Friday, January 24, 2025

మారని ‘మహా’ దృశ్యం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని కూల్చివేసి ఏక్‌నాథ్ షిండే పాలనను ప్రతిష్టించడంలో అప్పటి గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ తప్పు చేశారని తుది తీర్పులో ఖరాఖండిగా తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఆ తప్పును సరిచేయలేదు. అంటే గవర్నర్ దుశ్చర్యకు బలైపోయిన థాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేదు. అలాగే ఫిరాయించిన షిండే వర్గ ఎంఎల్‌ఎల శాసన సభ్యత్వాల రద్దు విషయాన్నీ తేల్చలేదు. తన ప్రభుత్వం ఏర్పాటైన తీరును తీవ్రంగా తప్పుపట్టినందుకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి షిండే వైదొలగడమనేది కలలో మాట. నీతికి కట్టుబడడం వర్తమాన రాజకీయాల్లో ఎంత అరుదైన విషయమో ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. అందుచేత 2022 నాటి మహారాష్ట్ర అధికార మార్పిడి రాజకీయ పరిణామాలపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు యథాతథ స్థితినే కొనసాగనిస్తున్నది.

దాని వల్ల ఎటువంటి మార్పు సంభవించే అవకాశాలు లేవు. అయితే లెజిస్లేచర్ పార్టీ కంటే పార్టీదే పైచేయి అని, కొంత మంది ఎంఎల్‌ఎలు పార్టీ అధినాయకత్వం మీద తిరుగుబాటు చేశామని చెప్పినంత మాత్రాన ముఖ్యమంత్రి బల పరీక్షకు గవర్నర్ ఆదేశించడం తగదని, అలా ఆదేశించడమే ఆ ప్రభుత్వ పతనాన్ని తొందర చేస్తుందని ధర్మాసనం ఎత్తి చూపడం గవర్నర్లకు ఏ మేరకు దారి దీపంగా రుజువు చేసుకుంటుందో భవిష్యత్తులో గాని తేలదు. శాసన సభలో విశ్వాస ఓటింగ్‌కు నిలబడాలని గవర్నర్ కోషియారీ అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఇచ్చిన ఆదేశంపై స్టే ఇవ్వడానికి 2022 జూన్ 29న సుప్రీంకోర్టే నిరాకరించింది. ఆ నేపథ్యంలో తాను ఓడిపోడం ఖాయమని భావించిన థాక్రే విశ్వాస ఓటుకు వెళకుండానే రాజీనామా చేశారు. అది ఒక రకంగా ప్రశంసించదగినదే. అధికారం మీద యావతో చివరి వరకు వేలాడకుండా ఆయన అలా రాజీనామా చేసి ముందుగానే తప్పుకున్నందున ప్రభుత్వాన్ని తిరిగి నెలకొల్పుతూ ఉత్తర్వులు ఇవ్వలేమని ఇప్పుడు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది.

వాస్తవానికి భగత్ సింగ్ కోషియారీ పాత్రను గత మార్చి 15న కేసు విచారణ సమయంలోనే ధర్మాసనం తప్పుపట్టింది. అదే అభిప్రాయాన్ని ఇప్పుడీ తీర్పులో వెల్లడించింది. గవర్నర్ ఆదేశంపై విశ్వాస ఓటు మీ నాయకుడు ఎవరనే దాన్ని తేల్చడం కోసం కాదని, సభలో మెజారిటీ దెబ్బ తిన్నప్పుడు మాత్రమే జరపవలసినది అని గత మార్చి నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం తెలియజేసింది. గవర్నర్ చర్యను తప్పుపట్టడం ద్వారా ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం పుట్టుకే అక్రమమని చెప్పిన తర్వాత ఆ ప్రభుత్వం కొనసాగడం ఎంత మాత్రం రాజ్యాంగబద్ధం కాదు. కాని అనివార్యంగా ఆ ప్రభుత్వం కొనసాగుతూనే వుంది. అయితే సాంకేతికంగా చూసినప్పుడు ఈ కథకు ఇంతటితో తెర పడడం లేదు. ఫిరాయింపు శాసన సభ్యుల సభ్యత్వం రద్దు విషయం ఇంకా అపరిష్కృతంగానే వుంది. ఈ అంశం సుప్రీంకోర్టులో విస్తృత ధర్మాసనం విచారణలో వున్నది. వీరి శాసన సభ్యత్వాలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సహేతుకమైన వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ను ధర్మాసనం తాజా తీర్పులో ఆదేశించింది.

అదే సమయంలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన సునీల్ ప్రభును తప్పించి షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను చీఫ్ విప్‌గా నియమిస్తూ స్పీకర్ నర్వేకర్ తీసుకొన్న నిర్ణయాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. విప్‌ను లెజిస్లేచర్ పార్టీ నియమించాలనడం అసలు పార్టీతో శాసన సభ్యులకున్న బొడ్డు తాడును తెంపి వేయడమే అని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది ఫిరాయింపు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయడమే స్పీకర్‌పై గల బాధ్యత అని నిపుణులు భావిస్తున్నారు. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన స్పీకర్ ఎన్నికలో నర్వేకర్ మెజారిటీ ఓట్లతో ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రి షిండే మనిషని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. సుప్రీంకోర్టు చెప్పిన సహేతుక వ్యవధి అనే దానిని దాని అసలు అర్థంలో తీసుకొని స్పీకర్ నిర్ణయిస్తారా? దేశంలో ఎన్నెన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపు సభ్యుల సభ్యత్వాల రద్దు దరఖాస్తులు స్పీకర్ల వద్ద దుమ్ము పట్టిపోయి లేవు?

వాటిపై నిర్ణయం తక్షణమే తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం చెబితే తప్ప వారు కదిలే అవకాశాలు లేవు. సుప్రీంకోర్టు చెప్పిన సహేతుక వ్యవధి ఎప్పటికీ పూర్తికాక పోవచ్చు. అందుచేత మహారాష్ట్ర వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు భవిష్యత్తులో ఇటువంటి సందర్భాలు ఎదురయ్యేటప్పుడు పాటించవలసిన విధి విధానాలను ప్రభావితం చేస్తుందేమో గాని ప్రస్తుత సందర్భంలో ఎటువంటి మార్పును ఆవిష్కరించబోడం లేదు. అయితే న్యాయమూర్తులు లోతైన రాజ్యాంగ పాండిత్యంతో, పరిణతితో మంచి చెడులను తరచి తరచి ఇచ్చే తీర్పుల వల్ల భవిష్యత్తులోనైనా మంచి తప్పనిసరిగా జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News