Thursday, January 23, 2025

తమిళనాడులో మరోసారి ఈడీ దాడుల అలజడి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులో మరోసారి ఈడీ దాడులు అలజడి సృష్టిస్తున్నాయి. అక్రమ ఇసుక మైనింగ్‌తో మనీలాండరింగ్ వ్యవహారం సాగిందన్న ఆరోపణలపై అధికార డిఎంకె కీలక నేత, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఆయన కుమారుడు ఎంపీ, గౌతమ్ సిగమణి నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ అధికారులు సోమవారం దాడులు జరిపారు. చెన్నై, పొన్ముడికి బలమైన పట్టు ఉన్న విల్లుపురంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో రూ. 70 లక్షల నగదు, బ్రిటన్ కరెన్సీ పౌండు,్ల కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తండ్రీ, కొడుకుల నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. సాయుధులైన సిఆర్‌పిఎఫ్ జవాన్లను వెంట తీసుకుని సోదాలు చేపట్టారు.

‘ఎన్నికల ప్రచారం’లో ఈడీ : సిఎం స్టాలిన్ వ్యంగ్యాస్త్రం
విపక్షాల సమావేశం కోసం బెంగళూరు బయల్దేరిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సోదాలపై తీవ్రంగా స్పందించారు. ఈడీ “ఎన్నికల ప్రచారం ”లో చేరిందంటూ దర్యాప్తు సంస్థపై ఘాటు విమర్శలు చేశారు. ఇటీవలే పొన్ముడిపై ఉన్న రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ఈడీ సోదాలు చేపట్టింది. ప్రతిపక్షాల భేటీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మా కోసం తమిళనాడు గవర్నర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈడీ కూడా ఈ ప్రచారంలో చేరింది. ఇక మా ఎన్నికల పని సులువవుతుందని భావిస్తున్నా ” అంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల వేళ ఈడీ చేపట్టే ఈ దాడులు సాధారణమేనని, ఇలాంటి బెదిరింపులకు డీఎంకే భయపడదని అన్నారు. మనీలాండరింగ్ కేసులో రాష్ట్రమంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ గత నెల అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కొన్ని రోజుల వ్యవధి లోనే మరో మంత్రిపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం చెలరేగింది. కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం కుట్ర పూరితంగానే తమ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని డీఎంకే మండిపడింది. డిఎంకె అధికార ప్రతినిధి ఎ. శరవణన్ ఈ దాడులపై తీవ్రంగా విమర్శించారు. గుట్కా స్కాండల్ వంటి కుంభకోణాల్లో ఇరుక్కున్న ఎఐడిఎంకె నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా డిఎంకె నేతలపైనే దాడులు చేయడం రాజకీయ వేధింపులుగా వ్యాఖ్యానించారు.2007 2011 మధ్య గత ప్రభుత్వంలో పొన్ముడి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో క్వారీ లైసెన్సు నిబంధనలను ఉల్లంఘించారని , గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ. 28 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

అయితే ఈ కేసుపై విచారణను నిలిపివేయాలని మద్రాస్ హైకోర్టును మంత్రి, ఎంపీ ఆశ్రయించగా, వీరిద్దరూ నేరం చేశారని భావించడానికి కారణాలు ఉన్నాయని, అందువల్ల విచారణను ఆపలేమని హైకోర్టు స్పష్టం చేసింది. 72 ఏళ్ల మంత్రి పొన్ముడి విల్లుపురం జిల్లా లోని తిరుక్కోయిలూరు నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 49 ఏళ్ల కుమారుడు గౌతం సిగమణి కల్లకురిచ్చి నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News