బెంగళూరు: సిద్ధరామయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కర్నాటక కాంగ్రెస్ చీఫ్ డికె. శివకుమార్ ఆదివారం తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు కూడా. ‘కొంతమంది నాకు, సిద్ధరామయ్యకు మధ్య విభేదాలున్నాయని అంటున్నారు. కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. అనేక సందర్భాల్లో నేను పార్టీ కోసం అనేక త్యాగాలు చేశాను. సిద్ధరామయ్యకు అండగా నిలబడ్డాను’ అని శివకుమార్ తెలిపారు.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో గెలిచాక ముఖ్యమంత్రి ఎవరనే దానిపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి. ఇటు సిద్ధరామయ్య వర్గీయులు, అటు శివకుమార్ వర్గీయులు పోస్టర్ల యుద్ధం మొదలెట్టారు. కాగా ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం జరుగనున్నది.
కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సిఎల్పీ) నేత ఎన్నికను పర్యవేక్షించేందుకు సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలను కాంగ్రెస్ పరిశీలకులుగా నియమించింది. కర్నాటకలో కాంగ్రెస్ 1999 తర్వాత ఈసారి ఎన్నికల్లోనే మళ్లీ ఉత్తమ పనితీరు కనబరిచింది. బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించింది. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఊతం ఇవ్వగలదు.