Monday, November 18, 2024

గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

అమీన్‌పూర్(రామచంద్రపురం): సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు రింగ్ రోడ్డు సమీపంలో ఓ లారీ వేగంగా రింగ్ రోడ్డుపై నుంచి వలస కార్మికుల గుడిసెల్లోకి దూసుకువెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాకు జింకేర తాండకు చెందిన పలు కుటుంబాలు జీవనోపాధిక కొల్లూరుకి వలస వచ్చారు. వీరిని గత రెండు నెలల క్రితం ఓ కాంట్రాక్టర్ తీసుకొని వచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుపై పిచ్చి మొక్కలను తొలగించడం, మొక్కలు నాటడం ఇలాంటి పనులు చేస్తున్నారు. అయితే వీరంతా కొల్లూరు టోల్ ప్లాజా వద్ద రింగ్ రోడ్డు అనుకొని మొక్కలు పెట్టే ప్రదేశంలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో హర్యానా నుంచి చిత్తూరు సరుకులను తీసుకెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో లారీని వేగంగా తీసుకు వెళుతూ రింగ్ రోడ్డు సేఫ్టీ ర్యాంపును ఢీ కొట్టుకొని సర్వీస్ రేట్ వైపు దూసుకు వెళ్తూ అక్కడే ఉన్న గుడిసెల్లోకి దూసుకెళ్లింది. ఆ గుడిసెలో నివసిస్తున్న జింకేర తాండకు చెందిన బాబు రాథోడ్ (48) అతని భార్య కమలవ్వ అలియాస్ కమిలి బాయ్ (43) వారి చిన్న కుమారుడు బసప్ప రాథోడ్ (24) నిద్రలోనే మృతి చెందారు. రెండు నెలల క్రితమే జీవనోపాధికి ఇక్కడికి వచ్చారు. బాబు రాథోడ్, కమలవ్వ దంపతులకు నలుగురు కుమారులు కుమార్తె ఉన్నారు. వారు ముంబైలో జీవనోపాధి పొందుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని నివసించడం ప్రమాదకరమని ఓఆర్‌ఆర్ ట్రాఫిక్ పోలీసులు అప్పట్లో నివసించే వారిని హెచ్చరించినట్టు తెలిపారు.

సంఘటన స్థలాన్ని మాదాపూర్ డిసిపి శిల్పవల్లి, మియాపూర్ ఎసిపి నరసింహారావు, ఎంవిఐ రాజ మహమ్మద్, సిఐ సంజయ్ కుమార్ సందర్శించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. తక్షణ ఖర్చుల కోసం రూ.50వేలు అందించారు. ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News