Thursday, November 21, 2024

ఇంకొద్ది గంటల్లోనే చంద్ర విజయం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : చంద్రుడిపైకి చంద్రయాన్ 3 చేరుకునే ప్రక్రియలో కీలక ఘట్టాన్ని ఆదివారం ఇస్రో విజయవంతంగా నిర్వర్తించింది. కక్షలో విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ ఎత్తును నిర్ణీతంగా శాస్త్రీయ అంచనాల మేరకు తగ్గించారు. దీనితో ఇక చంద్రుడిపై మన అంతరిక్ష నౌక సజావుగా దిగేందుకు సరైన తేదీ, సమయం ఖరారయింది. 23వ తేదీ బుధవారం …భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ చంద్రుడిని చేరడం చంద్రయాన్ 3లో అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుంది. విక్రమ్ సరిగ్గా పనిచేస్తున్నట్లు, కక్ష ఎత్తును తగ్గించినట్లు ఇస్రో భూ కేంద్రం ఆదివారం ప్రకటించింది. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌కు సంబంధించి దీనిలో పలు రకాల అంతర్గత తనిఖీల నిర్వహణ జరుగుతుంది. ఆద్యంతం జాగ్రత్తలు తీసుకుంటారు. ఆదివారం రష్యాకు చెందిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ పతనం చెందింది. ఇప్పుడు ప్రపంచం అంతా చంద్రయాన్ 3 చంద్రుడిపై వాలే దశపైనే ఆసక్తి ఏర్పడింది. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్‌ఎం)లో విక్రమ్, రోవర్ ప్రగ్యాన్‌లు ఉన్నాయి. బుధవారం ఈ మాడ్యూల్ చంద్రుడిపై వాలాల్సి ఉంది. ఈ సాఫ్ట్‌ల్యాండింగ్‌ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.

బుధవారం సాయంత్రం 5.27 గంటల నుంచి ఈ రిలే ఉంటుందని ఇస్రో అధికారికంగా తెలిపింది. ఇంతకు ముందు అనుకున్న దాని ప్రకారం ల్యాండింగ్ బుధవారం సాయంత్రం 5.47 గంటలకు జరగాలి. అయితే అన్ని అంశాల పరిగణన తరువాత ఇది 17 నిమిషాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆదివారం అత్యంత కీలకమైన రెండోది, చివరిది అయిన డిబూస్టింగ్ అంటే ఎత్తు తగ్గింపు ప్రక్రియను చేపట్టారు. ఇది ఎటువంటి తడబాట్లు లేకుండా సజావుగా జరిగింది. ఎల్‌ఎం కక్షను 25 కిమీ/134 కిమీగా కుదించారు. ఇప్పుడు అంచనాల మేరకు బుధవారం సాయంత్రం 5.45 నుంచి 6.04 గంటల మధ్యలో ఎప్పుడైనా సాఫ్ట్‌ల్యాండింగ్‌కు వీలేర్పడింది. బహుళ ప్రసార మాధ్యమాల ద్వారా సాఫ్ట్‌ల్యాండింగ్ రిలే జరుగుతుంది. ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానల్, ఇస్రో ఫేస్‌బుక్ పేజ్, డిడి నేషనల్ టీవీ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాట్లు చేపట్టారు. చంద్రుడిపై చంద్రయాన్ 3 వాలే ఘట్టం అపూర్వం కానుంది. ఇది ఓ పరిపూర్ణ గౌరవం, మన సంఘటిత శక్తిని చాటుకునే సమయం అవుతుంది. దేశ శాస్త్ర సాంకేతికతల శక్తిని ఈ విశ్వానికి చాటుకునే అపూర్వ అధ్యాయం ఇది.

శాస్త్రీయ పరిశోధనలు, అత్యంత కీలకమైన సృజనాత్మకతలకు ఇది ప్రతీక అవుతుంది. మన భారతీయ ఔన్నత్యం విశ్వ పరిధికి వెళ్లుతుందని ఇస్రో ఓ ప్రకటన వెలువరించింది. ఈ చంద్రయాన్ 3 సాఫ్ట్‌ల్యాండింగ్ ఘట్టం గురించి దేశంలోని అన్ని విద్యాసంస్థలు, స్కూళ్లు విరివిగా ప్రచారం చేయాలని , విద్యార్థులకు దీని గురించి తెలియచేయాలని, ఆవిష్కృతం అయ్యే విజయం గురించి సంబంధిత ఫ్యాకుల్టీ పరిచయం చేయాలని ఇస్రో పిలుపు నిచ్చింది. విద్యాసంస్థల క్యాంపస్‌లలో ప్రత్యక్షప్రసారం ఏర్పాట్లు జరగాలని సూచించారు. చంద్రయాన్ 3 చంద్రుడిపై వాలేందుకు రెండు రోజుల ముందే అంటే ఈ నెల 21న రష్యా లూనా 25 మూన్‌పై చేరుకుంటుందని ముందుగా అంచనాలు వెలువరించారు. అయితే తుదిక్షణాలలో లూనా విఫలం అయింది. ఇప్పుడు చంద్రుడిపై ఈ నౌక సజావుగా దిగితే భారతీయ మువ్వన్నెల జెండా ఎగిరే ఘట్టం ఖాయం అవుతుంది.

చంద్రుడి పగటి కాలం కీలకం
ఈ నెల 23 చంద్రుడికి పగటి సమయం ఆరంభమయ్యే రోజు. దీనిని దృష్టిలో పెట్టుకునే చంద్రయాన్ 3 చంద్రుడిపై వాలేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. భూమిపై దాదాపు 14 రోజులతో ఒక్క చంద్రుడి రోజు సమానం అవుతుంది. ఈ పగటి దశలో నిరంతరంగా సూర్యకాంతి అందుబాటులో ఉంటుంది. చంద్రయాన్ 3లోని పరికరాలు సూర్యకాంతితో పనిచేస్తాయి. ఇవి ఒక్క రోజు చంద్రకాంతి పరిధిలోనే ఉన్నాయి. ఇవి పనిచేసేందుకు సూర్యకాంతి అవసరం. దీనిని పరిగణనలోకి తీసుకునే చంద్రయాన్ 3 నౌక ఆగస్టు 23న ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు జరిగాయని వెల్లడైంది. చంద్రుడు రాత్రివేళలో పూర్తిగా శీతలంగా ఉంటాడు. ఇది దాదాపుగా మైనస్ 100 డిగ్రీ సెల్సియస్‌కు దిగువదాకా ఉంటుంది. ఈ రాత్రి వాతావరణంలో తట్టుకుని నిలిచే విధంగా ఎలక్ట్రానిక్‌వ్యవస్థను రూపొందించలేదు. అత్యంత శీతల స్థితిలో ఇవి పనిచేయకుండా పోతాయి. కేవలం తమ ముందు ఉండే పగటి కాలం పనిచేసేందుకు అనువుగా ఉంటుంది. లూనార్ డే ఆరంభం నుంచి ముగింపు దశ వరకూ చంద్రుడిపై ప్రయోగాలకు అనువైన వాతావరణం ఉంటుంది.

అనుకున్న విధంగా ఈ నెల 23నే చంద్రుడిపైకి చంద్రయాన్ నౌక దిగాలి లేకపోతే మరో రోజు ఆగాలి. అప్పటికీ సాఫ్ట్‌ల్యాండింగ్ సాధ్యం కాకపోతే ఇక ల్యాండింగ్‌కు దాదాపు 29 రోజులు ఆగాల్సిందే. చంద్రుడి రాత్రివేళ వెళ్లిపోయి, పగటి వేళ వచ్చే వరకూ ఆగి ల్యాండింగ్ కావల్సిందే. లూనాకు సంబంధించి ఇటువంటి నియంత్రణలు లేవు. ఇది కూడా సౌరశక్తితో పనిచేసేదే. అయితే దీనికి అత్యంత వేడిని కల్గించే శక్తివంతమైన జనరేటర్ ఉంది. రాత్రివేళలో కూడా పరికరాలు పనిచేసేందుకు అవసరం అయిన అందుతుంది. పైగా దీని జీవితకాలం ఏడాది వరకూ ఉంది. సూర్యుడి కాంతి చంద్రుడిపై ఎంతసేపు పడుతుందనే అంశంతో నిమిత్తం లేకుండా దీని ల్యాండింగ్ ప్రక్రియ ఉంటుంది. చంద్రయాన్ 3 దక్షిణ ధృవానికి సమీపంలోనే వాలుతుంది. అయితే నిజానికి ఇది పూర్తిగా దక్షిణ ధృవం కాదు. ఇది వాలే ప్రాంతం చంద్రుడి దక్షణ రేఖాంశంపై దాదాపు 68 డిగ్రీలు ఏటవాలుగా ఉంటుంది. లూనా 25 దక్షణ ప్రాంతంలో దాదాపు 70 డిగ్రీల సమీపంలో ఉండాలి .

ఈ క్రమంలో ఈ రెండూ ప్రయోగాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కానీ లూనా ఫెయిలయ్యింది. ఇంతవరకూ చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమనౌకలు ఎక్కువగా చంద్రుడి మధ్య ప్రాంతాన్ని ఎంచుకున్నాయి. అక్కడ సూర్యకాంతి ఎక్కువగా సోకుతుంది. ఇక లూనాకు చంద్రయాన్ 3 నౌకకు చబద్రుడి ఉపరితలంపై ఉండే దూరం కొన్ని వందల కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. చంద్రుడి దక్షిణ ప్రాంతంలో అపారమైన ఘనీభవ జలరాశులు ఉన్నాయని, ఇవి పలు విలువైన ఖనిజాల నిక్షిప్తం అని శాస్త్రీయ ఆధారాలతో తేలడంతో ఇకపై ఈ ప్రాంతం అంతా పోటాపోటీగా పలు దేశాల నుంచి అంతరిక్ష నౌకల ఆగమనానికి దారితీయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News