Monday, November 25, 2024

రైల్వేలను నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వం: ఖర్గే ఫైర్

- Advertisement -
- Advertisement -

రైల్వే మంత్రి రాజీనామా చేయాలి
ఈ ఏడు ప్రశ్నలకు జవాబు ఇవ్వండి
కేంద్రానికి మల్లికార్జున్ ఖర్గే డిమాండ్

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం భారతీయ రైల్వేలను నాశనం చేస్తోందని కాంగ్రెస్ పారీ మంగళవారం ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లో సోమవారం సంభవించిన కంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ ప్రమాదాన్ని పురస్కరించుకుని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు ఆయనకు లేదని కాంగ్రెస్ విమర్శించింది. మోటారు సైకిల్ వెనుక సీట్లో కూర్చుని అశ్వినీ వైష్ణవ్ ప్రమాద స్థలికి చేరుకోవడం పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆక్షేపణ తెలిపింది. ఆయన రైల్వే మంత్రా లేక రీలు మంత్రా అని ఎద్దేవా చేసింది.

రైలు ప్రమాదం జరిగినప్పుడల్లా రైల్వే మంత్రి వైష్ణవ్ ఘటనా స్థలానికి కెమెరాలను వెంటపెట్టుకుని వచ్చి అంతా బాగానే ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం విమర్శించారు. నిన్న జరిగిన రైలు ప్రమాద ఘటనకు ఎవరిని బాధ్యులను చేయాలి.. రైల్వే మంత్రినా లేక మిమల్నా అని ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ప్రశ్నించారు. ఈ ఏడు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలాసోర్ లాంటి ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత కూడా రైళ్లు ఢీకొట్టకుండా నివారించే వ్యవస్థ కవచ్‌ను ఒక్క కిలోమీటరు కూడా ఎందుకు పొడిగించలేదని ఖర్గే ప్రశ్నించారు. రైల్వేలలో దాదాపు 3 లక్షల ఉద్యోగాల ఖాళీలను గత పదేళ్లుగా ఎందుకు భర్తీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్‌ఆర్‌ఆర్‌బి నివేదిక ప్రకారం 2017 నుంచి 2021 వరకు రైలు ప్రమాదాలలో దాదాపు ఒక లక్ష మంది మరణించారని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ఖర్గే ప్రశ్నించారు.

సిబ్బంది కొరత కారణంగా లోకో పైలట్లు ఎక్కువ గంటలు పనిచేయవలసి వస్తోందని, ప్రమాదాలు పెరగడానికి ఇదే ప్రధాన కారణమని రైల్వే బోర్డు కూడా అంగీకరించిందని, అయినప్పటికీ ఎందుకు ఖాళీలను భర్తీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సిఆర్‌ఎస్) సిఫార్సుల పట్ల రైల్వే బోర్డు నిర్లక్ష వైఖరిని ప్రదర్శిస్తోందని పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 323వ నివేదికలో విమర్శించిందని, రైలు ప్రమాదాలలో కేవలం 8 నుంచి 10 శాతం ఘటనలను మాత్రమే సిఆర్‌ఎస్ దర్యాప్తు చేస్తోందని, అయినప్పటికీ సిఆర్‌ఎస్‌ను ఎందుకు బలోపేతం చేయలేదని ఖర్గే ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రీయ రైలు సురక్ష కోశ్‌కు ప్రతి ఏటా రూ.20,000 కోట్లు అందుబాటులో ఉంచాల్సి ఉన్నప్పటికీ 75 శాతం నిధుల కేటాయింపు తగ్గించినట్లు కాగ్ వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను ఎందుకు అనవసర ఖర్చులకు, విలాసాలకు రైల్వే అధికారులు ఖర్చు చేస్తున్నారని ఖర్గే ప్రశ్నించారు.

సాధారణ స్లీపర్ క్యాసులో ప్రమాణం ఎందుకు ఖరీదుగా మారిందని, స్లీపర్ బోగీల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందని ఆయన ప్రశ్నించారు. రైలు బోగీల్లోకి చొరబడే ప్రయాణికులపై పోలీసులు బలప్రయోగం చేయాలని రైల్వే మంత్రి ఇటీవల చెప్పారని, సీట్ల సంఖ్య కొరత కారణంగా గత ఏడాది 2.7 కోట్ల మంది తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారన్న విషయం మంత్రికి తెలియదా అని ఖర్గే ప్రశ్నించారు. జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి 2017-18 వార్షిక బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్‌ను మోడీ ప్రభుత్వం విలీనం చేసిందని ఆయన ఆరోపించారు. సొంత డబ్బా కొట్టుకోవడం వల్ల భారతీయ రైల్వేలపై మోడీ ప్రభుత్వం సాగిస్తున్న నేరపూరిత నిర్లక్షం చెరిగిపోదని, పైస్థాయిలో జవాబుదారీతనాన్ని నిర్దేశించాలని ఎక్స్ వేదికగా ఖర్గే డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News