పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్న పుణ్యాత్ములు కాంగ్రెస్ నేతలే అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. ఎండిపోయిన గడ్డకు నాలుగు నీళ్ల చుక్కలు తెచ్చుకుందామంటే కాంగ్రెస్ నాయకులు సు ప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చి ఆపుతున్నారని తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కెసిఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగించారు.తెలంగాణ కొద్దిగా పచ్చబడింది అని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. 8 ఏండ్ల నుంచి పట్టుబట్టి జట్టుకట్టి బీడు వారిపోయినా తెలంగాణను ఒక తొవ్వకు తెచ్చుకుంటున్నామని అన్నారు. వడ్లు పండించడంలో 2014లో మనం 15,16వ స్థానంలో ఉన్నామని, ఇవాళ దేశంలో అతి ఎక్కు వ వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇ లా అనేక రంగాల్లో నెంబర్‌వన్‌లో ఉన్నామని చెప్పారు.
ధనం ఎంత ఉన్నా పిల్లలకు బతికే అవకాశం ఉండాలని తెలిపారు. భూమి, నీళ్లు, అడవులు ఉన్నాయని, విస్తృతంగా చెట్లు పెంచితే అపారమైన ఆక్సిజన్ లభిస్తుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అద్భుతమైన అవకాశం ఉన్న దేశంలో అడవులను నాశనం చేశారని చెప్పారు. హరితహారం అని చెబితే చాలా మందికి అర్థం కాలేదని, హాస్యాస్పదం చేశారని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు శాసనసభలో జోకులు వేశారని మండిపడ్డారు. తు మ్మలూరులో మూడు, నాలుగేండ్ల కింద పెట్టిన చెట్లు పెద్ద గా అయ్యాయని, ఈ విధంగా అన్ని ప్రాంతాల్లో పెట్టిన చె ట్లతో తెలంగాణలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచులను సిఎం అభినందించారు. తాను చట్టం తెచ్చినప్పుడు వాళ్లకు కోపం వచ్చిందని, ఆ చట్టం వల్ల ఇవాళ గ్రామాలు పచ్చగా మా రాయని తెలిపారు. తెలంగాణలో దారులు అందంగా త యారయ్యాయని చెప్పారు.
పాలమూరు ప్రాజెక్టు 85 శాతం పూర్తి..
ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో నీళ్ల కోసం పంచాయతీ ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల కూడా కాళేశ్వరంతో పాటే పూర్తయ్యేదని, కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. దయ వల్ల పాలమూరు ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందని చెప్పారు. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తాండూరు, పరిగి, వికారాబాద్ చేవెళ్ల నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తనదే అని సిఎం హామీ ఇచ్చారు. 100 శాతం ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తానని సిఎం స్పష్టం చేశారు. కృష్ణా నదిలో నీళ్ల కోసం పంచాయతీ ఉందని కెసిఆర్ అన్నారు. గోదావరిలో నీళ్ల పంచాయతీ లేదని, గండిపేట, హిమాయత్ సాగర్ వరకు గోదావరి లింక్ అయిపోతుందని చెప్పారు. అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ పెట్టినా కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు.ఏదో ఒక పద్ధతిలో ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చి ఇస్తానని, చింత చేయాల్సిన అవసరం లేదని సిఎం కెసిఆర్ ఉద్ఘాటించారు.
వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె
తెలంగాణ ఏర్పడిన కొత్తలో భయంకరమైన పరిస్థితి ఉండే అని సిఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీళ్లు లేక ఇబ్బంది పడ్డామని, తద్వారా చెట్లను పెంచాలని నిర్ణయించామని తెలిపారు. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె అని తానే పాట రాశానని చెప్పారు. పచ్చదనం ఉంటేనే వర్షాలు వస్తాయని, చెట్లు నాటడం ఏందని చాలా మంది నవ్వారని అన్నారు. కెసిఆర్ ప్రారంభించిన కార్యక్రమంతో తెలంగాణలో పచ్చదనం పెరిగిందని చెప్పారు. నాశమైన అడవులను పునరుద్ధరించాలని నిర్ణయించామని తెలిపారు. అడవులను పెంపొందించేందుకు హరిత సైనికుల్లాగా ప్రియాంక వర్గీస్, భూపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. రిజర్వ్ ఫారెస్టును బ్రహ్మాండంగా పెంచుకున్నామని, గ్రామాల్లో నర్సరీలను పెంచుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని వదిలిపెట్టొద్దని సిఎం సర్పంచ్‌లను కోరారు.
బతకడానికి వీలైన పర్యావరణ పరిస్థితులు కల్పించాలని తెలిపారు. హరితహారంలో అనేక అద్భుతాలు జరిగాయన్నాయని కెసిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో.. ప్రతి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకున్నామని, అర్బన్ పార్కులు కూడా రూపుదిద్దుకున్నాయని వివరించారు. ఈ విజయం మనందరి విజయమని సిఎం అన్నారు. ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను పంచేందుకు రూ. వంద కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పంచాలని నిర్ణయించామని కెసిఆర్ వెల్లడించారు.
మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటే లేదు తెలంగాణలో మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొనిపోవాలని ఆకాంక్షించారు.తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామని సిఎం పిలుపునిచ్చారు. అన్ని పనులు జరుగుతాయని తెలిపారు.మహేశ్వరం నియోజకవర్గానికి సిఎం వరాలు మహేశ్వరం నియోజకవర్గంపై సిఎం కెసిఆర్ వరాల జల్లు కురిపించారు. మెట్రో రైలునుమహేశ్వరం వరకు విస్తరించేందుకు కృషి చేయనున్నట్లు సిఎం హామీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అభ్యర్థనపై స్పందించిన కెసిఆర్.. శంషాబాద్ విమానాశ్రయం వరకు విస్తరిస్తున్న మెట్రోను మహేశ్వరం వరకు తీసుకురావచ్చని అన్నారు.
అటు ఎల్‌బినగర్ -మియాపూర్ కారిడార్ వరకు ఉన్న మైట్రోరైలును బిహెచ్‌ఇఎల్ వరకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు సిఎం తెలిపారు. అలాగే మహేశ్వరానికి వైద్య కళాశాల, సబ్ స్టేషన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తుమ్మలూరులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిఎం కెసిఆర్ కోటి రూపాయలు మంజూరు చేశారు. జల్పల్లి, తుక్కుగూడకు 25 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తున్నట్టు తెలిపారు. బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లకు రూ.50 కోట్ల చొప్పున, 65 గ్రామ పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. సిఎం ప్రకటనతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
20 వరకు ఫారెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం..
ఫారెస్టు డిపార్ట్‌మెంట్ అధికారులు, సిబ్బంది చాలా కష్టపడి మన కోసం అడవులను పెంచుతున్నారని సిఎం కెసిఆర్ తెలిపారు. కానీ దుర్మార్గులు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపేశారని, ఆ ఫారెస్టు అధికారి భార్యకు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం కల్పించి, నియామక పత్రాన్ని అందజేశామని చెప్పారు. కొంత డబ్బులు కూడా సాయం చేశామని వెల్లడించారు. మనిషిని అయితే తేలేం.. కానీ వారికి ఉద్యోగం కూడా ఇచ్చామని అన్నారు. అటవీ శాఖ ఉద్యోగులపై దాడులు జరగకుండా ఉండేందుకు పోలీసు స్టేషన్ల మాదిరిగా ఫారెస్టు స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారు. 20 వరకు స్టేషన్లు అవసరం అవుతాయని, వాటిని వెంటనే మంజూరు చేద్దామని తెలిపారు. అటవీ శాఖను పటిష్టం చేద్దామని అన్నారు. తెలంగాణలో భారీగా ఫల వృక్షాలు పెంచాలని కెసిఆర్ సూచించారు. హరితహారంలో అనేక అద్భుతాలు జరిగాయన్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారు.
అందరినీ ఆదుకుంటున్నాం..
రాష్ట్రంలో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సిఎం స్పష్టం చేశారు. దివ్యాంగులను మానవత్వంతో ఆదుకుంటున్నామని, వారికి పెన్షన్లు పెంచామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పథకాలు పెట్టుకున్నామని అన్నారు. కులానికో, మతానికో, జాతికో సంబంధించి పథకాలను అమలు చేయడం లేదని, ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు. తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయంలో, ధాన్యపు రాశులు పండించడంలో అలా అన్నింటిలో నెంబర్‌వన్‌గా ఉన్నామని సిఎం కెసిఆర్ తెలిపారు.