ఏమి చేయబోతుందో బిసి డిక్లరేషన్ రూపంలో వివరిస్తామని రేవంత్ అన్నారు. ఇదిలా ఉండగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగుతుంది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగింది. ఈ విషయమై ఆయన స్పష్టత ఇచ్చారు. తనను కాంగ్రెస్ లో చేరాలని కోరారని చెప్పారు. కానీ తాను బిఆర్‌ఎస్‌ను ఓడించేందుకు బిజెపిలో చేరినట్టుగా తెలిపారు.

తాను మాత్రం బిజెపిని వీడడం లేదన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా కాంగ్రెస్ లో చేరుతారని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ వేదికగా ఈటల రాజేందర్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో మరో ఆరు మాసాల్లో ఎన్నికలు రానున్నాయి. కొందరు నేతలు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరుతారని వార్తలు వచ్చిన మరునాడే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News