Monday, December 23, 2024

విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాలపై అవగాహన

- Advertisement -
- Advertisement -

కల్పించేలా డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు
మారుతున్న కాలానికి అనుగుణంగా
ఉన్నత విద్యలో సమూల మార్పులు
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా
మన విద్యార్థులు పోటీ పడేలా సంస్కరణలు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సు ప్రారంభించిన మంత్రి

మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధికి, సమాజానికి అవసరయ్యే కొత్త కోర్సులను భవిష్యత్తులో మరిన్ని ప్రవేశ పెడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యలో డిమాండ్‌కు అనుగుణంగా కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు. విద్యార్థి దశ నుంచే సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును అమలులోకి తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఉన్నత విద్యలో మూల్యాంకన పద్దతులపై సిఫార్సులతో ఐఎస్‌బి రూపొందించిన నివేదికను మంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, అడిషనల్ డిజిపి సంజయ్‌కుమార్ జైన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వి.వెంకటరమణ, మహమూద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మన విద్యార్థులు పోటీ పడేలా సంస్కరణలు తీసుకువస్తున్నామని చెప్పారు. గతేడాది సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫేక్ సర్టిఫికెట్లను గుర్తించేలా స్టూడెంట్ వెరిఫికేషన్ విధానం అందుబాటులో తెచ్చామని, అలాగే విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు సైబర్ సెక్యూరిటీ కోర్సుకు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. సమాజంలో చాలామంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన అవసరమని అన్నారు. బోధన మూస పద్ధతిలో కాకుండా.. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునికంగా ఉండాలన్నారు. మూల్యాంకనంపై ఐఎస్‌బి ఇచ్చిన సిఫార్సులను అధ్యయనం చేసి అమలు చేయాలని ఉన్నత విద్యామండలికి సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

డిగ్రీలో నాలుగో సెమిస్టర్‌లో సైబర్ సెక్యూరిటీ కోర్సు : చైర్మన్ లింబాద్రి
సైబర్ నేరాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి ఎదుర్కొనేలా సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. బిఎ, బి.కాం, బిఎస్‌సి వంటి సంప్రదాయ డిగ్రీలో రెండో ఏడాది నాలుగో సెమిస్టర్ సైబర్ సెక్యూరిటీని నాలుగు క్రెడిట్లతో ఈ ఏడాది నుంచే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. సంప్రదాయ డిగ్రీ కోర్సులు చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ కోర్సు చదవాల్సి ఉంటుందని చెప్పారు. అడిషనల్ డిజిపి సంజయ్‌కుమార్ జైన్ మాట్లాడుతూ, ప్రస్తుతం సంప్రదాయ నేరాల స్థానంలో సైబర్ నేరాలు పెరిగాయని అన్నారు. తెలియని నెంబర్ల నుంచి లింకుపై క్లిక్ చేయాలని మెసేజ్‌లు వస్తుంటాయని, కొంతమంది ఆ లింకులపై క్లిక్ చేసి సైబర్ నేరాల బారిన పడుతున్నారని అన్నారు. ఇటీవల తనకు కూడా తెలియని నెంబర్ నుంచి వ్యక్తిగత వివరాలు అడుగుతూ ఫోన్లు వచ్చాయని, తను వారితో వివరాలు అడిగే సరికి మళ్లీ ఫోన్ రాలేదని చెప్పారు. ఎక్కువ శాతం మంది ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతున్నారని, వీటిపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని పేర్కొన్నారు.

ఈ కోర్సులో ప్రాజెక్టు కూడా ఉంటుంది : ప్రొఫెసర్ శాంతి, నల్సార్ లా యూనివర్సిటీ
సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో అందుబాటులోకి తీసుకువచ్చిన సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంటుందని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ శాంతి తెలిపారు. విద్యార్థులకు అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా ప్రాజెక్టు చేసేలా కోర్సును రూపొందించామన్నారు. వర్చువల్ ల్యాబ్‌లో లేదా సమీపంలోని బ్యాంకు, మీ సేవా కేంద్రాలలో విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ చేసేలా వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఈ కోర్సుకు సంబంధించిన డెమో వీడియోలు రూపొందించడంతో పాటు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కోర్సు మెటీరియల్‌ను రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ డి.రవీందర్ యాదవ్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ విసి గోపాల్‌రెడ్డి, ఇతర అధికారులు ఐఎస్‌బి ప్రతినిధులు పాల్గొన్నారు.

Cyber Security 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News