Thursday, January 23, 2025

ఇమ్రాన్‌ను దింపడంలో ‘విదేశీ హస్తం’!

- Advertisement -
- Advertisement -

గత 75 ఏళ్లుగా భారత దేశం రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. ఎన్నో రకాల రాజకీయ మార్పులను చూసింది. ఎందరో నిరంకుశ విధానాల ద్వారా తమ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే ప్రయత్నాలు చేశారు. అయితే ‘అధికార మార్పిడి’ ఒక పార్టీ నుండి మరో పార్టీకి, ఒక కూటమి నుండి మరో కూటమికి ప్రశాంతంగా జరుగుతూ వస్తున్నది. కానీ పొరుగున ఉన్న పాకిస్థాన్ లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పూర్తి కాలం – ఐదేళ్ల పాటు అధికారంలో లేకపోవడం గమనార్హం. అయితే ప్రతి ప్రభుత్వం కూడా సైనిక తిరుగుబాటు కారణంగానో, ‘అవినీతి’ ఆరోపణలపై ఉన్నత న్యాయస్థానం తీర్పుల కారణంగానో మధ్యంతరంగా కూలిపోతూ ఉంటె, మొదటిసారిగా జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడం గమనిస్తే అక్కడ ప్రజాస్వామ్యం నిలదొక్కుకున్నదని సంతోషించాలా? లేదా గద్దె కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ చేసిన తీవ్రమైన ఆరోపణలను చూసి ఆందోళన చెందాలా?
తనను గద్దె దించడంలో ఒక ‘విదేశీ హస్తం’ ఉన్నదని ఆరోపించారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఆయన ఆరోపణ అధికారం కోల్పోతున్న అక్కసుతో చేసినది కాదని అర్ధం చేసుకోవాలి. ఆయన సొంత పార్టీ ఎంపిలే తిరుగుబాటు చేసినా కేవలం 2 ఓట్ల తేడాతో జాతీయ అసెంబ్లీలో మెజారిటీ కోల్పోవడం గమనార్హం. ఇప్పటి వరకు గద్దె దిగిన నేతలు ఎవ్వరూ ప్రజల మధ్యకు వెళ్లి భారీ బహిరంగ సభలలో ప్రసంగించలేదు. ఆయన చేస్తున్నారంటే ఆయన ఇంకా ఆ పాకిస్థాన్‌లో ప్రజాదరణ పొందుతున్నట్లు గమనించాలి. పాకిస్థాన్‌లో విదేశీ, రక్షణ వ్యవహారాలపై సైన్యం పూర్తి ఆధిపత్యం వహిస్తూ వస్తున్నది. పాలకులు ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నాలు చేస్తే, వారి తోక కత్తిరించడం పరిపాటిగా మారింది. వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్ సైన్యం అండతోనే ప్రధాని కాగలిగారు. గత ఎన్నికలలో సైన్యం సహకారంతోనే ఎన్నికలలో భారీ ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడి ప్రధాని కాగలిగారు. ఆయనకన్నా సైన్యానికి ‘సలాం’ కొట్టే రీతిలో వ్యవహరించే ప్రధాని దొరకక పోవచ్చు.
అయితే ఒక క్రికెటర్‌గా తనకు గల ప్రజాదరణ, ప్రధానిగా కూడా ఉన్నదనే అభిప్రాయంతో కొన్ని విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడంతో సైన్యం కన్నెర్ర చేసింది. పాకిస్థాన్ ప్రపంచంలోనే పేరొందిన ఉగ్రవాద స్థావరంగా పేరొందినా, ఉగ్రవాదంపై పోరాటం పేరుతో ఎంతో హడావుడి చేస్తున్న అమెరికా ఆ దేశానికి అండగా ఉంటూ వస్తున్నది. సైన్యాధిపతులు సహితం అమెరికా కనుసన్నలలో ఉంటూ వస్తున్నారు. వారిలో చాలా మందికి విదేశాలలో గల అక్రమ ఆస్తులకు అమెరికా భరోసా కావచ్చు. అయితే అమెరికా చైనా మధ్య ఆధిపత్య పోరు పెద్ద ఎత్తున జరుగుతున్న సమయంలో చైనాకు సాన్నిహిత్యంగా జరిగే ప్రయత్నం ఇమ్రాన్ ఖాన్ చేయడం, చైనా మధ్యవర్తిగా రష్యాతో సంబంధాలు ఏర్పరుచుకొనే ప్రయత్నాలు చేయడం అమెరికాకు కన్నెర్ర అయింది. 20 ఏళ్లలో రష్యా పర్యటించిన తొలి పాకిస్థాన్ ప్రధాని కావడం గమనార్హం. పర్యటనకు ముందే అమెరికా హెచ్చరించింది. అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా రష్యా పర్యటించడంతో తొందరలోనే తన పదవి పోగొట్టుకువలసి వచ్చింది.
తాజాగా అధికారంలోకి వచ్చిన షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొన్న తొలి ప్రధాన విధాన నిర్ణయం చైనా- పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సిపిఇసి) అధారిటీని రద్దు చేయడం గమనార్హం. అంటే తాను చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే అధికారం పోగొట్టుకోవలసి వచ్చినదనే ఇమ్రాన్ ఖాన్ ఆరోపణ ఏ మేరకు వాస్తవమో అర్ధం చేసుకోవచ్చు. మరో వంక, భారత దేశ విదేశాంగ విధానంపై కూడా అమెరికా ప్రభావం విశేషంగా ఉంటున్నదనే విమర్శలు ఉన్నాయి.
మన వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం విషయంలో నిక్కచ్చిగా వ్యవహరింపలేక, వారి నుండి చమురు, ఇతర సహాయంపొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మొత్తం మీద అమెరికా ప్రభావంలో ఉన్న కారణంగానే చైనాతో సంబంధాలు క్షీణిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కేవలం చైనా లక్ష్యంగా అమెరికా ఏర్పరచిన ‘సైనిక కూటమి’ క్వాడ్‌లో భారత్ చేరడం మన సరిహద్దుల్లో ఆజ్యం పోస్తున్నది. ఇమ్రాన్ ఖాన్ ఆరోపించినట్లు ‘విదేశీ హస్తం’ ఆయనకు గద్దె దింపి, షెహబాజ్ షరీఫ్ ప్రధానిగా పదవి చేపట్టగానే అభినందించిన రెండవ విదేశీ నాయకుడు (టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తర్వాత) భారత ప్రధాని నరేంద్ర మోడీ కావడం గమనార్హం.
పాకిస్థాన్‌తో తీవ్రవాద రహిత సత్సంబంధాలను కోరుకొంటున్నట్లు ఈ సందర్భంగా మోడీ తెలిపారు. అందుకు ప్రతిస్పందిస్తూ ఈ ప్రాంతంలో శాంతి కోసం కశ్మీర్ సమస్యకు పరిష్కారం అవసరమని షరీఫ్ పేర్కొన్నారు. భారత దేశంతో శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావేద్ బజ్వా కొద్దీ కాలంగా చేస్తున్న ప్రయత్నాలకు మోడీ, -షెహబాజ్ పరస్పర సందేశాలు తోడవుతున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కూడా భారత్‌తో సత్సంబంధాలు కోరుకున్నా భారత్, అమెరికాల పట్ల అనుసరించే విధానాల విషయంలోనే సైన్యం ఆగ్రహానికి గురయినట్లు తెలుస్తున్నది. పాకిస్థాన్ సైన్యం తన వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ప్రస్తుతం భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నది. ఈ విషయంలో కూడా అమెరికా సూత్రధారిగా వ్యవహరిస్తున్నది. మోడీ ప్రధాని అయిన కొత్తలో ఆకస్మికంగా పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్ పుట్టిన రోజు పండుగకు హాజరు కావడం అమెరికా ప్రోద్బలంతోనే కావడం తెలిసిందే.
2019లో మధ్యవర్తుల ద్వారా పాకిస్థాన్ పర్యటన జరిపేందుకు ప్రధాని మోడీ హామీ ఇచ్చారని సీనియర్ పాకిస్థాన్ జనరల్స్ ఈ మధ్య ఒక సందర్భంలో ఓ భారతీయ రచయితకు వెల్లడించారు. అందువల్లనే వింగ్ కమాండర్ వర్ధమాన్ అభినందన్ ఫిబ్రవరి 2019లో బాలాకోట్‌పై భారత వాయుసేన వైమానిక దాడుల తర్వాత ఆలస్యం లేకుండా పాక్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆగస్టు 2019లో జమ్మూకశ్మీర్ రాజ్యాంగ హోదాను మార్చడం పాకిస్థాన్ ప్రణాళికలను తారుమారు చేసింది. కోపోద్రిక్తుడైన ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగా మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ద్వైపాక్షిక సంబంధాలను తగ్గించారు. అయితే జనరల్ బజ్వాకు చైనా జనరల్ సెక్రటరీ జీ జిన్‌పింగ్ ఓపిక పట్టాలని సలహా ఇచ్చారు. బ్రిటన్ నుంచి హాంకాంగ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి చైనాకు 98 ఏళ్లు పట్టిందని, పోర్చుగల్ నుంచి మకావును స్వాధీనం చేసుకోవడానికి 103 ఏళ్లు పట్టిందని జిన్‌పింగ్ ఈ సందర్భంగా బజ్వాకు గుర్తు చేశారు.
ఏదేమైనా, జనరల్ బజ్వా పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ జాతీయ భద్రతా విధానంపై దృష్టి సారించాలని, రెండు కారణాల వల్ల భారత దేశంతో శాంతిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఒకటి భారతదేశంతో వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం. ఇది జాతీయ భద్రతను సాధించడంలో సహాయపడుతుంది, రెండు, మారిన యుద్ధం సవాళ్లను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సైన్యాన్ని ఆధునీకరించడం. ఇది ఫిబ్రవరి 2021 నుండి భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు దారితీసింది. జనరల్ బజ్వా ఈ మధ్య ఓ సందర్భంలో మాట్లాడుతూ పాకిస్తాన్ సైన్యం చేసిన ఒక ప్రధాన అధ్యయనం ఫలితంగా ప్రస్తుతం 5,38,000గా ఉన్న పాకిస్తాన్ సైన్యం ప్రస్తుత బలాన్నిగణనీయంగా ఐదు సంవత్సరాలలో తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మిలిటరీని ముఖ్యంగా ఫైర్ పవర్, సైబర్ ఆధునికీకరణ పట్ల దృష్టి కేంద్రీకరించాలని భావించారు. అందుకోసం తగు వ్యవధికి భారత్‌తో ప్రస్తుతం ఘర్షణకు సిద్ధంగా లేరు.
పాకిస్తాన్, అమెరికా, రష్యా విధానాలపై కూడా జనరల్ బజ్వా, ఇమ్రాన్ ఖాన్ విభేదించిన్నట్లు తెలుస్తున్నది. జనరల్ బజ్వా అమెరికా, చైనా రెండింటితో సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వగా, ఇమ్రాన్ ఖాన్ చైనా దాని వ్యూహాత్మక భాగస్వామి రష్యాతో సంబంధాలను కోరుకున్నారు. అమెరికాతో సంబంధాల విషయంలో పాకిస్తాన్ చేదు అనుభవాన్ని ఎదుర్కొంటున్నా తమ ఆర్థిక వ్యవస్థ స్థితిని బట్టి ఆ దేశంతో సంబంధాలు ముఖ్యమైనవిగా మారాయి. పాకిస్తాన్ సైన్యం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఎటిఎఫ్) గ్రే లిస్ట్ నుండి బయటపడేందుకు ఆసక్తిగా చూసింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి అనేక ఎఫ్‌ఎటిఎఫ్ సభ్యుల నుండి సైనిక సామగ్రిని కోరుతోంది. మరోవైపు, అఫ్ఘానిస్తాన్‌లో పాకిస్థాన్ సైనిక స్థావరాలను అమెరికా కోరుతుందని ఖాన్ ఆరోపించారు. అయితే అమెరికా,- చైనాల మధ్య వివాదాలు ముదురుతూ ఉండడం పాకిస్థాన్‌ను ఇరకాటంలో పడవేస్తుంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా రష్యాకు దగ్గర కావడం అవసరమే అయినప్పటికీ సైన్యం – పౌర పాలనా యంత్రాంగం పరస్పర అవగాహనతో విదేశీ, రక్షణ వ్యూహాలను రూపొందించుకోవడం చాలా అవసరం. ఈ విషయం లో ఇమ్రాన్ ఖాన్ ధోరణులు ప్రతిబంధకాలుగా పాక్ సైన్యం భావించినట్లు కనిపిస్తున్నది. పాకిస్తాన్ పౌరపాలనా యంత్రాంగంపై సైనిక ఆధిపత్యం తగ్గితే గాని భారత్, – పాక్‌ల మధ్య పూర్తి స్థాయిలో సాధారణ సంబంధాలు ఏర్పడే అవకాశం లేదు. అటువంటి అవకాశాలు ఇప్పట్లో లేవని ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం వెల్లడి చేస్తుంది. వ్యూహాత్మక అవసరాల కోసం భారత్‌తో పాక్ స్నేహహస్తం ఇవ్వజూపినా మన జాగ్రత్తలో మనం ఉండవలసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News