ఇన్నర్ రింగు రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేసు దర్యాప్తులో ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది. ఈ కేసులో సహ నిందితులకు వర్తించే ఉత్తర్వులు చంద్రబాబుకూ వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. ఈ కేసు 2022లో దాఖలైనందువల్ల 17ఏ నిబంధన వర్తిస్తుందా? అని సర్వోన్నత న్యాయస్థానానికి చెందిన ధర్మాసనం ప్రశ్నించింది. అయితే ఈ కేసుపై పలు ఐపీసి సెక్షన్లు కూడా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు.
ఇన్నర్ రింగు రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు ఈనెల 10న ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీన్ని రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీంపాకరదత్తాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.