Monday, December 23, 2024

భక్తజన సంద్రంగా అయోధ్య

- Advertisement -
- Advertisement -

బాల రాముడి దర్శనానికి పోటెత్తిన భక్తులు, తొలిరోజే దర్శనం చేసుకున్న 5లక్షల మంది

అర్ధరాత్రి నుంచే ఆలయం వెలుపల వేచి ఉన్న భక్తులు

రామ్‌లల్లా పేరు ఇక బాలక్ రామ్

2.5 బిలియన్ల ఏళ్ల నాటి కృష్ణశిలతో విగ్రహం

కర్నాటక నుంచి రవాణా

అయోధ్య : అయోధ్యలోని రామాలయం మంగళవారం భక్తజన సంద్రంగా మారింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్టతో తెరుచుకున్న ఆలయం తలుపులు సోమవారం విఐపిల దర్శనాలకే పరిమితం కాగా మంగళవారం నుంచి సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం ఉంటుందని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. దీంతో అర్ధరాత్రి నుంచే ఆలయ ప్రధాన ద్వారం వెలుపల వేచి ఉన్న భక్తులకు మంగళవారం ఉదయం నుంచి దర్శనానికి అనుమతి లభించింది. అయితే క్రమ క్రమంగా భక్తుల తాకిడి పెరిగిపోయి మధ్యాహ్నానికి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. అయోధ్య పట్టణ భక్తజనసంద్రంగా మారిపోయి రామనామ స్మరణతో ఆథ్మాత్మిక వాతావరణం అలుముకుంది. ఉదయం 6 గంటల నుం చి సామాన్య భక్తులను ఆలయ సముదాయంలోకి అనుమతించడం ప్రారంభమైందని, మధ్యాహ్నం 2 గంటలకు దాదాపు 2.5 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని ఉంటారని అంచనా వేస్తున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే దాదాపు 5 లక్షల మంది భక్తులకు దర్శనం లభించినట్లు ఆయన తెలిపారు. ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ముందురోజే అయోధ్య పట్టణాన్ని చేరుకున్న వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఆలయ వెలుపల అనేక గంటలపాటు వారంతా వేచి నిలబడ్డారు. ప్రధాన ద్వారం లోపల నుంచి ఆలయం లోపలకు వెళ్లేందుకు భక్తులు అనేక ప్రయాసలు పడవలసి వచ్చింది. మధ్యాహ్నానికి ఆలయ వెలుపల భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడం, కొందరు చేతిలో సూట్‌కేసు, చంకలో చంటిబిడ్డలతో ప్రధాన ద్వారం ఎదుట గుమికూడడంతో ఇసుకేస్తే రాలనంతగా రద్దీ పెరిగిపోయింది. బారికేడ్లను ఛేదించుకుని ఆలయం లోపలకు ప్రవేశించడానికి కొందరు భక్తులు ప్రయత్నించడంతో వారిని అదుపుచేయడానికి భద్రతా సిబ్బంది ప్రయాస పడాల్సి వచ్చింది. తొక్కిసలాటలో ఒక భక్తుడు స్పృహతప్పిపడిపోగా వెంటనే భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని వైద్య చికిత్స కోసం తరలించారు. 8 వేల మందికి పైగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసు సిబ్బంది ఆలయం వద్ద భద్రతా విధులలో ఉన్నారని, అంతా అదుపులోనే ఉందని రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ శిశిర్ తెలిపారు. డిజిపి ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ కార్యదర్శి సంజయ్ ప్రసాద్ ఆలయం లోపలే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆయన చెప్పారు. భారీ రద్దీ కారణంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్లు వస్తున్న వదంతులను అయోధ్య పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఖండించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్య రామాలయాన్ని సందర్శించి భక్తులకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
రామ్ లల్లా పేరు ఇక ‘బాలక్ రామ్’
సోమవారం (22న) అయోధ్యలోని బృహత్ ఆలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన కొత్త రామ్ లల్లా విగ్రహాన్ని ఇక మీదట ‘బాలక్ రామ్’గా పిలవనున్నారు. నిల్చున్న స్థితిలోని ఐదు సంవత్సరాల బాలుని దైవ స్వరూపానికి ఆ పేరు ప్రతీకగా ఉంటుంది. ‘22న ప్రాణ ప్రతిష్ఠ జరిగిన శ్రీరాముని విగ్రహానికి ‘బాలక్ రామ్’గా నామకరణం చేయడమైంది. శ్రీరాముని విగ్రహానికి ‘బాలక్ రామ్’గా పేరు పెట్టడానికి కారణం ఆయన ఒక బాలుని పోలి ఉన్నారు. ఆ బాలుని వయస్సు ఐదు సంవత్సరాలు’ అని ప్రాణ ప్రతిష్ఠ వేడుకతో సంబంధం ఉన్న అర్చకుడు అరుణ్ దీక్షిత్ తెలియజేశారు. ‘నేను మొదటిసారి విగ్రహాన్ని చూసినప్పుడు నేను ఉత్సుకతకు లోనయ్యాను. నా కళ్ల వెంబడి నీళ్లు కారసాగాయి. ఆ సమయంలో నేను పొందిన అనుభూతినివివరించడం నా శక్యం కాదు’ అని ఆయన చెప్పారు. వారణాసికి చెందిన ఆ అర్చకుడు ఇంత వరకు 50, 60 ప్రాణ ప్రతిష్ఠలు నిర్వహించారు. ‘నేను ఇంత వరకు నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠలు అన్నిటిలోకి ఇది అత్యంత అలౌకికం, సర్వోన్నతమైంది’ అని ఆయన తెలిపారు. తాను విగ్రహాన్ని తొలిసారి ఈ నెల 18న చూసినట్లు దీక్షిత్ చెప్పారు.

Josh

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News