Thursday, December 12, 2024

తెలంగాణ తల్లి విగ్రహం రూప శిల్పి రమణా రెడ్డిని సన్మానించిన పిసిసి అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం సహా తెలంగాణ అమరవీరుల జ్యోతి రూప శిల్పి రమణా రెడ్డిని ఆదివారం టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సన్మానించి సత్కరించారు. మహేష్ కుమార్ గౌడ్ స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో రమణారెడ్డి కళాత్మకతని అభినందిస్తూ, శాలువలు, జ్ఞాపికలతో అభినందించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో అమర వీరుల పిడికిళ్లని జోడించడం ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనంగా, స్ఫూర్తిదాయకంగా ఉందని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. కాగా, తెలంగాణ తల్లి విగ్రహం రూపకర్త ప్రొఫెసర్ తోపారపు గంగాధర్‌ను ప్రభుత్వం శనివారం జవహర్ లాల్ నెహ్రు ఆర్ట్ జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్‌గా నియమించి గౌరవించుకుంది.

అభ్యంతరాలపై విగ్రహ రూపకర్త, రూపశిల్పిల వివరణ ఇలా

సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి నేడు ప్రతిష్టించనున్న తెలంగాణ తల్లి విగ్రహం గురించి బిఆర్‌ఎస్ నాయకులు చేసిన అభ్యంతరాలపై తెలంగాణ తల్లి విగ్రహ రూపకర్త గంగాధర్, రూపశిల్పి రమణారెడ్డిలు వివరణ ఇచ్చారు. తెలంగాణ తల్లి చేయి కాంగ్రెస్ చేయి గుర్తు కాదని అది అభయహస్తమని వారు స్పష్టం చేశారు. చేతులు ఉన్న వాళ్లంతా కాంగ్రెస్ వాళ్లా?. సైకిల్ తొక్కుతున్న వాళ్లంతా ఒక పార్టీకి సంబంధించిన వాళ్లా?, తెలంగాణలో అనేక ప్రత్యేక పండుగలు ఉన్నాయని, బతుకమ్మతోపాటు బోనాలు, సదర్, సమ్మక్క సారక్క లాంటి అనేక పండగలు తెలంగాణకు ప్రత్యేకమేనని వారు స్పష్టం చేశారు. అందుకే బతుకమ్మను విగ్రహంలో పొందుపరుచలేదన్నారు.

తెలంగాణ తల్లి సాధారణ మహిళగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, పోరాట స్ఫూర్తి కనిపించేలా విగ్రహాన్ని తయారు చేయాలని ఆయన సూచించారని వారు తెలిపారు. దేవతలు గుడిలో ఉండాలి, తల్లి ఇంట్లో ఉండాలంటూ తెలంగాణ తల్లి విషయంలో కెసిఆర్, రేవంత్ ఆలోచనలు వేర్వురుగా ఉన్నాయని వారు తెలిపారు. తెలంగాణ తల్లి రూపం కోసం అనేక స్కెచ్‌లు తయారు చేశామని, ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారన్న అర్థం వచ్చేలా ఈ విగ్రహాన్ని తయారు చేశామని వారు వివరించారు. తెలంగాణ సమాజమంతా కొత్త తెలంగాణ తల్లి రూపాన్నే ఇష్టపడుతారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, మొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది కూడా ప్రొఫెసర్ గంగాధర్ కావడం గమనార్హం.

కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ

తెలంగాణ తల్లి విగ్రహం ఆకుపచ్చచీరలో నిలబడి ఉన్నట్లుగా తయారు చేశారు. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలు వరి, మొక్కజొన్న, సజ్జ కంకులున్నాయి. వీటి ద్వారా గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటి చెప్పారు. మెడలో తెలంగాణ ఆడపడుచులు ధరించే తీగ, చేతికి ఆకుపచ్చ గాజులు, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరకట్టుకొని తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తాయి. తెలంగాణ పోరాట స్పూర్తిని తెలిపేలా విగ్రహ పీఠంలో బిగించిన పిడికిళ్లు రూపొందించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News