Tuesday, November 5, 2024

చోక్సీ అప్పగింత ఇప్పట్లో లేనట్లే

- Advertisement -
- Advertisement -

Mehul Choksi in Dominica's custody

పట్టి తేలేక ఒట్టి విమానం తిరుగుముఖం
ఇడి సిఐడి విశ్వప్రయత్నం వృధా
డొమినికా కస్టడీలోనే నిందితుడు

న్యూఢిల్లీ : ఇప్పటికిప్పుడు డొమినికా నుంచి చోక్సీ ఆంటిగ్వాకు వెళ్లడం అసాధ్యం అవుతున్నందున ఇండియాకు రప్పించడం అసాధ్యం అయింది. ఈ క్రమంలో డొమినికాలో ఉండి చేసేదేమీ లేదని తేల్చుకుని భారత సిఐడి, ఇడి ఇతర దర్యాప్తు సంస్థలతో కూడిన అధికార బృందం తిరుగుముఖం పట్టింది. ఛోక్సీని తీసుకువచ్చేందుకు అవసరం అయిన కీలక పత్రాలతో డొమినికాకు వెళ్లిన ఖతార్ ప్రైవేట్ విమానం ఎ 7సిఇఇ ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరింది. డొమినికాలోని మేరీగాట్‌లో ఈ విమానం ఏడురోజుల పాటు ఉంది. చోక్సీపై కోర్టు కేసులు వచ్చే నెల మధ్య వరకూ డొమినికాలో పెండింగ్‌లో పడ్డాయి. తనను భారత్, డొమినికా పోలీసు బృందాలు అక్రమంగా డొమినికాకు తీసుకువచ్చాయని , ఈ క్రమంలో తనపై దౌర్జన్యం జరిపారని ఛోక్సీ డొమినికా కోర్టులో తెలిపారు. అయితే ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా బోటులో వెంట తన ప్రేయసితో వచ్చాడని, ఈ క్రమంలో తమకు చిక్కాడని స్థానిక అధికారులు తెలిపారు.

ప్రస్తుతం డొమినికా పోలీసు కస్టడీలో ఉన్న ఛోక్సీకి స్థానిక కోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే తదుపరి విచారణ ముగిసే వరకూ కస్టడీలోనే ఉండాలని, ఇతర దేశాలకు ప్రత్యేకించి భారత్‌కు అప్పగించరాదని కోర్టు తెలిపింది. అక్కడి కోర్టులలో విచారణ తరువాత ముందుగా ఆంటిగ్వాకు పంపించడం లేదా భారత్‌కు తరలించేందుకు వీలుంది. అయితే ఎనిమిది మంది ప్రముఖ లాయర్ల బృందపు వాదనలతో విచారణల దశను చోక్సీ చాకచక్యంగా పొడిగించుకున్నారు. గత నెల 28న డొమినికాకు చేరిన భారతీయ బృందం దీనితో చేసేదేమీ లేకపోవడంతో ఇప్పుడు ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేరుకోనుంది. శుక్రవారం రాత్రి ఎప్పుడైనా ఈ బృందం ఢిల్లీకి చేరుకుంటుంది. అయితే ఛోక్సీని తీసుకువచ్చేందుకు ప్రైవేట్ విమానాన్ని అందులో కీలక ఫైళ్లతో అధికారుల బృందాలను డొమినికాకు పంపించినట్లు కానీ వారు ఇప్పుడు తిరిగి వస్తున్నట్లు కానీ అధికార వర్గాలు ఇప్పటివరకూ నిర్థారించలేదు.

ఛోక్సీ అప్పగింతకు ఆంటిగ్వా గ్రీన్‌సిగ్నల్?
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం

భారతీయ ఫరారీ వ్యాపారి మెహుల్ ఛోక్సీ భారత్‌కు పంపించేందుకు ఆంటిగ్వా, బర్బూడా దేశాలు సానుకూలంగా ఉన్నాయి. ఆంటిగ్వా కేబినెట్‌భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారని అక్కడి పత్రికలు తమ వార్తాకథనాలలో తెలిపాయి. భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు వేలాది కోట్ల రూపాయల మోసం కేసులో చోక్సీ నిందితుడుగా ఉన్నారు. అయితే చట్టాలకు భారతీయ న్యాయస్థానాల విచారణలకు అందకుండా దేశం విడిచిపొయ్యాడు. ఆంటిగ్వా పౌరసత్వం పొందారు. తరువాతి క్రమంలో పొరుగునే ఉన్న డొమినికా దీవి దేశంలో అనుమానాస్పద స్థితిలో పట్టుపడ్డాడు. ఛోక్సీ అప్పగింతకు సంబంధించి దేశపు కేబినెట్ భేటీలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నిర్థారణ అయింది.

ప్రస్తుతానికి చోక్సీ డొమినికాలో ఉన్నందున ఆయనను భారత్‌కు తిప్పిపంపించడం అనేది ఆ దేశ అంతర్గత సమస్య అవుతుంది. ఒకవేళ ఇప్పటి కోర్టు విచారణలు దాటుకుని ఆయన డొమినికా నుంచి ఆంటిగ్వా , బర్బూడాకు వస్తే అప్పుడు సమస్య తమకు తిరగబెడుతుందని మంత్రిమండలి భావించిందని పత్రికలు తెలిపాయి. అయితే ఇండియాకు ఆయనను పట్టి అప్పగించడమే అన్ని విధాలుగా మంచిదని ఆంటిగ్వా కేబినెట్ ఓ అభిప్రాయానికి వచ్చినట్లు పత్రికలు రాశాయి. ప్రధాని గాస్టన్ బ్రౌనే అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. కేబినెట్ భేటీ తరువాత దేశ సమాచార మంత్రి మెల్‌ఫోర్డ్ నికోలాస్ విలేకరులతో మాట్లాడారు. ప్రధానంగా చోక్సీ అంశం ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News