Monday, December 23, 2024

రాజ్యాంగ పతనంలో రాజకీయుల పాత్ర

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ ముసాయిదాను సమర్పిస్తూ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ ప్రజలను హెచ్చరించారు. పాలకులు చెడ్డవారైతే మంచి రాజ్యాంగమైనా చెడుగా మారుతుంది. మంచివారైతే రా జ్యాంగం చెడ్డదైనా మంచిగా మారుతుంది. రాజకీయ పక్షాల మీద రాజ్యాంగ వ్యవస్థల పని తీరు ఆధారపడుతుంది. దేశం మతాతీతంగా ఉండాలి. మతం రాజ్యాన్ని అతిక్రమిస్తే స్వాతంత్య్రం దూరమవుతుంది. రాజకీయ పక్షాలపై రాజ్యాంగ వ్యవస్థల పని తీరు ఆధారపడుతుంది. అంబేడ్కర్ పాలకులు యోగ్యులు, సమగ్రతానిబద్ధులు, గుణవంతులయితే లోపయుక్త రాజ్యాంగాన్ని ఉత్తమంగా మార్చగలరు. రాజేంద్ర ప్రసాద్ భవిష్య ప్రజా ప్రతినిధుల చిత్తశుద్ధి, పాలనా విధానాలపై వీరికి ఆ రోజే అనుమానం కలిగింది.
భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోడానికి, పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్య్రం చేకూర్చుటకు, వారి వ్యక్తి గౌరవం, జాతి ఐక్యత, అఖండతలను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టా పూర్వకంగా తీర్మానించి 26 నవంబర్, 1949 న రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. సుప్రీంకోర్టు ఈ పీఠికను రాజ్యాంగ మౌలిక సిద్ధాంతంగా ప్రకటించింది. చట్టాలు, రాజ్యాంగ సవరణలు పీఠికలోని అంశాలకు కట్టుబడి ఉండాలన్నది. రాజ్యాంగ ముసాయిదా, నిర్మాణ సభల్లో మితవాదులు అంబేడ్కర్‌కు అడ్డంకులు కల్పించారు. రాజ్యాంగంలో తమ ఇష్టాలు చేర్చడానికి వత్తిడి చేశారు. ఆయన వాపోయినట్లు రాజ్యాంగం రాజకీయ సమానత నిచ్చింది. సామాజిక, ఆర్థిక సమానతలనివ్వలేదు. రాజ్యాంగం బ్రిటిష్ పాలక వ్యవస్థలు, రాజభక్తి, దేశద్రోహం, నేర విచారణ, శిక్షాస్మృతులను కొనసాగించింది. 1945 ముందరి దోపిడీ ప్రపంచీకరణ, తర్వాతి వాణిజ్య ప్రపంచీకరణ, 1991 తర్వాతి సామ్రాజ్యవాద ప్రపంచీకరణలను అడ్డుకునే నిబంధనలు రాజ్యాంగంలో లేవు. ఆదేశిక సూత్రాల అధికరణ 47 మత్తు పదార్థాలను, 48 గోవధను నిషేధించాలన్నాయి. ప్రభుత్వం 47ను అశ్రద్ధ చేసి, 48తో రాజ్యాంగానికి హైందవ తత్వాన్ని పులుముతోంది.
గత ప్రభుత్వాల రాజ్యాంగ అపసవ్యంలో నేరస్థుల రాజకీయీకరణ, రాజకీయ నేరమయం పెరిగాయి. రాజ్యాంగ పీఠిక అశ్రద్ధ చేయబడింది. సామాజిక దృక్పథం, త్యాగంతో నిండవలసిన రాజకీయాలు లాభసాటి లూటీ వ్యాపారంగా మారాయి. రాజ్యాంగ విలువలు దిగజారాయి. ఇందిర 1975లో రాజ్యాంగ అధికరణ 352 (1)తో ఎమర్జెన్సీ విధించారు. దీనితో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం బలహీనపడ్డాయి. నియంతృత్వ పోకడ మొదలైంది. కాని సంఘ్ అంటరానితనం పోయింది. తన భావజాలాన్ని ప్రచారం చేసింది. జనసంఘ్, సంఘ పరివార్ సంస్థలు బలపడ్డాయి. జనతా ప్రభుత్వంలో అధికారం దక్కింది. ఆ తర్వాత ఇందిరకు, సంఘ్‌కు క్విడ్ ప్రో కొ కుదిరింది. అది ఇందిరకు సహకరించింది. ఆమె సంఘ్ గంగాజల్ యాత్ర ప్రారంభించారు. ప్రభుత్వ కమిటీల్లో, చర్చల్లో జనసంఘ్‌కు ప్రాతినిధ్యం కల్పించారు. రాజీవ్ హిందువులను దువ్వడానికి హిందుత్వ మెతక వైఖరి వహించారు. అయోధ్య ఆలయ తలుపులు తెరిపించారు. అయోధ్య నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించి మందిర్ నిర్మిస్తామన్నారు. షా బానో మనోవర్తి సుప్రీంకోర్టు తీర్పును తిరగతిప్పి ముస్లిం మగాళ్ల కోసం చట్టం చేశారు. హిందుత్వవాద ప్రధాని నరసింహారావు బాబ్రీ మసీదు కూల్చివేతకు మౌనంగా సహకరించారు. అయోధ్య మందిర్ నిర్మాణం, అలౌకిక పాలనకు పునాది వేశారు. వాజపేయి ప్రజల ఆస్తుల అమ్మకాలను చట్టబద్ధం చేశారు. ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా ప్రైవేట్లకు అమ్మారు. విద్యాలయాల్లో అశాస్త్రీయాంశాలను ప్రవేశపెట్టారు. విద్య వ్యవస్థ కాషాయీకరణతో రాజ్యాంగం నిర్దేశించిన శాస్త్రీయ దృక్పథానికి నీళ్ళొదిలారు. దేశాన్నిసాంస్కృతికంగా కలుషితం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరమేధాన్ని సహించి, రాజకీయ మతోన్మాదాన్ని ప్రోత్సహించారు. మత పాలనకు నాంది పలికారు.
ఆర్.ఎస్.ఎస్. (సంఘ్) రాజ్యాంగ మూల సిద్ధాంతాలకే వ్యతిరేకం. రాజ్యాంగం స్థానంలో ‘మనుస్మృతి’ అమలు చేయాలంటుంది. ‘రాజ్యాంగంలో మనదైన అంశమే లేదు. మనుస్మృతి ప్రపంచ సమ్మతి, ప్రశంస, యాదృచ్ఛిక విధేయత, అనుగుణ్యతలను పొందింది. రాజ్యాంగాన్ని శుభ్రపరచాలి. ఏకీకృత ప్రభుత్వం ఏర్పరచాలి. ‘సంఘ్ రెండవ సర్ సంఘ్ చాలక్, ప్రముఖ హిందుత్వ భావ జాలవాది గోల్వాల్కర్ వ్యాఖ్యానం. రాజకీయాలను హైందవీకరించండి, హిందుత్వాన్ని సైనికీకరించండి అన్నారు సావర్కర్. మోడీ సర్కార్ ప్రజా రాజ్యాంగాన్ని పాలక పక్షపాత గ్రంథంగా మార్చింది. సర్వసత్తాక స్థానంలో ఏకసత్తాకం తెచ్చింది. సామ్యవాదం అసమానతలను నిరోధిస్తుంది. లౌకికత్వం రాజ్యాన్ని, మతాన్ని వేరు చేస్తుంది. ప్రజలను సోదరులుగా, మనుషులుగా తీర్చిదిద్దుతుంది. నేటి ప్రభుత్వం ఈ పదాలను రాజ్యాంగం నుంచే తొలగించాలని ప్రయత్నిస్తోంది. సామ్యవాదం మరిచి అసమానతలను పెంచి కార్పొరేట్ల ప్రభుత్వంగా మారింది. ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలకు తిలోదకాలిచ్చింది. హేతు, భౌతిక, మానవ వాదాలను ప్రోత్సహించటం లౌకిక రాజ్య లక్షణం. గత ప్రభుత్వాల్లో లౌకిక భావం నిర్వీర్యమైంది. బిజెపి సర్కార్ హిందూ మత విశ్వాసాన్ని దేశభక్తిగా మార్చింది. లౌకికత్వాన్ని హిందుత్వానికి ముడేసి భారతీయతను హిందుత్వంగా మార్చింది. సంస్థలన్నిటినీ సంఘ్ సంకర తాత్వికులతో నింపి, బలహీనపర్చింది. నియంతృత్వ ధోరణలతో రాజ్యాంగాన్ని ఎగతాళి చేసింది. పౌరసత్వ సవరణ చట్టంలో రాజ్యాంగ సమానత్వ అధికరణలు 14-18లను తిరస్కరించింది. సామాజిక సౌభ్రాతృత్వాన్ని మంటగలిపింది. తన నిరంకుశ స్వేచ్ఛను, కార్పొరేట్ల దోపిడీ స్వేచ్ఛను పెంచింది. ప్రజల స్వేచ్ఛలను హరించింది. తమ దుశ్చర్యలను, తాత్వికతను ప్రశ్నించిన వారిని తప్పుడు కేసులతో అరెస్టు చేయించి, జాతి నిర్మాతల గౌరవాన్ని కించపరిచింది. లౌకికత్వం, అంతర్జాతీయత, బహుళ సంస్కృతులతో పూర్వ కీర్తిప్రతిష్ఠలు నశించాయని ఫాసిజం నమ్మకం. దీనికి మతోన్మాదం తోడ్పడింది. భారతీయ సౌభ్రాతృత్వం, అంతర్జాతీయ మానవత్వం లేకుండా దేశ సమగ్రత, సమైక్యతలకు సంపూర్ణత లేదు. రాజ్యాంగ మనుగడ లేదు.
బిజెపి సర్కార్ లక్షల్లో సంఘ్ కార్యకర్తలను పోలీసులుగా నియమించుకుందని, న్యాయవాదులుగా నమోదు చేసుకుందని మంగళూరు బిజెపి శాసన సభ్యుడు ఐదేళ్ల క్రితమే వెల్లడించారు. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి తూట్లు పొడిచింది. ఇటీవలి కోర్టు తీర్పులన్నీ బిజెపి కోరుకున్నట్లే రావడం యాదృచ్ఛికం కాదని బిజెపి నాయకులన్నారు. మీడియా పాలక పక్ష కార్పొరేట్ల చేతుల్లో చేరింది. విద్యార్థులపై గూండాల దాడులు చేయించింది. దేశద్రోహ కేసులు బనాయించింది. పోలీసులు, న్యాయవాదులు గూండాలలో చేరారు. ప్రజా సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టే చౌర్యోన్మాదస్వామ్యంగా ప్రజాస్వామ్యాన్ని మార్చింది. మతోన్మాదంతో రాజ్యాంగాన్ని ధిక్కరించింది. మతవాదం ఫాసిజానికి దారితీస్తోంది. జైళ్ళలో ఉండాల్సినవారు కుర్చి లెక్కి రాజ్యాంగ బాధ్యత మరిచారు. ఆ బాధ్యతను తలకెత్తుకొన్న సమాజ నిర్మాతలను జైళ్ళలో కుక్కారు. గతంలోలేని రీతిలో, స్థాయిలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది. ఈ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నట్లు అనిపించవచ్చు. కాని సంఘ్ ఆశయమైన రాజ్యాంగశుద్ధి ‘పవిత్ర కార్యం’ నిర్వహిస్తోంది. రాజ్యాంగాన్నే అవమానిస్తూ భారతీయతను, పాలనార్హతను కోల్పోయింది. అంబేడ్కర్ అనుమానాలు నిజాలయాయి. ఆయన చెప్పినట్లు స్వాతంత్య్రం, రాజ్యాంగాల రక్షణ బాధ్యత ప్రజలదే. ప్రత్యామ్నాయ పార్టీలు సైద్ధాంతిక, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక పద్ధతులతో ఎదగాలి. విద్యార్థులు, యువత, పౌరులకు రాజ్యాంగ హక్కులు, బాధ్యతలు, పౌరజ్ఞానం, రాజ్యాంగ వక్రీకరణ నష్టాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్గస్వభావం, సామ్యవాదం, ఫాసిజంలపై అవగాహన కల్పించాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలను సమాజానికి అనుసంధానించి ప్రచారం చేయాలి. బుద్ధి జీవులు రాజ్యాంగ రక్షణలో భాగస్వాములు కావాలి. ఇందిర ఎమర్జెన్సీని ఏటా జూన్ 25న నిరసిస్తాం. నేటి అప్రకటిత అత్యవసర స్థితిని రోజూ నిరసించాలి. కార్మిక వర్గాన్ని పాలక వర్గంగా నిలబెట్టడమే విప్లవానికి తొలిమెట్టని కమ్యూనిస్టు ప్రణాళికలో మార్క్, ఎంగెల్స్ పేర్కొన్నారు. శ్రామికవర్గ ప్రజాస్వామ్యంలో కార్మికులే పాలకులు. రాజ్యాంగం మంచిదైనా కాకున్నా ఆ రాజ్యం ప్రజా రాజ్యమే.

                                                                                   సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 9490204545

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News